వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ‘ ప్రజాతంత్ర ‘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం అవుతుంది. విజ్ఞాన ఖని ప్రభాకర్ రావు ఒక ‘ మూవింగ్ ఎన్సైక్లోపీడియా..’. తెలంగాణా జాతి రత్నం సురవరం ప్రతాప రెడ్డి సారథ్యంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రికకు అతి చిన్న వయస్సులో సంపాదకీయాలు రాసిన దేవులపల్లి ప్రభాకర్ రావు దశాబ్ద కాలం ‘ప్రజాతంత్ర ‘కు సంపాదకీయాలు రాయడం మేము చేసుకున్న అదృష్టం..! నరనరాన తెలంగాణా వాదాన్ని నింపుకున్న ప్రభాకర్ రావు తన రచనలతో సమైక్య వాదుల కుట్రలను ,కుతంత్రాలను తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ అప్రమత్తం చేసారు . మలి దశ ఉద్యమ సందర్బంగా ‘ప్రజాతంత్ర ‘వేదికగా వారి కొన్ని వందల వ్యాసాలు,సంపాదకీయాలు తెలంగాణ భావజాల వ్యాప్తికి దోహదపడ్డాయి. దేవులపల్లి ప్రభాకర్ రావు కు అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి రచనలను ‘ఖుల్లమ్ ఖుల్లా ‘ శీర్షికన ఆయన యాదిలో ఒక సంవత్సర కాలం మరోసారి పాఠకులకు అందిస్తున్నాం ..
జై తెలంగాణ ..!!
‘ప్రజాతంత్ర’ జనవరి 23- 29-2005
అనేక సంవత్సరాల అనంతరం ఆరు మాసాల పాటు తుపాకి గుండ్ల వర్షం లేకుండా ప్రశాంతంగా ఉన్న, ఊరటతో ఊపిరి పీల్చిన తెలంగాణ ప్రాంతంలో మళ్లీ రాబందుల రెక్కల చప్పుడు విన్పిస్తున్నది. రక్తపు మడుగులు, శవాల కుప్పలు కన్పిస్తున్నాయి. హఠాత్తుగా ట్రిగ్గర్లను నొక్కారు! హాహాకారాలు, ఆక్రందనలు విన్పిస్తున్నాయి. ఈ హఠాత్పరిణామాలకు కారణాలు ఏమటి? కారకులు ఎవరు? చర్చల ద్వార అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, శాంతి స్థాపన జరుగుతుందని అనేకులు ఆశిస్తున్న తరుణాన ఇరుపక్షాల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక చర్చలకు ఆస్కారం లేదా, అవకాశం లేదా? యుద్ధానికి మోహరించక తప్పదా?ఇటువంటి ప్రశ్నలు ఎన్నో సామాన్యులను వేధిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించాలి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం అవసరమయిన కొన్ని చర్యలను ఆలస్యంగానయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న దశలో ఆ విషయంపై నుంచి అందరి దృష్టి మళ్లించడానికి తిరిగి అమానుష హత్యాకాండ ప్రారంభించారన్న అనుమానం బలంగా వ్యక్తమవుతున్నది. ఈ అనుమానం ఆధార రహితమయినది కాదు . గత యాభయి సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రను పరికించినవారికి ఈ అనుమానం సహేతుకమయినదిగా కన్పిస్తుంది.
తెలంగాణ శత్రువులు, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని మొండిగా వ్యతిరేకిస్తున్న వారు ఎజెండాను మార్చడానికి కుట్రలు పన్నుతున్నారనడంలో సందేహం లేదు. తెలంగాణ శత్రువులు ఎంతకయినా తెగిస్తారు. ఈ సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఒక కఠిన యదార్థంగా, ఒక అనివార్య పరిణామంగా కన్పిస్తున్నది గనుక తెలంగాణ శత్రువులు సహనాన్ని కోల్పోతున్నారు. ఈ అనివార్య, చారిత్రక పరిణామాన్ని శాశ్వతంగా కాకపోయినా, కనీసం తాత్కాలికంగానయినా అడ్డుకోవడానికి తెలంగాణ శత్రువులు ఎంతటి నీచ, క్షుద్ర చర్యలకయినా పాల్పడుతున్నారు. రక్తపుటేరులు ప్రవహింపజేసి, చిన్నాపెద్దా, ఆడమగా అన్న విచక్షణ లేకుండా కాల్చి చంపి, శవాల కుప్పలతో తెలంగాణను ఒక శ్మశానవాటికగా మార్చినట్లయితే అందరి దృష్టి అటు మళ్లుతుందని, కొంతకాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం వెనుకబడుతుందని తెలంగాణ శత్రువులు భ్రమపడుతున్నారు.
చిట్కా సూత్రాలతో, పథకాలతో తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దాదాపు యాభయి సంవత్సరాల నుంచి కొనసాగించిన యత్నాలు ఫలించలేదు. తెలంగాణ విద్యావంతులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించగల 610 జీఓకు ఏ విధంగా తూట్లు పొడిచారో ఈ మధ్య స్పష్టంగా వెల్లడయింది. ఈ జీఓ ను ఇక అమలు చేయలేమని తెలంగాణ మంత్రులు నిస్పృహతో చేతేలెత్తి, నిస్సహాయస్థితిలో చతికిలపడ్డారు. తెలంగాణ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, నదీ జలాలు, గనులు, వనులు, తరులు,గిరులు, నిధులు, వనరులు, విద్యా, వైద్యసంస్థలు ఇతరుల దోపిడికి గురి అవుతున్నాయి. తెలంగాణ ప్రజలకు అవి ఉపయోగపడవు. తెలంగాణ నాయకులు పూర్తి పదవీ కాలం ముఖ్యమంత్రులుగా కొనసాగలేరు. తెలంగాణ మంత్రులు, సోకాల్డ్ ప్రజా ప్రతినిధులు , ఇంకా మిగిలి ఉన్న కొద్దిమంది – చాలా చాల కొద్ది మంది – తెలంగాణ ఉన్నతాధికారులు గొంతు విప్పలేని బానిసలకన్న హీనం.
తెలంగాణ శత్రువుల తూణీరంలో ఇంకా చాలా అస్త్రాలున్నాయి. – తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, తెలంగాణ రాష్ట్రవాదులకు వ్యతిరేకంగా భయంకరమయిన ఆరోపణలతో ఇంటెలిజెన్స్ వివేదికలను రాయించవచ్చు. సద్దామ్ హుసేన్ మానవ జాతిని క్షణాలలో నాశనం చేసే మారణాయుధాలను ఉత్పత్తి చేసి గోదాములలో నిలువ చేసాడని అధ్యక్షుడు జార్జ్ విలియమ్ బుష్, బ్రిటన్ ప్రధానమంత్రి టోనిబ్లేర్ తమ ఇంటెలిజెన్స్ శాఖల చేత రహస్య నివేదికలను తయారు చేయించారు. అటువంటి మారణాయుధాలు ఏవీ ఇరాన్‌లో లేవని మూలమూలన వెతికిన ఐక్యరాజ్య సమితి పరిశీలకులు (ఇన్‌స్పెక్టర్లు) తేల్చి చెప్పారు. అయినప్పటికి బుష్-బ్లేర్ ద్వయం ఇరాక్‌పై యుద్ధం చేసి పీనుగుల పెంటగా మార్చారు. తెలంగాణను ఐ.ఎస్.ఐ. కేంద్రంగా చూపించే పత్రాలు త్వరలో ఉత్పత్తి కావొచ్చు. యు.పి .ఏ. సబ్ కమిటీకి వాటిని చూపించి హడలగొట్టవచ్చు. తెలంగాణ శత్రువుల తూణీరంలో సరికొత్త ఆయుధాలు చేరవచ్చు. ఏమయినప్పటికి, తెలంగాణ సత్యం. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తథ్యం – రేపయినా కావోచ్చు. ఎల్లుండయినా కావొచ్చు. అది అనివార్య చారిత్రక పరిణామం.