పాఠకులని వెతుక్కుంటూ సాహిత్యం మారాలా? -బాలాజీ పోతుల

తాను రాసే రచనకు జనాదరణ పొందాలని కోరుకోని రచయిత ఉండరు. రచయిత రాసేది ఎవరైనా చదవాలనే. తన రచనను తానే చదువుకునే మొదటి పాఠకుడు / పాఠకురాలు కూడా రచయితే. అయితే ఒక రచనకు జనాదరణ రావడం అంటే కేవలం ఎక్కువమంది చదవడమేనా? ఎక్కువ ప్రతులు అమ్ముడవడం ఒక్కటే దాని సాహిత్య విలువకు కొలమానమా లేక పాఠకుల్లో ఆలోచనను, అనుభూతిని, చర్చను మిగిల్చగలగడమే దాని సాఫల్యానికి అసలు ప్రమాణమా?

రచయిత చెప్పాలనుకున్న విషయం జనబాహుళ్యంలోకి వెళ్లినప్పుడు, దానిపై చర్చ విస్తృతస్థాయికి చేరినప్పుడు ఆ రచన ఎంతో కొంత సాఫల్యం సాధించిందని అనుకోవచ్చు. ఒక రచన పాఠకుల్లో స్పందనను రేకెత్తించలేకపోతే, అది విస్తృత సామాజిక ప్రభావాన్ని చూపడం కష్టం. కానీ దీనికి విరుద్ధంగా ‘జనాల నాడి నాకు తెలుసు. వాళ్లకు ఏది నచ్చుతుందో అది రాస్తాను’ అనే ధోరణి కూడా సాహిత్యానికి ఆరోగ్యకరం కాదు.

పాఠకుల అభిరుచిని అంచనా వేయడం, మార్కెట్‌ను అర్థం చేసుకోవడం ప్రచురణ రంగానికి అవసరమే. ఒక పుస్తకం ఎవరికి చేరుతుంది, ఎంతమంది కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఏ తరహా రచనలకు ఆదరణ ఉంది వంటి విషయాలను ప్రచురణకర్తలు పరిశీలించడంలో తప్పేమీలేదు. అసలు సమస్య మొదలయ్యేది మార్కెట్‌ను పాఠకుల అభిరుచికి ఏకైక కొలమానంగా భావించినప్పుడు.

‘పాఠకులు ఇలాంటి కథలనే చదువుతున్నారు’, ‘ప్రేమ కథాంశాలతో నిండిన నవలలకే ఎక్కువ ఆదరణ ఉంది’, ‘కవిత్వానికి ఇప్పుడు మార్కెట్ లేదు’ లాంటి మాటలు కేవలం ఒక పరిశీలనగా ఆగిపోవు. అవి క్రమంగా పాఠకుల అభిరుచులపై ముందస్తు తీర్పులుగా మారతాయి. అప్పుడు రచయిత ఏం రాయాలి, ప్రచురణకర్త ఏం ప్రచురించాలి అనే నిర్ణయాల్లో సాహిత్య అవసరాలకన్నా మార్కెట్ ప్రభావం పెరుగుతుంది.

ఇక్కడ మరోప్రశ్న కూడా ఉంది. పాఠకులకి నచ్చేదాన్ని ఇవ్వడమే ప్రచురణకర్తల బాధ్యతా లేక పాఠకులకి ఇంకా తెలియని మంచి సాహిత్యాన్ని వాళ్ళకి పరిచయం చేయడం కూడా వారి బాధ్యతేనా?

ప్రపంచ సాహిత్య పరిచయాన్ని ప్రస్తావిస్తూ తెలుగు సాహిత్యంలోని అనేక ముఖ్యమైన రచనలను పాతవిగా, కాలం చెల్లినవిగా కొట్టిపారేసే ధోరణి కూడా కనిపిస్తోంది. మరోవైపు Gen-Z తరానికి నచ్చేలా ఇప్పటి సినిమాల తరహాలోనే కథలు ఉండాలని, భాష కూడా అదే వేగంతో సాగాలని భావించే ప్రచురణ ప్రయత్నాలూ కనిపిస్తున్నాయి. ఒకతరం ఏం చదువుతుందో అర్థం చేసుకోవడం అవసరమే. కానీ ఆ తరానికి నచ్చేలా సాహిత్యాన్ని మార్చడం, ఆ తరానికి కొత్త పఠన అనుభవాన్ని అందించడం రెండూ ఒకటి కావు.

పాఠకుల సంఖ్య పెరగడం నిస్సందేహంగా మంచి పరిణామం. కానీ ఆ సంఖ్యను పెంచడమే లక్ష్యంగా సాహిత్య నాణ్యతను పక్కనపెట్టి రచనలు అందించడం వల్ల పఠన సంస్కృతి బలపడుతుందా? ఒకవేళ అలాంటి రచనలు పాఠకులని మంచిసాహిత్యం వైపు తీసుకెళ్తే అది ఒకదశ కావచ్చు. ఆసక్తికరమైన, సులభంగా చదవగలిగే రచనల నుంచి క్రమంగా క్లిష్టమైన రచనల వైపు పాఠకులు ప్రయాణిస్తే, వారి పఠన సహనం, భాషతో మెలిగే సామర్థ్యం, సంక్లిష్టమైన ఆలోచనలను అర్థం చేసుకునే శక్తీ పెరుగుతాయి.

కానీ ఆ ప్రయాణం జరగకపోతే? సులభంగా చదవడమే పఠనానికి ప్రమాణంగా మారితే? అప్పుడు కొంతకాలానికి భాషలోని వైవిధ్యం, కథనంలోని సంక్లిష్టత, ఆలోచనలోని లోతు పాఠకులకు భారంగా మారే అవకాశం ఉంది. పాఠకులని సులభమైన పఠనంలోనే నిలిపివేయడం కూడా పఠన సంస్కృతికి పరిమితే.

అందుకే పాఠకులని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్లు కేవలం మార్కెట్ గణాంకం కాదు. వారికి నిర్దిష్ట అభిరుచులు ఉన్నప్పటికీ, కొత్తవాటిని స్వీకరించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఈరోజు ఒక రకమైన పుస్తకాన్ని చదివే పాఠకులు రేపు పూర్తిగా భిన్నమైన రచనను చదవవచ్చు. వారి పఠనాన్ని ముందుగానే ఒక వర్గంలోకి నెట్టేయడం అంటే వారి అభిరుచిని మాత్రమే కాదు, కొత్తదాన్ని స్వీకరించే అవకాశాన్నీ పరిమితం చేయడమే.

పాఠకులంతా ఒకేవిధంగా చదవరు. కొందరు ప్రతిరోజూ చదువుతారు. మరికొందరు అవకాశం దొరికినప్పుడే పుస్తకం తెరుస్తారు. కొందరికి కథలు ఇష్టం. మరికొందరికి కవిత్వం, జీవితచరిత్రలు, చరిత్ర, తత్వశాస్త్రం ఇష్టం. వారి అనుభవాలు, వయసు, విద్య, జీవన పరిస్థితులు, భాషతో ఉన్న అనుబంధం- ఇవన్నీ వారి పఠనాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ‘పాఠకుడు / పాఠకురాలు’ అనే ఏకవచనంతో మొత్తం పాఠక సమాజాన్ని నిర్వచించడం సరైనది కాదు.

ప్రచురణ సంస్థల సాధకబాధకాలు పాఠకులకి తెలియకపోవచ్చు. పుస్తకం ముద్రించడానికి అయ్యే ఖర్చు, పంపిణీ, అమ్మకాలు, నిల్వ, ప్రచారం- ఇవన్నీ ప్రచురణ రంగంలోని వాస్తవాలు. మార్కెట్‌ను పూర్తిగా విస్మరించడం సాధ్యంకాదు. కానీ మార్కెట్ అవసరాలకు లొంగిపోవడమే సాహిత్య రంగానికి పరిష్కారం కాదు.

పాఠకుల అభిరుచులు ఎన్నిరకాలుగా ఉన్నా, నాణ్యమైన, ఒరిజినల్ సాహిత్యానికి స్థానం లేకుండా పోదు. అలాంటి సాహిత్యాన్ని నిరంతరం అందించే ప్రచురణ సంస్థలు పాఠకుల విశ్వాసాన్ని చూరగొనగలవు. నాణ్యతను కాపాడుకోలేని సంస్థలకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. ఒక పుస్తకం ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయన్నది దాని మార్కెట్ విజయాన్ని కొంతవరకు సూచించవచ్చు. కానీ అది ఎంతకాలం పాఠకుల మనసులో నిలిచింది, ఎన్ని ప్రశ్నలను మిగిల్చింది, ఎన్ని చర్చలకు దారి తీసింది అన్నదే దాని సాహిత్య జీవితాన్ని నిర్ణయిస్తుంది.

సాహిత్యం మార్కెట్‌ను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్‌కు తన స్వభావాన్ని అప్పగించాల్సిన అవసరమూ లేదు. రచయిత పాఠకులని చేరాలి; పాఠకుల వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు. ప్రచురణకర్తలు పాఠకుల అభిరుచిని గుర్తించాలి; ఆ అభిరుచినే సాహిత్యానికి సరిహద్దుగా నిర్ణయించకూడదు.

పాఠకుల సంఖ్య పెరగడం ఎంత ముఖ్యమో, వారి పఠన సామర్థ్యం పెరగడం అంతకంటే ముఖ్యమైన విషయం. సంఖ్యను మాత్రమే పెంచే సాహిత్యం మార్కెట్‌ను పెంచవచ్చు. కానీ పఠనాన్ని పెంచే సాహిత్యమే సాహిత్య సంస్కృతిని బలోపేతం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *