ఆసక్తిని రేకెత్తించేలా ఆరంభమై క్రమంగా విస్తరించి విస్తృత ఆదరణ పొందిన ఆధునిక కవితా ప్రక్రియ నానీలు. సూక్ష్మంగా అనంతాన్ని ఆవిష్కరించే సౌలభ్యమున్న ప్రక్రియగా నానీలకు ఎంతో పేరొచ్చింది. ఆకర్షణీయమైన ఎత్తుగడతో ఆరంభమై అద్భుతమనిపించే కొసమెరుపుతో ముగియడంలోనే నానీల ప్రత్యేకత దాగి ఉంది. మనసు పొరల్లో పదిలంగా దాచుకున్న భావ సంచయాల్ని నా చిన్న హృదయం పేరుతో సుంకరి కృష్ణప్రసాద్ నానీల సంపుటిని అందించారు. వస్తువైవిధ్యం కలిగి నిర్మాణ కౌశలంతో, పొందికైన పదాల సమ్మేళనంతో ఆకట్టుకునే 464 నానీలు ఇందులో ఉన్నాయి.
ప్రవహించే నదికి ఈ నానీల సంపుటిని కవి అంకితమిచ్చారు. చిట్టి నానీల్లో గట్టి భావజాలం వ్యక్తమైంది. అనేక విధాలుగా/ భాగించబడ్డాను / కానీ…/ నేను నిశ్శేషం కాదు అన్న నానీ కఠోర జీవితయానాన్ని నిర్వచించి చూపింది. కోల్పోయిన / బాల్య మిత్రుణ్ణి కలిసా/ నవ్వుతూ/ భుజంపై చేయి వేశాడు అనడంలో చిన్ననాటి స్నేహం అపూర్వం అన్న గొప్ప భావన తొంగిచూసింది. ఈరోజు నేనొక/ స్వేచ్ఛా ప్రపంచాన్ని చూశాను / అక్కడ / ప్రేమ మాత్రమే ఉంది అన్న నానీలో ఆలోచనలోని విశాలతను పట్టుకోవచ్చు. వాళ్లు పేదరికాన్ని/ చూపమన్నారు/ నేను మా ఇంటి / పాతగోడను చూపాను అనడంలో అసమానతల వల్ల ఏర్పడ్డ అంతరాలను గమనించవచ్చు. నా పాత బడికి/ వచ్చాను/ చెట్టు మీద పక్షి/ నన్ను గుర్తుపట్టి అరుస్తోంది అని బడితో తనకున్న ఎడతెగని, విడదీయ సాధ్యం కాని అనుబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆకలి/ ఎంత గొప్పదో / మరణాన్ని / జీవితంతో లిఖిస్తోంది అన్న నానీ ఆకలి వల్ల కలిగే వైపరీత్యాన్ని దృశ్యమానం చేసింది. మనిషి కోసం అన్వేషణలో దారి తప్పి నా కళ్లు అతణ్ణి కలిసే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయని మరొక నానీలో వెల్లడించారు. ఏదో వెతుకుతుంటే దొరికిన నాన్న ఫోటో ఇంకా దారిని చూపుతూనే ఉంది అన్న నానీ కంటి తెరపై అనుబంధపు చెమ్మను పుట్టిస్తుంది.
తన స్వేచ్ఛా పతనం చివరకు ఎదురులేని విజేతగానే నిలిపిందని ఒక నానీలో చెప్పారు. అనంతకాలాల నుండి తాను దగ్ధమవుతూ వస్తున్నానని ఇంకో నానీలో తెలిపారు. విశ్వాన్నంతా/ కూడగడుతున్నాను/ జీవితం/ గెలిచి తీరాలని అన్న నానీ ఉదాత్త జీవన లక్ష్యాన్ని ముందుంచుతుంది. ప్రతి సవాలును/ గౌరవించాను/ నేను / కనుగొనబడ్డాను అనడంలో అలుపెరుగని పోరాట తత్వాన్ని చూడొచ్చు. జీవితం వెంట/ సమస్త ప్రపంచం / పాపం/ మృత్యువు ఒంటరిది అన్న నానీ మరోధైర్యానికి బింబ ప్రతిబింబమైంది. కిటికీలోంచి / ఆకాశం అంచును చూశాను/ దూరం/ మరీమరీ దగ్గర అన్న నానీ కవి ఊహాశాలిత లోని బలిమిని చాటింది.
కాలం అంచు మీద/ నా స్వప్నం వెలిగింది/ అది/ నేటి నా ఉదయం అన్న నానీ ఆత్మవిశ్వాసాన్ని నింగికి ఎగరేసింది. పిట్టల పిలుపులతో/ నిద్రలేచాను/ ఈ రోజంతా/ నా సొంతం అనడం ఆగామిపై భరోసాను ఇచ్చింది. నా చుట్టూ/ గోడలు కడతారు/ వాళ్ళకు తెల్వదు/ నా స్నేహం ఆకాశంతోనేనని తనలోని స్వేచ్ఛాపూరితత్వాన్ని చాటారు. గతం మన ఉనికిని ఎరుక పరుస్తుందన్నారు. బడిలోని జ్ఞానమున్న మొక్కలు మనుషులనూ చదివేస్తాయని చెప్పారు. అలుపెరుగని అలలు నిదురించే కలలని అభివర్ణించారు. ప్రవహించే నది ఎండిపోవడాన్ని అత్యంత విషాదంగా భావించారు. నిరంతర నిరసనకు నల్లతుమ్మ చెట్టును ప్రతీకగా చూపారు. ఆ కొండకు/ చేసే పనేమీ లేదు/ ఒంటరి హృదయాల/ తోడుంటది అన్న నానీ కవిలోని శిఖర స్థాయి భావనగా నిలిచింది. మృత్యువును ఒక సుదీర్ఘ కలగా చెప్పారు. ఆకాశంలో ఎగిరే పిట్టలను అందమైన డిజైన్లుగా చిత్రించారు. కలల దుప్పట్లను, చలికాలపు ఉదయాకాశాన్ని ఆవిష్కరించారు. నీడలకైనా స్వేచ్ఛనివ్వండి అని సరికొత్త అంశాన్ని చర్చకుపెట్టారు.
