తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి
ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని..
జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి..
ఎదలో రగులుతున్న కష్టాలను..
నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం..
బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు
ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది.
ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని..
కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి.
నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో..
తారలన్నీవెలుగుపూలు ఆరబోసినట్లు
కాంతులీనుతుంటే..
పయోధరములన్నీ నింగిని ఆవరించి..
గగణమనే గుండెలో చీకటి మేఘాలను కమ్మేశాయి.
ఎడారిలాంటి బతుకు ప్రయాణంలో..
ఒయాసీస్సులేవో ఓదార్పునిస్తున్నా..
భానుడి భగభగలకు తడారిపోయిన..
గొంతులౌతున్నాయి.
నిరాశ నిలయాల మధ్య కొట్టుమిట్టాడుతున్న
జీవితానికి నలుగురి మనుషుల ఓదార్పు మాటలు కావాలి.
కొండెక్కి దుఃఖిస్తున్న దీపానికి సహాయపు చేతులు అడ్డుపెట్టి కన్నీరును తుడిచే ఆపన్న హస్తం కావాలి.
తిమిరాన్ని చీల్చుతూ గుండెల్లో వెలుగుపూలు
పూయించే మిణుగురులాంటి ధైర్యం కావాలి.
చైతన్యపు కాంతులను వెదజల్లే మంచి మనసున్న మనుషులు కావాలి.
– అశోక్ గోనె, 9441317361