కొత్తగా 3,641 కేసులు నమోదు
న్యూ దిల్లీ, ఏప్రిల్ 3 : దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,26,246) చేరింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 11 మంది మృతి చెందారు.
దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,892కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 (220,66,12,500) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు కొవిడ్-19 న్యూ వేరియంట్లను పసిగట్టేందుకు అన్ని పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని సూచించింది.