నిశ్శబ్ద దీపస్తంభం

చెమ్మ : వారాల ఆనంద్

తెలంగాణ సాహిత్యచరిత్రలో జువ్వాడి గౌతమరావుది ప్రత్యేక వ్యక్తిత్వం. ఆయన కవి, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, సాహిత్యప్రచారకుడు మాత్రమేకాదు, సాహిత్యాన్ని జీవనవిధానంగా స్వీకరించిన అధ్యయనశీలి. విద్యార్థిదశ నుంచే సాహిత్యం, సామాజిక చైతన్యం, స్వాతంత్ర్యోద్యమ భావజాలాలతో మమేకమయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనం. గౌతమరావు సాహిత్యజీవితంలోనూ వ్యక్తిగతజీవితంలోనూ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యానికి విశేషస్థానం ఉంది. విశ్వనాథ రచనలను కేవలం అభిమానిగా కాక, లోతైన అధ్యయనశీలిగా పరిశీలించి వాటి సాహిత్య, తాత్వికవిలువలను ఆవిష్కరించారు. కొత్తతరాలకు పరిచయం చేశారు. విశ్వనాథను ‘సనాతనుల్లో ఆధునికుడు’గా నిర్వచించారు. ఆయన విమర్శనా దృష్టి విశాలమయింది.

ఆయన సాహిత్యసృజనలో విమర్శ, వ్యాసం, అనువాదం, పీఠిక, జ్ఞాపకాల రచన, పద్యరచన వంటి అనేక ప్రక్రియలు కనిపిస్తాయి. ముఖ్యంగా క్లిష్టమైన సాహిత్యవిషయాలను సరళమైనభాషలో పాఠకులకు అందించడం ప్రత్యేకత. సాహిత్యాన్ని పండితులగదుల నుంచి సాధారణ పాఠకులమధ్యకు తీసుకువచ్చిన వారిలో ఒకరు.  ‘జయంతి’ పత్రికద్వారా, ‘సాహిత్యధార’ వంటి శీర్షికలద్వారా సాహిత్యచర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. జయంతి పత్రికలో సమవర్తి పేర నెలనెలా శీర్షికను నిర్వహించారు. గౌతమరావు సాహిత్య విశిష్టత- అధ్యయన గాంభీర్యంలో, విమర్శనా సమతుల్యతలో, భాషాసరళతలో, సాహిత్యానురక్తిలో ఉంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను అంగీకరించిన సమన్వయదృష్టి ఈ రచనల ప్రధాన లక్షణం. పద్యగానంలోనూ, సాహిత్యవ్యాఖ్యానంలోనూ ఆయన అపూర్వప్రతిభ సమకాలీనుల ప్రశంసలను అందుకుంది.

ప్రచారానికి దూరంగా, సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేసిన జువ్వాడి గౌతమరావు తెలుగుసాహిత్యంలో నిశ్శబ్ద దీపస్తంభం. జీవితాంతం సాహిత్యఅధ్యయనంలోనూ, విశ్వనాథ కల్పవృక్షగానంలోనూ గడిపిన జువ్వాడి గౌతమరావు నిరాడంబరంగా తనదైనరీతిలో సాహిత్యసేవ చేసిన అరుదైనవ్యక్తి. ఆయన పద్యపఠనం, పద్యగానం వినేవారిని మంత్రముగ్ధులను చేసేవి. వింటూ ఉంటే వింటూనే ఉండాలనిపించే స్వరమాధుర్యం ఆయన సొంతం. భావయుక్తంగా పద్యాలను ఆలపిస్తూ, వాటి అంతరార్థాన్ని శ్రోతల హృదయాలకు చేరవేయగల సామర్థ్యం ఆయనకు ఉండేది. తెలుగుపద్యంలోని అందాలు, లయ, శక్తి, భావగాంభీర్యం వినేవారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలిగిన అరుదైన సాహితీవేత్త గౌతమరావు. “కవిత్వంలో బలముండాలి గానీ అది పద్యమా, వచనమా అన్నది అంత ముఖ్యంకాదు” అని తరచూ చెప్పేవారు. విశ్వనాథను అభిమానించినా, ఆధునిక కవిత్వాన్ని తక్కువ చేయని విశాలదృక్పథం ఆయనది.

గౌతమరావు కరీంనగర్ మండలం ఇరుకుళ్ల గ్రామంలో 1929 ఫిబ్రవరి 1 న జన్మించారు. కరీంనగర్లోనే పాఠశాల విద్య పూర్తిచేసి, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎ, ఎల్‌ఎల్‌బి చదివారు. ఆ కాలంలో పివి నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీమిత్రులతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఆ పరిచయాలు ఆయన సాహిత్య దృక్పథాన్ని మరింత విశాలం చేశాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న గౌతమరావు, ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆనాటి పాలకులు ఆయనకు రెండేళ్ల కారాగారశిక్ష విధించి ఔరంగాబాద్ జైలుకు తరలించారు. అయితే రెండునెలలకే జైలునుంచి తప్పించుకొని తిరిగి ప్రజాఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమం, సామాజికచైతన్యం ఆయన వ్యక్తిత్వంలో విడదీయరాని భాగాలుగా నిలిచాయి.

గౌతమరావు చదివిన విశ్వనాథ సత్యనారాయణ తొలిరచన ‘చెలియలికట్ట’. ఆ పరిచయం క్రమంగా విశ్వనాథ సాహిత్యంపై గాఢమైన అభిమానం, అధ్యయనంగా మారింది. విశ్వనాథ సాహిత్యంలోని తాత్వికత, భారతీయత, కళాత్మకతలను కొత్తతరానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర విశేషమైనది. 1950 ప్రాంతంలో ‘జయంతి’ పత్రికను పునరుద్ధరించి కొన్నిసంచికలు వెలువరించారు. అందులో నిర్వహించిన ‘సాహిత్యధార’ శీర్షిక విస్తృత ఆదరణ పొందింది. గౌతమరావు కేవలం విమర్శకుడు మాత్రమే కాదు. లేఖారచనల్లో ఆయన సంజీవదేవ్ వంటివారు. ఇంకా సాహిత్యవ్యాసాలు, పీఠికలు, సమీక్షలు, జ్ఞాపకాల రచనలు, అనువాదాలు రచనావైవిధ్యానికి నిదర్శనాలు. ఆయన రచనలను వెల్చాల కొండలరావు ‘సాహిత్యధార’ పేరుతో సంకలనంగా ప్రచురించారు. ఆ గ్రంథం గౌతమరావు అధ్యయన విశాలతకు, సాహిత్య నిబద్ధతకు సాక్ష్యంగా నిలుస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ ఆయన గురించి “పొగడపూల నెత్తావులు విరజిమ్మే చెలిమి వెన్నెలదొర గౌతమరావు” అన్నారు. ఈ ప్రశంస గౌతమరావు వ్యక్తిత్వానికి లభించిన అరుదైన గౌరవం.

సాహితీజీవనంలోనే కాదు, నిజజీవితంలోనూ గౌతమరావు స్నేహశీలి. సంగీతాభిమాని. మానవతావాది. పద్యాన్ని ప్రేమించినంతగా మనుషులను ప్రేమించిన వ్యక్తి. ప్రచారానికి దూరంగా ఉన్నందువల్ల ఆయన కృషి గురించి కొత్తతరానికి పెద్దగా తెలియకపోయినా, తెలంగాణ సాహిత్యచరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానం. 2012 లో కన్నుమూశారు. కానీ ఆయన చదివిన పద్యాల ప్రతిధ్వని, పరిచయం చేసిన విశ్వనాథ, నిర్మించిన సాహిత్య వాతావరణం ఇప్పటికీ తెలుగు సాహిత్యాభిమానుల జ్ఞాపకాలలో నిలిచి ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణను ఎంతగానో అభిమానించిన, ఆయన ముద్దసాని రాం రెడ్డి లాంటి రచయితల్ని గురించికూడా విశేషంగా ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *