- ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది
- భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
- నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష సంస్కృతికి మోడీ ప్రభుత్వం తెర లేపిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న 146 మంది ఎంపీలను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టి ప్రజాస్వామికంగా నల్ల చట్టాల బిల్లును బిజెపి పాస్ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి బిజెపిని గెలిపిస్తే మరో 200 ఏళ్ళు దేశం వెనక్కి పోతుందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జేఏసీ ఆఫ్ సెక్యులర్ డెమొక్రటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని’ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్లుమాడభూషి శ్రీధర్, సత్యనారాయణ, పిఎల్.విశ్వేశ్వరరావు, జర్నలిస్టు విటల్, సోహరా బేగంలు మాట్లాడుతూ అక్రమంగా బిజెపి వందల చట్టాలను వాళ్లకు కావాల్సినట్లుగా మార్చిందని, ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం అని వారు అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల్లో 6, 7 చట్టాలను మార్చిందని అన్నారు. దేశం ప్రమాదంలో పడిరదని, నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు.
బిజెపి సర్కార్ దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బిజెపి చెప్పు చేతుల్లో పని చేస్తున్నాయని అన్నారు. చదువుకున్న మేధావులు బిజెపిని సమర్థించడం దేశ భవిషత్తుకు ప్రమాదం అన్నారు. బిజెపి అరాచకాలను ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్ గా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 తర్వాత బిజెపి అధికారంలోకి వస్తే ప్రశ్నించిన వారిని, ప్రజాస్వామ్యవాదులను జైల్లో పెడతారని, ఇందులో సందేహం లేదని వారన్నారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు కచ్చితంగా గెలుస్తామని వారు చెప్పడం ఈవీఎం ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నానే అనుమానాలకు తావిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు తిరగబడతారని, అనుమానం రాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేదని వారు అన్నారు.
ఇటీవల ఉత్తరాదిలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడం కూడా ట్యాంపరింగ్ అని వారు ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాడటం లేదని అన్నారు. వివి ప్యాట్లకు, పోలైన ఓట్లకు సంబంధం లేకుండా ఉందని అన్నారు. బ్యాలెట్ తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని అన్నారు. తక్షణమే ఈవిఎంలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాకు 56 సీట్లు ఉన్నాయని కేటీఆర్ అనడం బిజెపి, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక్కటే అనే విషయం స్పష్టమైందని అన్నారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవిత సనాతన ధర్మం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులను కాపాడుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు.





