తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’

నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి

నిజాం నిరంకుశ పాలనలో బానిసలుగా బతుకు తున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిబద్దత కలిగిన నేత, త్యాగశీలి సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు. సత్యాగ్రహిగా, క్విట్‌ ఇం‌డియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా కొన్ని ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్‌ ‌రాజ్య ప్రజల్లో చ్కెతన్యాన్ని, ధ్కెర్యాన్ని నింపిన మహోన్నతుడు కేశవరావు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్‌’‌గా పిలుచు కుంటారు. తెలంగాణ కేసరిగా, ‘దక్కన్‌ ‌సర్దార్‌’‌గా బిరుదు లందుకున్న జమలాపురం కేశవరావు తనద్కెన శ్కెలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగు వారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు.

దక్కన్‌ ‌సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచు కునే కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్‌ ‌జిల్లా)లోని ఎర్రుపాలెం లో 1908, సెప్టెంబర్‌ 3 ‌న జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మలకు తొలి సంతానంగా జన్మించారు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని తీవ్రంగా కలవర పరచాయి. ఎర్రుపాలెం లో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. వందేమాతరం గీతాలాపనను నిషేధించి నందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలో కాలూనారు. గీతాన్ని ఆలాపించ నివ్వకపోతే తరగతులకు హాజరు కాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధి మరింత విస్తృతం అయింది. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించి పోయారు. ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో…ముఖ్యంగా వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితుడయ్యారు.

1923లో రాజమండ్రిలో మొదటిసారి మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయ ఉద్యమంను తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు కృషి చేశారు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవారు.1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన ‘హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌’ ‌స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యారు. 1938 సెప్టెంబర్‌ 24 ‌మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్‌, ‌జనార్దనరావు దేశాయ్‌, ‌రావి నారాయణరెడ్డిలతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతి నివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు. వెంటనే మహాత్మాగాంధీకి జై, హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినాదించారు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్‌ ‌జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్‌ ‌జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాట పంథాను కేశవరావు కొనసాగించారు. అంటరానితనం నిర్మూలించేందుకు, ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశారు.

1942లో కాంగ్రెస్‌ ‌పిలుపు మేరకు ‘క్విట్‌ ఇం‌డియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేసే బాధ్యత వహించారు. 1946లో మెదక్‌ ‌జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌చేపట్టిన సత్యాగ్రహం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్‌ ‌భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చు కోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం భారత దేశములో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా నిరసించిన మొట్టమొదటి కాంగ్రెస్‌ ‌వ్యక్తి కేశవరావు. అప్పటి మిలిటరీ అధికారి నంజప్పను నిలదీసిన నిజమైన ప్రజానాయకుడు సర్దార్‌. ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉండి జాగీర్దార్లను, జమిందార్లను విమర్శించమంటే ఆనాడు నిజంగా ఒక సాహసమే. నంజప్ప నేతృత్వంలో మిలిటరీ వారు కమ్యూనిస్టుల ఏరివేత పేరిట జరిగిన హింసా కాండను, ముస్లిముల ఊచకోతను కేశవరావు ఖండించారు. ప్రజల పక్షాన నిలిచారు. ‘‘మనం ఏ ప్రభుత్వాన్ని అయినా సరే అది రాష్ట్ర, జాతీయ ప్రభుత్వం, కాంగ్రెసు ప్రభుత్వం అయినా, కాంగ్రెసు కాని ప్రభుత్వం అయినా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్ని సహించబోము. నంజప్ప మన ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే. యింకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మన ప్రజలకు సేవకుడు. ఆయన యధేచ్ఛగా ప్రవర్తించడానికి, మేము అనుమతించడానికి సిద్ధముగా లేము. ఆయన చేస్తున్న అకృత్యాలు నిజాం తొత్తుల్కెన జాగీర్దార్లను, నాజీ హిట్లరును తలదన్నిన నిజాంను మరిపిస్తున్నది. నంజప్ప తెలంగాణ రక్షకుడిగా కాక, భక్షకుడిగా వచ్చినట్లు అనిపిస్తున్నది.’’ అని డోర్నకల్లులో జరిగిన సభలో కేశవరావు ఎలుగెత్తి చాటారు.

సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు. విద్యాపరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయకుండా విశాలాంధ్ర ఏర్పాటు వల్ల స్థానికులపై స్థానికేతరుల అజమాయిషీ ఆరంభ మవుతుందని ముందుగానే ఊహించిన అనుభవశాలి ఆయన. కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి, కర్రలు కూడా నాటి నిరాడంబరతకు, పార్టీ పట్ల అంకితభావంకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, అంతలా పార్టీకి సేవ చేసిన ఆయనకు కాంగ్రెస్‌ అం‌తర్గత రాజకీయాల మూలంగా రావాల్సినంత పేరు, దొరకాల్సిన గౌరవం రాలేదు. చేపట్టిన ప్రతి ఉద్యమం లోనూ విజయాల్ని సాధించిన ఆయన స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆయనకు ద్రోహం చేశారు. ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందేలా పరిస్థితులు కల్పించారు. జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలోని నాయకులు చేసిన మోసం, కలగలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయిన కేశవరావు1953, మార్చి 29న తన 46వ ఏట మరణించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *