ఫల్తా నియోజకవర్గంలో మమతకు షాక్

– 21న రీపోలింగ్ నుంచి తప్పుకున్న పార్టీ అభ్యర్థి

కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరగునున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. ఈనెల 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. నియోజకవర్గ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ చెప్పారు. తాను ఫల్తా నియోజకవర్గ బిడ్డనని, ఈ ప్రాంతమంతా శాంతియుతంగా ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నారని, అందుకే తాను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయంతో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. మరోవైపు రీ పోలింగ్‌లో బీజేపీ తరఫున దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ తరఫున అబ్దుర్ రజాక్ మొల్లా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరఫున శంభునాథ్ కుర్మి పోటీ పడనున్నారు. ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికల్లో ఫల్తా నియోజకవర్గంలోని పలు బూత్‌ల వద్ద అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈవీఎంలపై ఉన్న బీజేపీ బటన్‌ను తెల్లటి జిగురుతో కప్పివేశారని, దీంతో వోటర్లు తమ పార్టీకి వోటు వేయలేకపోయారని బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఆరోపించారు. ఈ మేరకు ఫల్తా నియోజకవర్గానికి 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *