- కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు
- రేవంత్ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక
- ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్ రెడ్డి
న్యూ దిల్లీ, మే 19 : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి.. టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్ రేవంతరెడ్డి నేతృత్వంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు.
అయితే బాల్క సుమన్‌కు టిక్కెట్ కోసం ఆయనను తప్పించారు. ఆయన భార్యకు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. వీరు పార్టీలో చేరిన అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వొచ్చిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరన్న రేవంత్… ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తుందని తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ అమలయితే మాదిగలకు న్యాయం జరుగుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదన్నారు. ఓదేలును వాడుకుని వొదిలేశారని మండిపడ్డారు. అంతకుముందు సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు.