నువ్వూ…నేనూ…వెన్నెల

మనమిద్దరం
తొలి సంధ్యలో
ప్రయాణం
మొదలుపెట్టినప్పుడు
తొలికిరణాల స్పర్శతో
పులకించిపోయిన
ఎన్నెన్ని పూల బాసలు!
ఆకాశమే హద్దుగా
కిలకిలలాడిన
ఎన్నెన్ని పక్షుల ఊసులు!
ఆనందమే ఆశయంగా
చిగురులు తొడిగిన
ఎన్నెన్ని వసంత రాగాలు!
మన సంతోషాలతో

జత కలిపిన
ఎన్నెన్ని తొలకరి జల్లులు!
మన ప్రయాణంలో
మనమధ్య బద్దలైన
అగ్నిపర్వతాల
ఎన్నెన్ని విస్పోటనాలు!
మన కోపాలతో
కలిసి నడిచిన
ఎన్నెన్ని గ్రీష్మతాపాలు!
మన దుఃఖాలతో
పోటీపడిన
ఎన్నెన్ని అల్పపీడనాలు!
అయినా
మనం ప్రయాణిస్తూనే వున్నాం
ఇప్పుడు
మలి సంధ్య కూడా
వెళ్లిపోయింది
హమ్మయ్య!
మనమధ్య…
..నక్షత్రాల్లా
మిణుకుమిణుకుమంటున్న
మన జ్ఞాపకాల మధ్య
మౌనరాగాలకు సాక్షిగా
వెన్నెల వచ్చేసింది
మన కన్నుల నిండా
సరికొత్త జీవనరశ్మిని
నింపేసింది
– డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర
(9177732414

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page