- ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి… పాతబస్తీలో భారీ బందోబస్తు
- రాత్రి పూట జోరుగా సాగిన షాపింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : నేడు రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న వి•రాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్ మసీదు, వజీర్‌అలీ మసీదు, హఫీజ్‌డంకా మసీదు, అప్జల్‌గంజ్ జామా మసీదు, సిద్దిఅంబర్ బజార్ మసీదులతోపాటు మాసాబ్‌ట్యాంక్‌లోని హాకీ స్టేడియం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెవెన్ టూంబ్స్, లంగర్‌హౌజ్, సికింద్రాబాద్, మాదన్నపేట్, కొత్తపేట్, కులీకుతుబ్‌షా స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియంలతో పాటు వివిధ ఈద్గాలు, మైదానాల్లో ప్రత్యేక నమాజ్‌లు సాగుతాయి.
రంజాన్ పండుగ భారత్‌లో మంగళవారం జరపాలని మతపెద్దలు నిర్ణయించారు. పండగ నిర్ధారణకు హేతువైన నెలవంక దర్శనమివ్వకపోవడంతో ఈదుల్ ఫితర్‌కు సిద్ధం అయ్యారు. ముస్లిం ఉలేమాలు, ముఫ్తీలతో కూడిన రుహితే హిలాల్ కమిటీ నిర్ణయం మేరకు దీనిని జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి చంద్రవంకకు సంబంధించి సమాచారం సేకరించారు. సూర్యుడు అస్తమించిన తరువాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి ముస్లింలు ఫోన్లు చేసి తమకు కూడా చంద్రుడు కనిపించలేదని కమిటీకి తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న తరువాత కమిటీ మంగళవారం పండగ జరుగుతుందని ప్రకటించారు.
పాతబస్తీలో రాత్రి పూట జోరుగా షాపింగ్
ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినంసందర్భంగా హైదరాబాద్ మార్కెట్లు కళకళలాడాయి. గత రెండేళ్లుగా కరోనాతో పండగకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దాంతో ఈ సారి హైదరాబాద్ మార్కెట్లు కళకళలాడాయి. అర్థరాత్రి వరకూ దీపాల వెలుగులో పండుగ షాపింగ్ చేసుకోవడానికి ముస్లింలు ప్రాధాన్యం ఇస్తారు. దాంతో అర్ధరాత్రి దాటాక నగరంలో మార్కెట్లు జనంరద్దీతో కిటకిటలాడాయి. రంజాన్ కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.
రంజాన్ పండుగ సందడితో ముస్లిం సోదరుల కొనుగోళ్ళతో చార్మినార్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పాతబస్తీలోని ప్రతి బస్తీ, ప్రతి వాడలో ఇదే పరిస్థితి. అఫ్జల్‌గంజ్ నుంచి బార్కస్ వరకు ప్రధాన రహదారులలో ఉండే దుకాణాలే కాకుండా గల్లీల్లో ఉండే చిన్నచిన్న దుకాణాలు కూడా రద్దీగానే మారుతున్నాయి. పండుగకు ధరించే వస్త్రాలతోపాటు, పాదరక్షలు, అత్తర్లు, పండుగ రోజు తయారు చేసే సేమియా, డైఫ్రూట్స్, అందమైన గృహాలంకరణ వస్తువుల కొనుగోళ్ళు జోరుగా సాగాయి. పాతబస్తీ నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి కొనుగోలుదారులు తరలిరావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. చార్మినార్ పరిసరాలలో అడుగడుగునా తాత్కాలిక దుకాణాలు వెలిశాయి.