ప్రజాయుద్ధనౌక/ తీరం చేరింది/ అలల వెంట/ పాట విస్తరిస్తోంది అన్న నానీలో గద్దర్‌ను స్మరించారు. పూలను తెంపి/ మాలలు అల్లేస్తాం/ స్వాగతం సుస్వాగతం/ బడి బాట అని పాఠశాలల పునః ప్రారంభాన్ని నానీగా మలిచారు. గంభీర మౌన సముద్రంలో / ఉందా చెట్టు/ బుద్ధుని / గాలి సోకింది మరి అన్న నానీ జ్ఞానదిశను ప్రసరించింది. కాలం జారిపోతున్నా/ మరో కొత్త రుతువుకై / ఆకాంక్ష/ నూతన సంవత్సరం అని స్వాగతం పలికారు. తుమ్మ చెట్టు/ వాలుగా నిలబడింది/ మనసు నిండా/ అన్నీ ప్రశ్నలే అన్న నానీ లోతుగా అలోచింపజేస్తుంది మనసంతా/ వలసపోయింది/ దేహం ఒక ప్రశ్నైంది/ చెట్టు ఎండిపోయింది అన్న నానీ అంతరంగ ఆవేదనను వెల్లడించింది.
ఆ చెట్టుకు/ సొగసెక్కువ/ తన కొమ్మలతో/ చూపులు విసురుతోంది అన్న నానీ కవి సృజన సామర్థ్యాన్ని ప్రకటించింది. ఇంట్లో ఓ పిచ్చుక/ గూడు కట్టుకుంటుంది/ ఇల్లు తనదే/ అని చెప్పుకుంటోంది అంటూ లోతుగా ఆలోచింపజేశారు. అమ్మో/ పూలకి అన్నీ తెలుసు/ నా రహస్యాలని శ్రద్ధగా చదువుతాయి అని హెచ్చరికను విసిరారు. కోసిన పొలంలో/ నిల్చున్నాను/ చెదిరిన జ్ఞాపకాలు/ కళ్లను చేరాయి అన్న నానీ గడచిన గతాన్ని గుర్తు చేసింది. సమాంతర ప్రపంచాల గొప్ప అనుసంధానంగా అక్వేరియాన్ని గురించి చెప్పారు. బడి పక్కన గుట్ట పిల్లల జ్ఞానాన్ని ఎప్పుడూ సవాలు చేస్తుందని చెప్పిన నానీ ఆలోచింపజేస్తుంది. మేము / కలిసి చదువుకున్నాం/ తిరిగి కలిసాం/ శిఖరాగ్ర సమావేశం అన్న నానీ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికను గుర్తు చేసింది. ఉబుకుతున్న స్వేచ్ఛ/ సృజన/ రాలిపడుతున్న జలపాతం/ నా మనస్సు అన్న నానీ మెరుపై మెరిసింది. ఆ మొక్కకు/ గంపెడు పువ్వులు/ తనపేరు చెప్పుకోదు/ జీవన సాఫల్యం అన్న నానీ సంతృప్తి అంటే ఏమిటో తెలిపింది. ఉదయాలు, అస్తమయాలు, ఏకాంతాలు కలిస్తే జీవితం అన్నారు.
హృదయాల భాష ఎప్పటికీ రహస్యమేనని భావించారు. మనసు రూపం అపురూపమే అన్నారు. కలత లేని నిద్రకు కమ్మని కలలున్నాయని చెప్పారు. క్షణాల విలువ అనంతమని అన్నారు. కలలకి చురకలంటించే సూర్యుడు గొప్ప రియలిస్ట్ అని పసి ఆకుల ఆటలు బాల్యమని చెప్పిన ప్రతిపాదనలు సరికొత్తగా కనిపిస్తాయి. ప్రియమైన వారే/ పరాయి అవుతారు/ ఆటో ఇమ్యూన్/ జీవితాలు అన్న నానీ జీవన వాస్తవికతను బహిర్గతం చేసింది. జీవితం బరువును కవితల పుస్తకంతో ఒక నానీలో పోల్చారు. మనిషిని ఆకలే నిలబెట్టి, పడగొడుతుందని అన్నారు. అలలకు తీరం కలలను కూల్చడమే పనిగా మారిందని చెప్పారు. మనిషికి ఎన్నో ముసుగులు ఉన్నాయని అన్నారు. సున్నితమైన హృదయాన్ని గాజుగ్లాసుపై ఉన్న అందమైన బొమ్మతో పోల్చారు. సత్యం ఎప్పుడు ఒంటరిదేనని గింజలను ఏరుకొని తింటున్న పావురాలను ప్రతీక చేసి చూపారు. పండుటాకులు/ నవ్వుతూ రాలుతున్నాయ్/ చెట్టు / ఎంత ప్రేమను పంచిందో అన్న నానీలో జీవితపు చివరి అంకాన్ని ప్రదర్శించారు. హృదయపు దోసిలి ఒంపిన భావాల సచిత్రాలే ఈ నానీలు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764