‘‘ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ సహకారం లేనిది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగదు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఏ మాత్రం నిధులను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వంపై నేపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయింది.’’
తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇచ్చింది.. ఇంకా ఇస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ సహకారం లేనిది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగదు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఏ మాత్రం నిధులను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వంపై నేపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయింది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్రామ పంచాయతీలంటే గౌరవం లేదు అలాంటప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని గ్రామాలకు నిధులు ఇస్తుంది అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? . జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం పంచాయితీ రాజ్ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. దీంతో పంచాయితీల అభివృద్ధి విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధి ఏమిటో అందరికి తెలిసిపోయింది .
ప్రతి గ్రామ పంచాయితీ ప్రస్తుతం 7 నుండి 20 లక్షల వరకు ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి స్వీకరిస్తుంది. దీనికి అదనంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరో 5 లక్షల రూపాయలను పొందుతుంది.15 వ ఆర్థిక సంఘం ద్వారా స్వచ్చ భారత్ మిషన్ క్రింద పంచాయతీలకు వచ్చే 50 శాతం నిధులను శానిటేషన్ కోసం, వాటర్ కోసం వినియోగించాలని వివరించడం జరుగుతుంది. వాటర్, శానిటేషన్ కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి 682. 50 కోట్లు ఎప్పుడో విడుదల అయ్యాయి.
గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు మరియు దేశం బాగుపడుతుందనేది వాస్తవం కాబట్టే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీల అభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా కాశ్మీర్ వ్యాలీలోని ఓ గ్రామానికి వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పంచాయతీల ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ చాటారు, కానీ కొంత మంది ముఖ్య మంత్రులు మాత్రం పంచాయితీలను కానీ, పంచాయితీల అభివృద్ధిని గానీ ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు, అందుకు సరియైన ఉదాహరణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పవచ్చు. చరిత్రలో ఎప్పుడు కన్పించని విధంగా నరేంద్రమోడీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే వారి పాలనను చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులు బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శించడాన్ని మనం ప్రతి రోజు గమనిస్తూనే ఉన్నాం.
గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం నిధులను నేరుగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు పంపినప్పుడే వాటి అభివృద్ధి జరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని నరేంద్ర మోడీ కూడా కొనసాగిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తుంది.అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను గ్రామ పంచాయితీలకు పంపడాన్ని జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరం..! నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయించి ఎటువంటి అవినీతి,దురాక్రమణలు జరగకుండా గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలనేదే 73వ రాజ్యాంగ సవరణ మరియు రాజ్యంగంలోని పదకొండవ షెడ్యూల్ ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగ స్పూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండటం భారతదేశ ప్రజలకు శుభ సూచకం.
కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి ఆశించిన విధంగా సహకరించడం లేదు. గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, స్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులకు కేంద్రం నిధులిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయా నిధుల్లోనూ అవినీతికి ఆస్కారం ఉండేలా నచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తున్న మాట వాస్తవం కాదా? గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నీరుగారుస్తున్నది వాస్తవం కాదా? గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా? కేసీఆర్ చేతగానితనంవల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల కోసం నిధులిస్తే ఆ నిధులను కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఒకే సంస్థకు కట్టబెట్టేలా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలంటూ హుకూం జారీ చేసింది నిజం కాదా?
పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా 5 కేజీల బియ్యం ఉచితంగా పంపిస్తే వాటిని ప్రజలకు అందకుండా దారి మళ్లిస్తూ పేదల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం చిన్నాభిన్నంగా చేసింది . కేంద్రం నుండి రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరగాలని నీతులు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాల నుండి గ్రామాలకు నిధులు, విధులను ఎందుకు వికేంద్రీకరించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
తండాలను పంచాయతీలుగా మార్చి ఆ గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వకుండా గ్రామ సర్పంచ్‌లను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతుండటంతో అనేక మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోవడమే కాక తమ సొంత డబ్బును గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం ఖర్చు చేసి అప్పుల పాలు అవుతున్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే గ్రామ పంచాయితీల అభివృద్ధి విషయంలో కేసీఆర్ కక్ష్య సాధిస్తున్నారని అర్థం అవుతుంది. కాబట్టీ ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయితీల అభివృద్ధికి నిధులను విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నిత్యం నరేంద్రమోడీ ని, బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించడం మీద ఉన్న దృష్టి అభివృద్ధి సాధించడంపై లేదు అని చాలా సందర్భాలలో నిరూపితమైంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని నరేంద్రమోడీని, బిజెపిని బద్నాం
చేస్తున్నారని తెలంగాణ ప్రజలు క్రమక్రమంగా నిజాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎన్ని రకాల ఆరోపణలు చేసిన నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది.. కాబట్టీ గ్రామ పంచాయతీలకు నిధులను అందిస్తూన్నే ఉంటుంది.
– డా. వీరపనేని పద్మ,జాతీయ కార్యవర్గ సభ్యురాలు
భారతీయ జనతా మహిళ మోర్చా.