- ప్రధాని మోదీ, అమిత్ షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు
- బిజెపి కాంగ్రెస్ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి
- విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి
- నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 6 : పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే సమర్థవంతమైన ఒకే ఒక్క ముఖ్యమంత్రి అని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రూ 75 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు అనంతరం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తుంటే ఓర్వలేక అధికారం కోసం కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాలు చెబుతూ పాదయాత్రలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సింది ఏ ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వరు, దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి ఇవ్వరని దుయ్యబట్టారు. పార్లమెంటులో ఆమోదం పొందిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎట్లా గుజరాత్‌కు ఇస్తారని నారాయణపేట వేదికగా ప్రశ్నించారు. ముందు రాష్ట్రానికి రావాల్సిన 1300 కోట్ల బకాయి లను చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ క్రింద రావలసిన 11000 కోట్ల రూపాయలను విడుదల చేసి మాట్లాడాలన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లు కేవలం అధికారం కోసమే అన్ని అబద్ధాలు చెబుతున్నారని, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు చేపట్టడం లేదని ప్రజలు వారిని నిలదీయాలని కోరారు.
కర్ణాటక రాష్ట్రంలో వొడ్లు క్వింటాలుకు రూ 1400 ధర ఇస్తుంటే తెలంగాణలో 1700 పైగా ఇస్తున్నామని అన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కర్ణాటక లోని అప్పర్ భద్ర, ఆంధప్రదేశ్లో పోలవరం, మధ్యప్రదేశ్‌లో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, పాలమూరు-రంగారెడ్డికి ఇవ్వడం లేదని అన్నారు. 2014 సంవత్సరంలో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిద్ర పోయారని తాము అధికారంలోకి వొస్తే పాలమూరును కట్టిస్తామని మాట చెప్పి ఎనిమిది సంవత్సరాలు అయినా ఉలుకు పలుకు లేదన్నారు. కేవలం అధికారంలోకి వొచ్చేందుకు పాదయాత్రలతో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు రైతు వేదికలు, ట్రాక్టర్లు, నర్సరీలు, వాటర్ ట్యాంక్, వైకుంఠ ధామాలు ఎలా వొస్తాయని అన్నారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి, సోయి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుకు జాతీయ హోదా పై ఢిల్లీ వెళ్లి మాట్లాడాలన్నారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ హయాంలో రైతుల బతుకులు అధ్వానంగా ఉండేవని, కరెంటు ఉండేది కాదని, నిత్యం మోటర్లు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని, తెలంగాణ వొచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్, అలాగే రైతు బీమా, రైతు బంధు తదితర పథకాలతో రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందని, దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణ అయిందన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీ మంద శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ కూతుళ్ల డిసిసిబి చైర్మన్ నిజాం భాష మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ జ్ తదితరులు పాల్గొన్నారు.