నలుబయి సంవత్సరాలు పైబడి బి.సి విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడి, అనేక సమస్యల పరిష్కారానికి వందల జీవోలు తెచ్చిన మాజీ శాసనసభ్యులు, జాతీయ బి.సి సంఘం అధ్యక్షులు ర్యాగ కృష్ణయ్యను రాజ్యసభకు అభ్యర్థిగా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. తెరపైకి అనూహ్యంగా ఆయన పేరు వచ్చినట్లు, అనుకోని అదృష్టం వరించినట్లు అనేక సార్లు పార్టీ మారి అవకాశవాదంతో అవకాశం దక్కించుకున్నట్లు ఒక సుదీర్ఘకాలం బి.సి ఇతర అట్టడుగు వర్గాల కోసం పని చేసిన నాయకుడిపై వాఖ్యలు సరి అయినవి కావు.
కృష్ణయ్య ఎంపికపై తెలుగుదేశం అనుచిత వాఖ్యలు అన్యాయమైనవి. తెలుగుదేశం కూడా తెలంగాణలో గతంలో అనేక మంది సామాన్య ప్రజాజీవిత అట్టడుగు కులాలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరో పార్టీ ఆ పని చేసినప్పుడు అన్ని పార్టీలు బెంచ్ మార్క్‌గా తీసుకోవాలి. విడిపోయిన తెలుగు రాష్ట్రంలో ఆకునూరి మురళి, జప్టిస్ ఈశ్వరయ్య, డా.శ్రీనాధ్‌రెడ్డి, ఆర్. వెంకటరెడ్డి ఇంకా ఎందరో ప్రజాహిత శాఖల్లో సేవలను అందిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏమి నేర్చుకున్నట్లు..? ఆర్. కృష్ణయ్యకు ఉన్న పరిమితులు, బలహీనతలు, రాజీ వైఖరిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా స్థూలంగా ఆయన రెండు రాష్ట్రాల ప్రజల, ప్రజా ప్రతినిధుల హక్కుల కోసం చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంపిక తరువాత, జాతీయ స్థాయిలో ఓ.బి.సి సమస్యలపై విశాల వేదిక, రాజకీయ పార్టీలతో చర్చలకు చిత్తశుద్ధితో పని చేయాలని ఆశిద్దాం.
ఇప్పటికే చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వాలని, పదోన్నతులతో రిజర్వేషన్ల అమలుకు కూడా వైఎస్సార్ సిపి పార్లమెంట్‌లో చొరవ చూపెట్టినందున ఈ డిమాండ్లపై అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలి. బి.సి లకు రాజ్యాధికారం దిశగా రాజకీయ పునరేకీకరణ, ఉద్యమాలకు ఆర్. కృష్ణయ్య ముందుకు వచ్చినా, రాకపోయినా ఆయనపై ఇప్పుడు దుమ్మెత్తిపోయడం కంటే ఆచరణాత్మకంగా కృషిలో నిరూపించాలి. ఏ పార్టీలు బి.సీ. లకు వ్యూహాత్మకంగా తప్ప చిత్తశుద్దితో సముచిత స్థానంకై ముందుకు రావడం లేదన్న అపప్రదకు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ మినహాయింపు కాదని గుర్తు చేస్తున్నాం. కృష్ణయ్య తన విస్త్రుత అనుభవాన్ని పెద్దల పభలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం.
– డా.చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు