బాధ్యులం మనమే! – బాధితులం మనమే!

“సమాజంలో నమోదయ్యే క్రైంకేసులలో ఎక్కువ శాతం మద్యం, జెండర్‌ ‌వివక్షే కారణమని తేలుతుంది. మహిళలను డిపెండెంట్లుగా, కామవాంఛను తీర్చే వస్తువుగా పురుషాధిక్య సమాజం భావి స్తుంది. కుటుంబంలో మహిళ తమ సొంత ఆస్తిగా,సొంత వస్తువుగానే భావిస్తూ తమ అభిప్రాయాలకు, ఇష్టాలకు భిన్నంగా ప్రవర్తించటం పై ఆంక్షలు పెట్టటం సాధారణంగా మారింది. తేడాలొచ్చినచోట వావి వరుసలు,వయోభేదాలు లేకుండా మహిళలపై పురుషులు హింసకు దిగజారిన సంఘటనలు కోకొల్లలు.”

సమాజంలోనూ, కుటుంబంలోనూ అత్యంత సాధారణంగా ఆమోదయోగ్యంగా వున్న జెండర్‌ ఆధిక్యత, కులం వివక్షల యొక్క ఫలితాల పరాకాష్ట ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వీటిని మనం సీరియస్‌ ‌గా తీసుకోలేక పోతున్న కారణంగానే ఇవి అనేక దుస్సంఘటటనలకు కారణమ వుతున్నాయి. ఇవి కుటుంబాల విచ్ఛిన్నం,మహిళల,చిన్న పిల్లల జీవనం దుర్భరం చేస్తున్నప్పటికీ దీనిని ప్రధాన సమస్యలుగా భావించటంలో మనం వెనుకబడే వున్నాము.ముక్కు పచ్చలారని పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న తల్లుల సంఘటనలు ఇటీవల వరుసగా వింటున్నాం.ఒకే గర్భాన పుట్టే ఆడ,మగలో మగ పెత్తనందారుగా, కుటుంబ యజమానిగా పరిణామం చెందటం, ఆడ బానిసగా, పరాధీనగా మారటం వెనుక కారణాలైన ధర్మ సూత్రాలేమిటనేది చర్చ జరగాలి.విచిత్రంగా ఈ జెండర్‌ ‌వివక్షకు మత భేదాలు లేవు. ధనిక,పేద భేదాలు లేవు. వయసుకు సంబంధించిన భేదాలులేవు.సమాజంలో నమోదయ్యే క్రైంకేసులలో ఎక్కువ శాతం మద్యం, జెండర్‌ ‌వివక్షే కారణమని తేలుతుంది.మహిళలను డిపెండెంట్లుగా, కామవాంఛను తీర్చే వస్తువుగా పురుషాధిక్య సమాజం భావి స్తుంది. కుటుంబంలో మహిళ తమ సొంత ఆస్తిగా,సొంత వస్తువుగానే భావిస్తూ తమ అభిప్రాయాలకు, ఇష్టాలకు భిన్నంగా ప్రవర్తించటం పై ఆంక్షలు పెట్టటం సాధారణంగా మారింది. తేడాలొచ్చినచోట వావి వరుసలు,వయోభేదాలు లేకుండా మహిళలపై పురుషులు హింసకు దిగజారిన సంఘటనలు కోకొల్లలు.

పదవ తరగతి చదివే 14 సంవత్సరాల అమ్మాయి బడికి వెళ్ళాలంటే ఏడెనిమిదేళ్ళ తమ్మున్ని తోడుగా వెళ్ళమని చెప్పే తల్లిదండ్రులు మగ సంతానాన్ని ప్రయివేట్‌ ‌చదువులకు, ఆడ సంతానాన్ని సర్కార్‌ ‌చదువులకుపంపించే తల్లిదండ్రులు కుటుంబాలలో పెంచుతున్న వివక్ష ఏ భావజాల వ్యాప్తికి తోడ్పడుతుందో గమనించాలి.. ఈ భావజాలం సమాజంలో నేడు సర్వదా ఆమోదయోగ్యంగా ఛలామణీ అవుతున్నది.
దీని మూలాలు చిన్నతనాన క్రమశిక్షణ పేరిట నేర్పించే మతం, ధర్మం పాఠాల ద్వారానే మొదలవుతున్నాయి. స్త్రీని బానిసకన్నా హీనంగా చూస్తున్న వివిధ ణమతధర్మాలు, మనుధర్మ సూత్రాలు ఈ జెండర్‌ ‌వివక్షకు పురుడు పోస్తున్నాయన్న విషయం మరచిపోరాదు. వచ్చిరాని మీసాల వయసులో మగ హీరోలు సోషల్‌ ‌మీడియా యూనివర్సిటిల్లో జ్ఞానసంపన్నులై మహిళలు కేవలం లైంగిక సుఖానికి మాత్రమే పనికి వచ్చే రక్తమాంసాల శరీరమనే భావనతో మైండ్‌ ‌సెట్‌ ‌చేసుకుంటున్నారు. పన్నేండేళ్ళ పిల్లవాడు పక్కింటమ్మాయిని గర్భవతిని చేయటం, పదహారేళ్ళ పిల్లవాడు డెబ్బెయేళ్ళ మహిళను రేప్‌ ‌చేయటం,ఇటీవల వరంగల్‌ ‌లో డెబ్బయేళ్ళ ముదుసలి వ్యక్తి ఏడేళ్ళ పాపపై అత్యాచార యత్నం.. ఇవన్నింటికీ మూలాలు ఎక్కడినుండి వచ్చాయనేది పరిశీలించాలి.

స్త్రీ కి సొంత ఆలోచన వుండకూడదు, అన్నలు, తమ్ముళ్ళు, నాయన, భర్త.. ముసలితనాన కొడుకు పెత్తనం కింద పరాధీన జీవనం గడపాల్సిందేనన్న సమాజ సూత్రంఅంతటా ఆమోద యోగ్యంగా భావించబడుతుందే కానీ,ఇదేమని ప్రశ్నించటం కనిపించదు. ఫలితంగా మహిళలు సైతం సమాజం ఈ తీరును ప్రశ్నించకుండా తలలూపుతూ ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు. డిగ్రీ చదివే అమ్మాయిలైనా సరే స్నేహితురాండ్ర ఇంటికో, సినిమాకో, షాపింగ్‌ ‌కో వెళ్ళాలంటే ఇంట్లో ఆంక్షలు భరించలేకుండా వుంటాయి.నాన్న లేని కుటుంబాలలో అన్నలదే రాజ్యం.చదువున్నా,లేకున్నా అతనిదే శాసనం.విశేషంగా తల్లిపై కూడా పెత్తనం వాడిదే వుంటుంది. చెల్లెలు పక్కింటబ్బాయితో మాట్లాడినా నేరం.పొరబాటున క్లాస్‌ ‌మేట్‌ ‌బైక్‌ ‌పై లిఫ్ట్ ‌తీసుకొని ప్రయాణించటం మరీ నేరం.అనుకోకుండా పనిబడి కాలేజ్‌ ‌నుండి అరగంట ఆలస్యంగా వస్తే ‘‘చెల్లెలు పై ఓ కన్నేసి వుంచురా! ‘‘అని కొడుకు కు కాపలాపనులు అప్పగించే తల్లులున్న సమాజం మనది ఇరవై యేళ్ళు నిండని కొడుకు బీర్లు తాగి రాత్రులు ఆలస్యంగా వస్తే లేని సమస్య కూతురు నోట్స్ ‌కోసం ఫ్రెండ్‌ ఇం‌టికి వెళ్ళటం మాత్రం సమస్య అవుతుంది… పురుషస్వామ్య సమాజంలో ఏ వయసు మహిళైనా ఇంటిలోని పురుష పెత్తనానికి జీ.హుజూరంటూ బతకాలనేది నేటి కుటుంబ లక్షణంగా మారింది. ఏ వయసు లోనైనా మహిళ తాను ధరించే దుస్తులు, హెయిర్‌ ‌స్టైల్‌, ‌చివరకు చెప్పుల విషయంలో కూడా ఇంటి మగపెత్తందారు చెప్పినట్టు వినాల్సిందే! రోడ్‌ ‌పై కనిపించే ప్రతి మహిళ లైంగిక సుఖం అందించే వస్తువుగా భావించే అన్నలు ఇంటివద్ద మాత్రం చెల్లెళ్ళను క్రమశిక్షణతో చూస్తామని ముందుకొస్తారు. చెల్లెలు ప్రతి కదలికపై నిఘాలు పెడ్తూ,నిత్యనుమానాలతో ప్రవర్తిస్తారు. తాము చెప్పిన మాటకు ఎదురు చెప్పినా,తమ ఇష్టాలకు వ్యతిరేకంగా నడిచినా అన్న లోని పెత్తందారితనం అంగీకరి ంచదు. ఈ అహంకా రపూరిత వైఖరుల ఫలితమే నాగరాజు హత్య.

సమాజంలో మతం,కులం భావనలు పెంచటమనేది నేడు రాజకీయపక్షాల ప్రధానవసరంగా మారింది.ఈ మత్తుమందు ఓట్లు కురిపించేందుకు తప్పక దోహదపడుతాయని క్షేత్రస్థాయి నుండి ప్రజలను మతాల వారీగా,కులాల వారీగా, వర్గాలుగా విడదీస్తూ ఎన్నికల పబ్బంగడుపు కుంటున్నాయి. కులసంఘాలకు, పండుగల నిర్వహణలకు సమాజంలో అధిక ప్రాధాన్యత కలిగించటం ఒక పద్దతి ప్రకారం కానిస్తున్నారు.అన్ని మతాలలోనూ ప్రార్ధనాకేంద్రాలను ప్రధానబిందువుగా చేస్తూ వివిధ కార్యక్రమాల పేరిట ప్రజలను మతంమత్తులో ముంచటం బాహటంగా కొనసాగుతూంది.ఇది ఓట్లుగా పురుడు పోసుకొని రాజకీయావసరాలు తీర్చటం నాయకులకు,వారి అనుచర వర్గాలకు అవసరం.ప్రతి కులానికి ఒక కార్పోరేషన్‌ ఏర్పాటు, గొర్రెల,బర్రెల యూనిట్లు,దళిత బంధు హామీలు ఏ సందేశాన్ని ప్రజలలోకి పంపుతున్నదో యోచించాలి. కులం,మతం వారిగా ప్రజలను చీల్చటం యొక్క పర్యవసానాలు,ఫలితాలు సమాజంపై అత్యంత ప్రమాదకరమైన ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని అర్ధంచే సుకోవటంలో మధ్య, కింది దళితకులాలు, మైనారిటీలు వెనుకబడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, లక్ష్యంతో మైనారిటీలు, దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వేధింపులు, హింసల వెనుక ఎవరి ప్రయోజనాలు,ఏ ప్రయోజనాలు దాగున్నాయో అవగతం చేసుకోవటానికి ప్రయత్నం జరగాలి.ఈ దేశం ఒకే మతానికి చెందిందనే విషప్రచారానికి పాల్పడే పరివారం ప్రచారం గత ఎనిమిదేళ్ళలో సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపింది. భిన్నత్వంలో ఏకత్వమనే భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూన్నది.కొన్ని వందల సంవత్స రాలుగా హిందూ ముస్లీం లు కలిసి కొనసాగిస్తున్న ఐక్యతకు ప్రధాన ఉదాహరణలైన లక్నో, ఢిల్లీ, హైదరాబాద్‌ ‌లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇప్పడు దేశం పేరిట,ధర్మం పేరిట ముస్లీం సామాజిక వర్గానికి, హిందుమతంలోని మధ్య, కింది, దళిత కులాలకు మధ్య విభేదాలు పెరగటం వెనుక ఏ ధర్మ శాస్త్రాలున్నాయో, ఏ సోషల్‌ ‌మీడియా సైన్యం హస్తముందో క్షేత్రస్థాయిలో ప్రచారం జరగాల్సిన ఆవసరముంది.ఆగ్రకులాల సమానంగాదోపిడీ కి గురవుతున్న దళిత మైనారిటీల మధ్య తరాలుగా వున్న ఐక్యత పెరగాల్సిన అవసరం గుర్తించాలి. ఇదే సమయంలో ఆగ్రకులాల దోపిడికి గురయ్యే దళిత,మైనారిటీల మధ్య దూరాలు పెంచే కలుపుమొక్కలను ఏరివేయటం ప్రజాస్వామ్యవాదులందరి కర్తవ్యం కావాలి.

ఈ జమిలి భావజాల వ్యాప్తి పరాకాష్టనే
నాగరాజు పరువు హత్య!
ఈ దుస్సంఘటనకు జెండర్‌ ‌వివక్ష ప్రధాన కారణంగా చూడాలి.దానితో పాటు హతుడు నాగరాజు దళితుడు కావటం కూడా కారణంగానే భావించాలి.హత్యక పాల్పడ్డ వ్యక్తి మైనారిటీ అయినా,మరొక సామాజిక వర్గమైనా కానీ జెండర్‌ అహంకారం అనే దానిని తీసిపారేయలేము.నాగరాజు దళితుడు కాకుంటే పర్యవసానాలు ఎలా వుండేవో అనేది కూడా పరిశీలించాలి. కానీ ఇక్కడ హతుడు నాగరాజు దళితుడు,అమ్మాయి అశ్రీన్‌ ‌మైనారిటీ,ఇద్దరు సమాజంలో పెద్ద కులాల దోపిడికి గురయ్యే సామాజిక వర్గానికి చెందిన వారేననే ప్రధాన అంశాన్ని విస్మరించరాదు.పైగా హైస్కూల్‌ ‌స్థాయి నుండి స్నేహితులు, ఒకరిని మరొకరు అర్ధం చేసుకున్న వారు.వారి స్నేహం వారి వయసు తో పాటే పెరిగింది. రెండు జెండర్‌ ‌ల మధ్య స్నేహం పెరిగినప్పుడు పెళ్ళితో దానిని కొనసాగించుకోవటం చాలా సందర్భాలలో చూస్తుంటాం. వీరిద్దరి మధ్య ఈ బంధం బలపడటం మొదటి నుండీ ఇష్టపడని అమ్మాయి కుటుంబం వైపు నుండి ప్రమాదం మొదటి నుండి ఊహించినదే! కన్నకూతురు ఇష్టం పై అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబం సహజంగానే పాజిటివ్‌ ‌గా ఆలోచిం చలేదు. ఈ విషయంపై ముందే అవగాహన వున్న ఫలితంగా అమ్మాయి ఇంటి నుండి బయటకువచ్చి అబ్బాయిని చేరింది. కనీసం అప్పుడైనా అమ్మాయి కుటుంబం కుమార్తె ఇష్టం పై పాజిటివ్‌ ‌గా స్పందించలేదు. సహజంగా అప్పుడు అన్నగారు కుటుంబ పరువు కాపాడే బాధ్యతలు తనవిగా భావించి హీరో యిజం చేయటం మనం చూస్తుండేదే! అమ్మాయి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ఆ కుటుంబం శాసనం చేయటం, అన్నలు ఆ శాసనాన్ని ఆమలు చేయటం ఇంటికి సంబంధించిన పరువు మర్యాదలుగా చూడబడుతున్నాయి. కానీ, అమ్మాయి స్వేచ్ఛ, అభిప్రాయాలకు ఇంచుక విలువ వుండదా!?. వేటాడి,వెంటాడి చెల్లెలు ముందే, చెల్లెలు చేసుకున్న నాగరాజును పబ్లిక్‌ ‌గా గడ్డపారతో తల పగులకొట్టి చంపేశాడు.

సినిమాల్లో హీరోలు రకరకాల ఆయుధాలతో నడిరోడ్లపై రక్తపాతం సృష్టిస్తుంటే మనం విజిల్స్ ‌వేసినట్టే నాగరాజు హత్యను దగ్గర నుండి చూస్తూ కూడా చుట్టూరా వున్న జనం హత్యను ఆపలేకపోయారు.హంతకుడు ఆశ్రీన్‌ ‌తోడబుట్టిన సోదరుడు.తన అభిప్రాయానికి భిన్నంగా ప్రేమ వివాహం చేసుకుందనే పురుషాంహంకారం అనే అంశం ఇక్కడ ప్రధానమైనది. కుటుంబంలో ఆడపిల్లలకు సొంత అభిప్రాయాలు, హక్కులు వుండకూడదా! తను జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తిగా తన చిన్ననాటి స్నేహితున్ని ఎంచుకోవటం ఆమె ఇష్టం.దానిని ఆశ్రీన్‌ ‌తల్లిదండ్రులు కుటుంబ పరువుమర్యాదల సమస్యగా తీసుకోవటం ఉపద్రవాన్ని తెచ్చింది. పొయినవని భావించే పరువు మర్యాదలు నాగరాజు హత్య తో తిరిగి రావు.కానీ హంతకుడి పురుషాధిక్య అహంకారం హత్యకు ఉసిగొల్పింది. నాగరాజు దళితుడు కావటం మరింత ఊతమయింది. కళ్ళెదుటే భర్తను గడ్డపొరతో కొట్టి చంపుతున్న అన్ననుండి, భర్తను కాపాడుకోలేకపోయిన అమ్మాయి కి ఏ న్యాయస్థానాలు, ఏ మత ధర్మాలూ,ఏ చట్టాలూ ఏం చేసినా నాగరాజును మాత్రం తెచ్చివ్వలేవు. మృతుడు దళితుడు కాబట్టి నిరసనలు గొంతెత్తటంలో శషభిషలు కనిపించాయి.మతం కోణంలో చూపెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నాలు మొద లయ్యాయి. మృతుడు దళితుడు కాబట్టి మీడియా కూడా ‘‘తగురీతి’’లోనే స్పందించాయి.ఏ సామాజిక వర్గానికి చెందిన వారు చేసినా ఇది హింసనే!పక్కా స్కెచ్‌ ‌తో,రెక్కీలతో చేసిన ఉద్దేశపూర్వక హింస.నిందితుడిని ఉరిశిక్ష వేయాలి,లేదా సజ్జనారిజం ప్రయోగించాలనే అభిప్రాయాలు వినొస్తున్నాయి.

అలా చేసినంత మాత్రాన ఇక పై పరువు హత్యలు జరుగవనే గ్యారెంటీ ఇవ్వగలమా! అనేది ప్రశ్నించుకోవాలి.
‘‘సజ్జనారిజం’’ సరైనదే అయితే , ఈ సమస్యల పరిష్కారానికి మార్గమే అయితే నేరస్థులందరూ బుద్దిజీవులై పోవాలి. నేరాల శాతం తగ్గిపోవాలి. గత కొద్ది కాలంగా విపరీతంగా బాలికలపై అత్యాచారపు కేసులు వెలుగు చూస్తున్నాయి.వెలుగు చూడనివెన్నో లెక్కలు వేయలేం! సమాజంలో లైంగిక నేరాలు, హింసా ప్రవృత్తి తగ్గటానికి చట్టం పట్ల భయం లేకపోవడమే కారణమని భావించాలా! కుటుంబాలలో ఆమోదయోగ్యంగా వున్న జెండర్‌ ఆధిక్యత,సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మం పేరిట మత ప్రచారం,దాని రెక్కల చాటున కుల, విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు, సెల్యులాయిడ్‌, ‌సోషల్‌ ‌మీడియాలన్నీ కూడా కారణాలుగానే భావించాలా! సంఘటనాస్థలిలో చుట్టూరా నిలబడి వీడియోలు తీసిన జనమేకనుక కలిసికట్టుగా ప్రతిఘటిస్తే మాత్రం నాగరాజు హత్యకు గురయ్యేవాడు కాదనేది సత్యం!ఏ మాయపొరలు లేకుండా వాస్తవదృష్టితో సంఘటనను పరిశీలించటం అవసరం. చట్టం, న్యాయాలు ఏం చేసినా ఆశ్రీన్‌ ‌కన్నీటి వేధననైతే తీర్చలేవు.ఇంకా భవిష్యత్‌ ‌లో కొత్తగా ఆశ్రీన్‌ ‌వంటి బాధితులు ఉండబోరని హామీ ఇవ్వలేవు.
– అజయ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page