రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్ కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ బిజెపి నేతలను అడిగే పరిస్థితి టిఆర్‌ఎస్ నాయకులకు ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మలి విడుత ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలపైన బిజెపి జోరు పెంచింది. దాంతో రాష్ట్రంలో బిజెపి వర్సెస్ టిఆర్‌ఎస్‌గా మారింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఇక్కడ రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించింది. ఇప్పటికే టిఆర్‌ఎస్ పాలనపైన విసిగిన వారిని, ఆ పార్టీపై అసంతృప్తిగా ఉన్నవారిని తమవైపు తిప్పుకుంటుంది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలియంది కాదు. ఇదిలా ఉంటే స్థానిక నాయకత్వం నిత్యం టిఆర్‌ఎస్ నాయకత్వంపై నిప్పులు చెరుగుతూనే ఉంది. దానికి తోడు కేంద్ర నాయకత్వాన్ని కూడా తరుచూ ఆహ్వానిస్తూ వారితో కేంద్రం రాష్ట్రానికి నిధులు, పథకాలను ఏమేరకు ఇస్తున్నదన్న విషయాన్ని గణాంకాలతో సహా చెప్పించడంతోపాటు, టిఆర్‌ఎస్‌కు పాలన చేతకాకనే అర్థిక పుష్టితో అవతరించిన తెలంగాణను ఇప్పుడు అప్పుల కుప్పలా మార్చారంటూ తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు.
తాజాగా ఆ పార్టీ కేంద్ర నాయకులైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాను కుదిపేస్తున్నాయి. సాక్షాత్తు ప్రధాని అంతటి వాడు టిఆర్‌ఎస్ పార్టీని, పార్టీ అధినేత కెసిఆర్‌ను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కుటుంబ పాలనపై ఆయన చేసిన విమర్శ రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. ఇంతవరకు బిజెపి నాయకులు ఇలాంటి విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని అంతటి వాటి ఈ విషయంలో ఘాటైన విమర్శ చేయడం టిఆర్‌ఎస్ నాయకులకు చురుకు పెట్టినట్లైంది. భార్యాపిల్లలతో లేని ప్రధానికి కుటుంబం గురించి ఏమి తెలుసంటూ టిఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించడం ప్రారంభించారు. బిజెపి యేతర రాష్ట్రాల పట్ల పక్షపాత ధోరణిని ప్రదర్శించే మోదీ వాస్తవంగా పాలనకు అనర్హుడని వారు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రజారంజక పాలన అందించలేకపోతున్న ప్రధానికి మరొకరిని విమర్శించే అధికారం లేదని వారు ఘాటుగానే స్పందిస్తున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ తాజా తెలంగాణ పర్యటన టిఆర్‌ఎస్‌ను కొద్దిగా చిక్కుల్లో పడేసిందనే చెప్పాలే. ఇదిలా ఉంటే ఒక్క బిజెపియే కాకుండా దాదాపు ఎనిమిది నుండి పది రాజకీయ పార్టీలు టిఆర్‌ఎస్‌పై మాటల దాడులను ప్రారంభించాయి.
ఈ పార్టీలన్నీ కూడా రానున్న ఎన్నికల్లో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. జాతీయ స్థాయి పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తోడు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కూడా విమర్శనా బాణాలను సంధిస్తుంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలన చాతగాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెదిగిపోవాలని తీవ్రంగా విమర్శిస్తుంది. తన పాదయాత్రల ద్వారా తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా ఈసారి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. అయితే ఏపిలో బిజెపితో కలిసి పోటీచేస్తాడనుకుంటున్న తరుణంలో తెలంగాణలో కూడా అదే సిద్ధాంతాన్ని అవలంబించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బిఎస్పీని విస్తృత ప్రచారంలోకి తీసుకువస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మరో వైపున టిఆర్‌ఎస్‌పై మాటల దాడి ప్రారంభించారు. ఈసారి రాజ్యాధికారం బహుజనులదేనంటారాయన. ఇకపోతే తెలంగాణ జనసమితి నాయకులు ఫ్రొఫెసర్ కోదండరామ్, ఆమ్ ఆద్మీ పార్టీలు అన్నో ఇన్నో స్థానాలను గెలుచుకుంటామని ఊహిస్తున్నాయి.
ముఖ్యంగా పంజాబ్‌లో విజయ డంకా మోగించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణంవైపు తన చూపును మళ్ళించింది. దిల్లీలో ఆ పార్టీ అమలు చేస్తున్న ప్రజాహిత పథకాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు ఆ పార్టీపై అభిమానం చూపే అవకాశం ఉందనుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ అదినేత కేసిఆర్‌తో కలిసి తిరుగడాన్ని బట్టి ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిందే. ఇక కొత్తగా మరో పార్టీ రంగ ప్రవేశం చేస్తుంది. ప్రజా శాంతి పార్టీ పేర గత క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ పాల్ టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తానేనని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఈసారి టిఆర్‌ఎస్‌పార్టీ ఇన్ని రాజకీయ పార్టీలను ఎదుర్కునాల్సి వొస్తుంది. వీటిల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విషయంలోనే టిఆర్‌ఎస్ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో మార్పు తీసుకు వొస్తామని బయలు దేరిన కెసిఆర్ నేల విడిచి సాము చేయవద్దన్న నానుడిగా ముందుగా పెరుగుతున్న ప్రత్యర్థి పార్టీలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.