కేవ‌లం ఒక్క సంఘ‌ట‌న‌పై ఇంత రాజ‌కీయ ర‌చ్చ అవ‌స‌ర‌మా?

హైదరాబాద్ సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో ఉపాధ్యాయురాలు ఇస్లామిక్ ప్రార్థనలైన ‘కల్మా’, ‘సూరహ్ ఫాతిహా’ చదువుకురావాలని హోమ్‌వర్క్ రాయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక మతానికి చెందిన ఆచారాలను, ప్రార్థనలను అన్యమత విద్యార్థులపై బలవంతంగా రుద్దడం అక్షరాలా రాజ్యాంగ విరుద్ధం, విద్యావ్యవస్థ మౌలిక సూత్రాలకే గొడ్డలిపెట్టు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం, సదరు ఉపాధ్యాయురాలిని స్కూల్ యాజమాన్యం తక్షణమే తొలగించి, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టపరంగా సమర్థించదగిన చర్యలు. అయితే, ఈ దురదృష్టకరమైన ఘటనను సాకుగా తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అంతకంటే ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ—తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే స్కూళ్లలో విద్యార్థులకు బొట్టు (తిలకం), గాజులు ధరించడం తప్పనిసరి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి.

కేవ‌లం ఒక‌ ఘటన లేదా ఒక ఉపాధ్యాయురాలి మతోన్మాద చర్యను అడ్డం పెట్టుకుని, పాఠశాలల్లో మతపరమైన నిబంధనలను తప్పనిసరి చేస్తామని ప్రకటించడం విద్యావ్యవస్థను మరింత కాషాయీకరణ చేయడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం, విద్యాసంస్థల్లో ఎలాంటి మత ప్రబోధాలను బలవంతంగా రుద్దకూడదు. అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పాఠశాలల్లో “మతాల గురించిన అధ్యయనం” తప్పుకాదని, అది లౌకికవాదానికి వ్యతిరేకం కాదని పేర్కొంది. కానీ, ఏదైనా ఒక నిర్దిష్ట మతాన్ని ప్రబోధించడం లేదా ప్రార్థనలను బలవంతం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మరి ఒక మత ప్రార్థనను తప్పుబట్టినప్పుడు, అదే పాఠశాలల్లో మరొక మత చిహ్నాలను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తామని చెప్పడం ఏ రకమైన లౌకికవాదం? బండి సంజయ్ వ్యాఖ్యలపై లౌకికవాదులు, విద్యావేత్తలు మరియు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

పాఠశాలల్లో మతపరమైన నిబంధనలను రుద్దడం రాజ్యాంగ విరుద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. టీచర్ తప్పు చేస్తే స్కూల్ యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకుందని, అయినా సరే ఈ ఉదంతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ సమాజంలో ఉద్రిక్తతలు పెంచుతున్నారని విమర్శిస్తున్నారు. విద్యాలయాలు పిల్లల్లో సమానత్వం, లౌకికత్వాన్ని పెంపొందించే కేంద్రాలు , అక్కడ కూడా “హిందూ-ముస్లిం” విభజన తీసుకురావడం భావ్యం కాదు . గతంలో కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. నాడు స్కూళ్లలో మతపరమైన దుస్తులు (హిజాబ్) వేసుకోకూడదని వాదించిన బీజేపీ నాయకులు, నేడు అదే స్కూళ్లలో హిందూ సంప్రదాయాలను తప్పనిసరి చేస్తామని చెప్పడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం.సదరు ముస్లిం టీచర్ చేసిన పని ఖచ్చితంగా తప్పేనని లౌకికవాదులు అంగీకరిస్తున్నారు. అయితే, ఒక వ్యక్తి చేసిన తప్పును సాకుగా చూపిస్తూ, మొత్తం పాఠశాల వ్యవస్థలోనే ఒక మతాచారాలను తప్పనిసరి చేస్తామని బండి సంజయ్ ప్రకటించడాన్ని వారు పెద్ద ప్రమాదంగా చూస్తున్నారు.

లౌకికవాదులు టీచర్ తప్పును సమర్థించడం లేదు, కానీ ఆ తప్పును అడ్డం పెట్టుకుని జరిగే మత రాజకీయాలను మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. టీచర్ చేసిన తప్పు బయటపడిన వెంటనే స్కూల్ యాజమాన్యం ఆమెను విధుల్లోంచి తొలగించింది. అలాగే పోలీసులు కూడా ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. లౌకికవాదులు లేదా ప్రగతిశీల సంఘాలు టీచర్ చర్యను తప్పుబడుతూ సోషల్ మీడియాలో లేదా చిన్న వేదికలపై మాట్లాడినప్పటికీ, ప్రధాన స్రవంతి మీడియా కేవలం బండి సంజయ్ వ్యాఖ్యలు మరియు దానికి వొస్తున్న రాజకీయ కౌంటర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల లౌకికవాదుల స్పందన బయటకు రావడం లేదనే వాదన కూడా ఉంది. విద్యార్థి కుటుంబ సభ్యులు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీసులు ఉపాధ్యాయురాలిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 (మతపరమైన సెంటిమెంట్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం) కింద కేసు నమోదు చేశారు. చిన్నారిపై మానసిక ఒత్తిడి తెచ్చినందుకు గాను సదరు టీచర్‌పై జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరత్వం) కింద కూడా పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు క్లాస్‌రూమ్ రికార్డులను పరిశీలించారు.

ఆ క్లాసులో మొత్తం 25 మంది విద్యార్థులు ఉండగా, కేవలం ఒక్కరు మాత్రమే హిందూ విద్యార్థి అని తేలింది. మిగతా ముస్లిం విద్యార్థుల డైరీలలో రాయబోయి, పొరపాటున ఈ విద్యార్థి డైరీలో కూడా ఆ హోమ్‌వర్క్ రాసినట్లు సదరు టీచర్ పోలీసుల విచారణలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యాశాఖ ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది . ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత ఎజెండాలు లేదా మతపరమైన అంశాలను సిలబస్‌లో కానీ, హోమ్‌వర్క్‌లలో కానీ చేర్చకూడదని, కేవలం ప్రభుత్వం ఆమోదించిన కరికులం మాత్రమే అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ ఉదంతాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పాఠశాలల్లో మత వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3) కింద తీవ్ర ఉల్లంఘన అని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సదరు ఉపాధ్యాయురాలిని స్కూల్ నుండి శాశ్వతంగా తొలగించడం మరియు స్కూల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పడంతో తాము సంతృప్తి చెందామని, చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని విద్యార్థి తల్లిదండ్రులు ఒక లేఖలో పేర్కొన‌డం కొస‌మెరుపు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *