పోచారం కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించాం

– రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ యమ్నంపేట్‌ వద్ద బుధవారం సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్‌ కార్యకర్త బిద్ల ప్రసాంత్‌ అలియాస్‌ సోనుసింగ్‌ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రధాన నిందితుడు ఏ1 మొహమ్మద్‌ ఇబ్రహీం ఖురేషీని అరెస్టు చేశామని, సహ నిందితులు ఏ3 కురువ శ్రీనివాస్‌, ఏ4 హసన్‌ బిన్‌ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు ఏ2 హనీఫ్‌ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు. ఇబ్రహీం పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, గోవుల అక్రమ రవాణా బయటపెట్టాడని ప్రశాంత్‌పై నిందితులు కక్ష పెట్టుకున్నారని తెలిపారు. ఇబ్రహీం, బాధితుడు సోను సింగ్‌కు గతంలో పరిచయం ఉందని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇబ్రహీం 12 సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, ప్రశాంత్‌ గతంలో ఆరుసార్లు పశువుల అక్రమ రవాణా అడ్డుకున్నాడని తెలిపారు. దాంతో ఇబ్రహీంకు రూ.కోటి నష్టం వచ్చిందన్నారు. ఈ క్రమంలో సోనూ సింగ్‌ అలియాస్‌ ప్రశాంత్‌పై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడని, పశువులను రవాణా చేసుకోవాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్‌ డిమాండ్‌ చేశాడని నిందితులు చెబుతున్నారని, దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ సెటిల్‌ చేసుకుందాం, మాట్లాడుకుందామని చెప్పి ప్రశాంత్‌ను స్పాట్‌కు రప్పించి కాల్పులు జరిపి పారిపోయారన్నారు. పిస్టల్‌ను ఛత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వాడిన వాహనాన్ని సీజ్‌ చేశామని, ఒక పిస్టల్‌, మూడు సెల్‌ఫోన్లు సీజ్‌ చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 5110 పశువుల్ని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 288 కేసులు నమోదు చేసినట్లు సుధీర్‌ బాబు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page