తాడోపేడో తేల్చుకుంటాం

  • యాసంగి వడ్లను కేంద్రమే వెంటనే కొనుగోలు చేయాలి
  • రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు
  • మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
  • కేంద్రంతో అమితుమికి సిద్ధమన్న నేతలు
  • తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం బిజెపి అంటూ విమర్శలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, బిజెపికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరనిని నిలదీస్తూ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై నేతలు మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రాల్లో దీక్షలతో మొదలయ్యే పోరాటం 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించే దీక్షతో రణ నినాదం చేయనున్నది. వడ్ల కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నదే టిఆర్‌ఎస్‌ ‌లక్ష్యమని నేతలు తెలిపారు. తెలంగాణ పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు  టీఆర్‌ఎస్‌ ‌నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్లపై సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఉద్యమం ప్రారంభం అయ్యింది. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటుగా మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొన్నారు. రైతుల ఆకాంక్షలను కేంద్రానికి తెలిపి, రాజకీయాలను పక్కకు పెట్టి వడ్లను కొనుగోలుచేసే విధంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణపై సీఎం కేసీఆర్‌, ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. యాసంగిలో వరి వేయాలని, సీఎం కేసీఆర్‌తో సంబంధం లేకుండా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజలు, రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిలదీస్తున్నారు.

 

సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడానికి ప్రయత్నిస్తే బీజేపీ నేతలు వరివేసేలా రెచ్చగొట్టి ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసిన వైనాన్ని రైతులకు టీఆర్‌ఎస్‌ ‌నేతలు వివరిస్తున్నారు. తెలంగాణను, ఇక్కడి ప్రజలను, రైతులను పదే పదే అవమానించేలా, అవహేళన చేసేలా మాట్లాడుతున్న నాయకులు, కేంద్రం వైఖరిని రైతులకు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి, రాష్ట్ర మంత్రులకు పనిలేకుండా ఢిల్లీకి వస్తున్నారా అంటూ కేంద్ర మంత్రి గోయల్‌ ‌చేసిన వ్యాఖ్యలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆహార భద్రత చట్టానికి మార్పులు తీసుకువస్తే లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, వన్‌ ‌నేషన్‌  ‌వన్‌ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానాన్ని తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తున్నది. మరోవైపు టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉభయ సభలు ముగిసే వరకు నిరసనలను కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి స్పందన వచ్చే వరకు ఇదే విధమైన కార్యాచరణతో ముందుకువెళ్లనున్నారు. కేంద్రం వడ్లను కొనాలని ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్‌ ‌మొదటి దశ ఉద్యమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, ఎంపీపీ, జడ్పీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తీర్మానాలుచేసి ప్రధాని, కేంద్ర మంత్రి గోయల్‌కు పంపించారు. కేంద్రమంత్రిని కలిసి వడ్లను కొనాలని రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండో విడత కార్యాచరణను అమలు చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన అనంతరం ఈ నెల 6న రాష్ట్రంలోని ప్రధానమైన నాలుగు జాతీయ రహదారులు నాగపూర్‌, ‌ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో చేపడతామని తెలిపారు. 7న హైదరాబాద్‌ ‌మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. 8న రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తారు. ప్రతి రైతు, ప్రతి టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్త, నాయకుల ఇండ్లపై నల్లా జెండాను ఎగురవేస్తారు. ఈనెల 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

 

రాయపర్తిలో ఎడ్లబండ్లతో ఎర్రబెల్లి ర్యాలీ… కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి దయాకర్‌

‌తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షల్లో భాగంగా పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు వినూత్నంగా నిరసన చేపట్టారు. రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ‌చేపట్టిన నిరసన దీక్షకు మంత్రి ఎడ్ల బండిలో ర్యాలీగా తరలి వొచ్చి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరిపే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రైతులను బిజెపి నేతలే రెచ్చగొట్టారు…వరి వేయమని చెప్ప ధాన్యం కొనకుంటే ఎలా? : మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్పిన రాష్ట్ర బిజెపి నేతలు అన్నదాతలను రెచ్చగొట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి విమర్శించారు. ధాన్యాన్ని కోనేల చేస్తామన్న బిజెపి నేతలు ఇవ్వాళ కనిపించడంలేదని, తెలంగాణలో ధాన్యం కొనాలని తెలంగాణ బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదని ఆరోపించారు. ధాన్యం కోనుగోలు వ్యవహారంలో కేంద్ర వైఖరికి నిరసనగా మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా ముసాపేటలో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం వరి వేయొద్దని రైతులకు చెప్పినా బిజెపి నేతలు వరివేసేలా రైతులను రెచ్చగొట్టారని చెప్పారు. ప్రభుత్వంతో ధాన్యం కొనిపిస్తామని ప్రచారం చేశారని విమర్శించారు.

 

వరి వేయమన్న బిజెపి నేతలదే ధాన్యం కొనుగోళ్ల బాధ్యత : ఆందోళనలో స్పష్టం చేసిన మంత్రి సబిత

వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ‌ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు బిజెపి నేతలను విడిచిపెట్టలేదన్నారు.

 

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష  : కరీంనగర్‌ ‌ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్‌

‌తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అబద్దాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. వడ్లు కొనకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తిగా నూకలు చెల్లినట్లేనని మంత్రి గంగుల హెచ్చరించారు. యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చిన సందర్భంగా  కరీంనగర్‌ ‌రూరల్‌ ‌మండలం గోపాల్‌ ‌పూర్‌ ‌దగ్గర జరిగిన ధర్నాలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ‌పాల్గొన్నారు.

 

వడ్లు కొనేదాకా బిజెపి నాయకులను గ్రామాల్లోకి రానీయవద్దు : నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ఆందోళన

వడ్ల కొనుగోలు విధానంపై కేంద్రం తీరును నిరసిస్తూ చేపట్టిన ధర్నాలో జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ‌నేతుల పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలుబాజిరెడ్డి, జీవన్‌ ‌రెడ్డి తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వడ్లు పూర్తిగా కొనుగోలు చేసే  వరకూ ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ నెల 11న ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నా చేస్తామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దొంగాట ఆడుతుందని దీనిని ప్రజలు గమనించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.

 

 కేంద్రం దుష్ట రాజకీయాలు చేస్తుంది. .ధాన్యం కొనకుండా డ్రామాలు ఆడుతుంది : సూర్యాపేట ధర్నాలో మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి

కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యంకొనాల్సిన కేద్రం చేతులెత్తేసిందన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపు మేరకు.. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలలో మంత్రి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page