తెలంగాణలో తప్పని రైతుల బలవన్మరణాలు రుణ విముక్తులు కాని రైతులు

మహేందర్‌ ‌కూన, జర్నలిస్ట్
‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. వలస పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. మా రాష్ట్రం మాకు కావాలని ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించామని వెనుదిరిగి చూస్తే కన్నీళ్లే శరణ్యం అవుతున్నాయి. ఆంధ్ర వలస పాలనలో నీళ్ళు, నిధుల దోపిడి యథేచ్ఛగా జరిగి తెలంగాణలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతులు బలవణ్మరణం చెందారని దీనికంతటికి ఆంధ్ర పాలకుల వివక్షే కారణమని దుమ్మెత్తి పోసాం. కాని తెలంగాణ వచ్చినంక జరిగిందేమిటి..రైతుల బలవణ్మరణాలు నిలిచి పోయాయా?  పోని తగ్గాయా? గణాంకాలు చూస్తే కాదని స్పష్టం అవుతున్నాయి. రైతుల బలవణ్మరణాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక బలవన్మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఆ తరువాత కేరళ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఆదర్శవంతమైన విధానాలు అమలు చేస్తున్నామని సాగు వీస్తీర్ణం పెరిగి ఉత్పత్తి  కూడ పెరిగిందని సర్కార్‌ ‌పెద్దలు తరుచూ వల్లె వేసే మాటల్లో ఎంతో కాని వ్యవసాయ రంగంలో సంక్షోభం ఎందుకు సమసి పోలేదనే ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నాం…పంటల బీమాతో పాటు రైతులకు కూడ బీమా కల్పించాం…రుణ మాఫి(ఇది కేవలం ఐదేళ్ల కోసారి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా  ఇచ్చేది తప్ప ఇతరత్రా రైతులను ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేసేందుకు తెలంగాణ సర్కార్‌ ‌చేసిన మరో సహాయం అంటూ ఇంతకు మించి ఏమిలేదు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతులు ఏండ్ల తరబడి అందులో నుండి బయట పడే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రైతులు బలవన్మరణాల పాలవుతున్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజక వర్గం లోని జగదేవ్‌ ‌పూర్‌ ‌మండలం రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట మల్లేశం (56) అనే రైతు మే 20వ తేదీన అప్పుల బాధలు ఎక్కువై తన వ్యవసాయ పొలం దగ్గర పురుగుల మందు తాగి బలవణ్మరణం చెందాడు. మల్లేశంకు స్వంతంగా రెండెకరాలు భూమి ఉంది. మరో ఎకరం కౌలుకు తీసుకుని పంటలు వేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం రావడంతో పాటు కుటుంబ ఆర్థిక భారం పడి అప్పుల్లో కూరుకు పోయి బయట పడే మార్గం లేక బలవన్మరణం చెందాడు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన  పంజాబ్‌ ‌రైతులు 600 మందికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు సికెం కెసిఆర్‌ ‌ఢీల్లీకి వెళ్లిన రోజే మల్లేశం బలవన్మరణం నమోదు అయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రైతుల బలవన్మరణాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బలవన్మరణాలకు తేడా లేదు. ఆనాడైనా ఈనాడైనా అప్పుల ఊబిలో నుండి బయట పడే మార్గం లేకనే బలవన్మరణాలకు పాల్పడ్డారనేది యదార్థం. నేషనల్‌ ‌క్రైం రికార్డు బ్యూరో అంద చేసిన గణాంకాల  తాజా నివేదిక ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన రైతు ఆత్మహత్యల సంఖ్య 7409. ఈ సంఖ్య కన్నా ఇంకా రైతుల బలవణ్మరాణాలు ఎక్కువే జరిగాయని రైతు సంఘాలు ఈ గణాంకాల పట్ల అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎన్‌ ‌సిఆర్‌బి గణాంకాల సేకరణకు పోలీసు రికార్డుల్లో నమోదైన వాటినే ప్రామాణికంగా పరిగణన లోకి తీసుకుంటున్నది. ఎన్‌సిఆర్‌బి లెక్కల పట్ల సంతృప్తిగా లేని రైతు సంఘాలు రైతుల బలవణ్మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయని వాదిస్తున్నాయి.

లోక్‌ ‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ  మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌వెల్లడించిన వివరాల మేరకు  2014 లో 898 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2015లో 1358 మంది రైతులు, 2016 సంవత్సరంలో 632 మంది, 2017 సంవత్సరంలో 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018 సంవత్సరంలో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌వెల్లడించారు. 2021 సంవత్సరంలో జనవరి నుండి సెప్టంబర్‌ ‌వరకు 802 మంది రైతులు బలవన్మరణం చెందారని  ‘రైతు స్వరాజ్య వేదిక’ చేసిన అధ్యయనంలో పేర్కొంది. బలవన్మరణాలు చెందిన రైతుల్లో 80 శాతం వరకు కౌలు రైతులే ఉన్నారు. బలవణ్మరణం చెందిన  రైతుల కుటుంబాలను వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ సందర్భంగా కాంగ్రేస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధి పరామర్శించాడు. రైతు బంధు, రుణమాఫీ పథకాలు అమలు చేస్తున్నాం…చనిపోయిన రైతులకు బీమా(5 నుండి 6 లక్షల రూపాయల వరకు) ఇస్తున్నాం అని రైతుల బలవన్మరణాలను ప్రభుత్వం పట్టించు కోవడం మానేసింది.

సిఎం కెసిఆర్‌కు ఆయన మదిలో తోచిందో లేక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాడో కాని ఆయన ప్రకటనలు రైతులను పలు మార్లు గందర గోళ పరిచాయి. నియంత్రిత సాగన్నాడు. ఏం పంటలు వేయాలో సర్కార్‌ ‌నిర్ణయిస్తుందన్నాడు.  కొద్ది రోజులు పత్తి వేయద్దన్నాడు. గత సీజన్‌లో వరి వద్దని పత్తి వేయమన్నాడు. భారీ వర్షాలకు పత్తి పంటలు బాగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్ట పోయారు. వరి పండించిన రైతుల నుండి ధాన్యం కొనే దిక్కు లేదు. గాయ్‌ ‌గాయ్‌ ‌గత్తర గత్తర కావద్దు అంటూ సిఎం కెసిఆర్‌ ‌తరుచూ తెలంగాణ యాసలో చెప్పే సామెత. కాని ఆయన పొంతన లేని వ్యవసాయ విధానాలు చూస్తే వ్యవసాయ రంగాన్ని నిపుణులు సూచించి సిఫారసులు పక్కన పెట్టి తన స్వంత నిర్ణయాలతో  గాయ్‌ ‌గాయ్‌ ‌గత్తర గత్తర చేసాడని విమర్శలు ఉన్నాయి. రైతులను అప్పుల ఊబి నుండి బయట పడేసేందుకు ఐదేళ్ల కోమారు ఎన్నికల కోసం చేసే రుణ మాఫీలు కాకుండా పటిష్టమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీలు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు రైతులకు అంద చేసి ఉత్పత్తుల కొనుగోలులో సర్కార్‌ ‌పూర్తి భాద్యత వహిస్తే తప్ప రైతుల బలవన్మరణాలు ఆగవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *