‘‘పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’
నేడు ‘‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే’’
ప్రపంచంలో జరిగే సంఘటనలను, వార్తలుగా సామాన్య జనానికి చెరవేసే బాధ్యత పత్రికలకుంది. పత్రికలకు ఉండే భావ స్వేచ్చ హరించబడితే ప్రజలు అజ్ఞానంలో అలమటించక తప్పదు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు నాలుగో స్థంబం వంటివి. అందుకే పత్రికా స్వేచ్ఛ కాపాడబడాలి. మానవ మేథస్సు నిరంతర జ్ఞాన సముపార్జనకు ఆలవాలం.’’పరిశీలన-విశ్లేషణ-పరి
కొత్తదనం కోరుకోవడం మానవ జిజ్ఞాసకు పదును పెట్టింది.వ్యక్తుల మధ్య భావ ప్రకటనకు భాష ఉపయోగపడినా, ప్రజల మధ్య జరిగే సంఘటనలు ప్రజలందరికీ వార్తల రూపంలో అందుబాటులోకి రావడానికి కాగితం,ముద్రణ వంటి సౌకర్యాలు లేకపోవడం వలన మానవ సంకల్పం మరింతగా పదునెక్కింది. అహర్నిశలు శ్రమించి, కాగితం, ముద్రణ వంటి ఆవిష్కరణలకు అంకురార్పణ చేశారు. అవిశ్రాంతమైన కృషి ఫలితంగా ప్రజలకు పత్రికల రూపంలో వార్తలు అందిచబడుతున్నాయి. 15 వ శతాబ్ధం ప్రారంభంలోనే లారెన్స్ కాస్టర్ ఒక పుస్తకాన్ని ముద్రింటినట్టు తెలుస్తున్నది. అదే తొలి ముద్రణ గా కొంతమంది పేర్కొంటు న్నప్పటికీ, జర్మనీకి చెందిన జోహాన్స్ గూటెన్ బర్గ్ మొదటి సారి ముద్రణా యంత్రాన్ని కనుగొన్న వ్యకిగా ప్రపంచం గుర్తించింది. జర్మనీ తరువాత ఇటలీ,ఫ్రాన్స్ దేశాల్లో ముద్రణ ప్రారంభమైనది. ముద్రణా యంత్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత జర్మనీకి చెందిన’’జోహాన్ కరోలస్’’ నెలకొల్పిన ‘‘రిలేషన్’’ వార పత్రిక ‘‘వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్’’ వారిచే ప్రపంచంలోనే తొలి పత్రికగా గుర్తించబడింది. కాలక్రమంలో పత్రికా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.దిన,వార,పక్ష,మాస పత్రికల రూపంలో వివిధ రంగాలకు చెందిన వార్తలు జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చాయి. సమాచారవ్యవస్థలో ఎన్ని మార్పులు చోటు చేసు కుంటున్నప్పటికీ కాగితం పై ముద్రించబడుతున్న పత్రికల స్థానం ఈనాటికీ చెక్కుచెదరకుండా తన అస్థిత్వాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న సంఘటనల ఆధా రంగా ప్రచురించబడుతూ, ప్రజలకు వార్తలను చేరవేయడంలో పత్రికలు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయం. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. అక్షరం ఒక ఆయుధం. అక్షరం ఒక శరం.తమ అక్షర తూణీరం లోని శరాలను సంధించి అజ్ఞాన గాడాంధకారాన్ని చేధించడంలో పత్రికారంగం పాత్ర శ్లాఘనీయం. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థ కు ఆలవాలం. కాబట్టి పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి.
పత్రిక అంటే నాలుగు మాటలతో,నాలుగు వార్తలతో నింపబడే కాగితం కాదు. పత్రిక అంటే ప్రపంచం నలుదిక్కులా జరిగే వాస్తవ సంఘటనలను ప్రజల కనుల ముందు సాక్ష్యాత్కరింప చేసే ఒక యథార్ధ దర్శిని. వాస్తవాలకు అక్షరరూపం కల్పించి, సమాజాన్ని చైతన్య పరిచే ఒక జ్ఞాన దర్శిని. వాస్తవానికి ప్రతిరూపం…ఇజాలు లేని నిజాలకు నిలువెత్తు దర్పణం ‘‘పత్రిక’’. ప్రభుత్వాలకు, ప్రజలకు అనుసంధాన కర్త ‘‘పత్రిక’’. పత్రికలు లేని ప్రపంచ ప్రస్థానం అజ్ఞాన తిమిరాంధ కారమనే అగాథాల్లో పడి కొట్టుమిట్టాడుతూ, నడి సంద్రంలో పయనించే చుక్కాని లేని నావ వంటిది. సమాజానికి మార్గనిర్ధేశనం చేసే అతి శక్తివంతమైన అక్షరాయుధం ‘‘పత్రిక’’ ఈ రోజు ప్రపంచంలోని అత్యధికశాతం ప్రజలంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే దానికి పత్రికలే ప్రధాన కారణం. ప్రజాస్వామ్య వ్యవస్థలు అంకురించడానికి, ధరిత్రిపై ఈ మాత్రమైనా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసరించడానికి పత్రికార ంగమే పరోక్ష కారణం.
సైనిక పద ఘట్టనలతో మానవ హక్కులు అణగద్రొక్క బడుతున్న కాలంలో ఎంతో మంది నియంతల ఏలుబడిని ప్రశ్నించి, సైనిక పాలనను అంతమొందించిన ఉజ్వలమైన చరిత్ర పత్రికలకుంది. పరాయి పాలకుల చెంత దాస్యం చేసే పరాధీనత్వం నుండి విముక్తి కలిగించి, ప్రపంచంలోని పలు దేశాల ప్రజలకు స్వేచ్ఛా వాయువులందించడంలో ప్రధాన భూమిక వహించిన పత్రికా రంగం విశిష్ఠతను మరువరాదు. భయమంటే అర్ధం తెలియని మహామహులకు ముచ్చెమటలు పట్టించిన మహాయుధం పత్రిక. జ్ఞానం లేని జీవితం నిరర్ధకం. చైతన్యం లేని సమాజం శూన్యసదృశం. పత్రికలు లేని సమాజం అభివృద్ధికి శరాఘాతం. పూర్వకాలంలో మన చుట్టూ జరిగే సంఘటనలను తెలియచెప్పడానికి కొంతమంది అనధికార వార్తాహరులుగా పని చేసేవారు. రాచరిక వ్యవస్థలో వంధి మాగధుల స్తోత్ర పాఠాలే వాస్తవాలుగా భావించి, నిజానిజాల విశ్లేషణ,విచక్షణ లేకుండా ప్రభువుల పాలన కొనసాగింది. వాస్తవాలు విస్మరించడం వలన రాజుల భుజబల పరాక్రమాలను కీర్తించే వార్తాహరుల వలన ఎన్నో రాజ్యాలు శతృదేశాల దండయాత్రలకు గురైనాయి. నిజాలను కప్పిపుచ్చే వార్తలను గుడ్డిగా నమ్మడం,అసత్యాలను వీనుల విందుగా ఆలకించడం వలన చరిత్రలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. గత చరిత్రను పునరావలోకనం చేసుకుని, వాస్తవాధారిత కథనాలను ప్రచురించ వలసిన బాధ్యత నేటి ప్రపంచ పత్రికారంగం పై ఎంతైనా ఉంది.
‘‘స్వేచ్ఛ’’ జన్మతః సిద్ధించిన హక్కు. ఇది కాదలేని సత్యం.మన భావాలను ఇతరులకు ప్రస్ఫుటం చేయడానికి భావస్వేచ్ఛ ప్రధానం..సృష్టిలో అపారమైన తెలివి తేటలు గల మానవుడు ఇతర జీవరాశుల కంటే విభిన్నం. మానవుడు విచక్షణతో,వివేకంతో ఉన్నతమైన ఆలోచనలను అలవరచుకుని, ఇతరులకు అపకారం చేయకుండా సన్మార్గంలో నడవడానికి మన సమాజంలో నాటి పెద్దలు కొన్ని విధి విధానాలు రూపొందించారు. కాల క్రమేణా ప్రజలు సక్రమంగా జీవించడానికి కొన్ని వ్యవస్థలు రూపొందాయి. ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయవ్యవస్థలు ఏర్పడ్డాయి. ప్రజల స్వేచ్ఛను హరించే రాచరిక, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా పలుదేశాల్లో ప్రజాస్వామ్యం ఏర్పడింది. ప్రజల కోసం ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ప్రజలు స్వేచ్ఛను కోల్పోతే మానవ హక్కులు సందిగ్ధంలో పడతాయి.
ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు.నియంతల కరకు పాదాలు ప్రజల హక్కులను హరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ అడుగంటింది.ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు లేదు. ప్రశ్నించే గొంతులు మోగబోయి,కలమెత్తిన పాత్రికేయుల కరాలు అచేతనమై పోతున్నాయి.పత్రికా ప్రపంచం భవితవ్యం ప్రశార్థకంగా మారడం ఆందోళనకరం.కొన్ని దేశాల్లో జరిగే సంఘటనలు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి వెల్లడి కావడం లేదు. పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు, ఆధికారులు జవాబుదారీతనం, పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో, ఎక్కడైతే పత్రికలపై నియంత్రణ కొన సాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు. నియంతృత్వం ప్రబలుతుంది. అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు. ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించడానికి వివిధదేశాల్లో అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాలు రూపొందించబడ్డాయి. రాజ్యాంగాల ద్వారా ప్రజలకు కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఇవ్వబడ్డాయి. నియంతృత్వ వ్యవస్థలో ప్రజల స్వేచ్ఛ గురించి మాట్లాడడం వృథా ప్రయాస. అయితే ప్రజాస్వామ్య దేశాల్లో సైతం ప్రజల హక్కులు హరించబడడం ఆందోళన కరం.
ప్రజల హక్కులను పరిరక్షించడానికి పలు యంత్రాంగాలు ఏర్పడ్డాయి. ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ, ప్రభుత్వాలు చేస్తున్న మంచి చెడుల ను విశ్లేషించి, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లో కీలక బాధ్యత వహిస్తున్న అత్యంత ప్రధానమైన వ్యవస్థ పత్రికారంగం. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. ప్రభుత్వాల తప్పులను ఎండగట్టి, ప్రభుత్వ యంత్రాంగాల్లోని లొసుగులను ఎత్తిచూపి, ప్రజలకు సమాచారాన్ని అందించి, సమాజ పురోభివృద్ధి లో తన వంతు పాత్ర పోషిస్తున్న పత్రికా రంగాన్ని ప్రపంచానికి వెన్నెముకలా భావించడంలో అతిశయోక్తి లేదు. స్వేచ్ఛ అనేది సంఘంతో ముడిపడి, సమాజంలో ఎవరికీ హాని కలగని రీతిలో ఉండాలి. పత్రికా ప్రపంచం కూడా తమ స్వేచ్ఛను దేశ విశాల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి.