ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులు ఏకీకృత సర్వీస్ రూల్స్ పై సమన్వయం సాధించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిస్తున్నాయి. న్యాయపరంగా పర్యవేక్షణాధికారి పోస్టులన్నీ తమతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తుండగా, మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిష్పత్తి ప్రకారం పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని మరి కొన్ని సంఘాలు కోరాయి..దీనితో కోర్టు బయట ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘాల మధ్య రాజీ కుదిర్చి పర్యవేక్షణాధికారుల పోస్టులను భర్తీ చేద్దామనుకుంటున్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు.
వేసవిలోనే హడావిడి చేస్తున్న ప్రభుత్వం
గతకొన్ని సంవత్సరాలుగా కోర్టులో నలుగుతున్న సమస్యపై న్యాయపరంగా దృష్టిసారించని ప్రభుత్వము ఆదరాబాదరాగా వేసవిలో ప్రమోషన్ ఇస్తామని హడావుడి చేస్తూ ప్రతి సంవత్సరము ఇదే తంతు కొనసాగిస్తోంది. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించ కుండా తూతూ మంత్రంగా హడావిడి సమావేశాలను ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కోర్టులో వాదనలు వినిపించి ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. లేనట్టయితే పేద విద్యార్థుల భవిష్యత్తులేనట్టయితే పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకార బంధురం అవుతుంది.
90% పైగా పర్యవేక్షణ అధికారుల ఖాలీలు
తెలంగాణ రాష్ట్రంలో 539 మంది ఎంఈవోలు ఉండాల్సి ఉండగా 520కు పైగా ఖాళీలు ఉన్నాయి. 56 జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు మంజూరు కాగా 50కి పైగా ఖాళీలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో దశాబ్దాల తరబడి కోర్టు కేసులు కొనసాగుతుండటంతో పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు.
ఇన్ చార్జ్ లే దిక్కు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తూ విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సిన మండల విద్యాధికారుల పోస్టులకు(ఎంఈవో) ఏళ్లకు ఏళ్లుగా ఇన్‌ఛార్జిలే దిక్కవుతున్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే మండలాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించే పాఠశాల ఒక చోట ఉండగా మండలంతో పాటు మరో మూడు,నాలుగు ఇతర మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా పనిచేస్తున్నారు.
ఎమ్మెల్యేలు పర్యవేక్షణకు కాకుండా కేవలం ఉపాధ్యాయుల వేతన బిల్లులు ,మెడికల్ లీవ్ మంజూరు, సమావేశాల హాజరుకే పరిమితం అవుతున్నారు. జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుండి ప్రతిరోజు ఏదో ఒక రకమైన ప్రొఫార్మా నింపి వాటికి సంతకం పెట్టడానికే సమయం సరిపోవడం లేదు.
అటు బడిని, పనిచేస్తున్న మండలాన్ని పర్యవేక్షించడమే గగనమవుతున్న తరుణంలో దూరంలోని ఇతర మండలాలకు కూడా వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఫలితంగా ప్రధానోపాధ్యాయుడి విధులు, ఇన్‌ఛార్జి ఎంఈవో విధులకు న్యాయం జరగని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు ఉండగా 50కిపైగా ఖాళీలు ఉన్నాయి.ప్రతి నియోజకవర్గానికి ఒక ఉప విద్యాశాఖ అధికారి చొప్పున మరో 63 పోస్ట్ లు మంజూరు చేసేలా,ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారి పోస్టు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ప్రహసనంగా మారుతున్న పర్యవేక్షణ
పాఠశాలలపై పర్యవేక్షణ ప్రహసనంగా మారి పాఠశాలల విద్యారంగం గతి తప్పుతున్నా ఉన్నతాధికారులు, పాలకులు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారులను నియమించడంపై, కోర్టు కేసులు పరిష్కరించడం పై తగిన శ్రద్ధ వహించక పోవడం సమంజసం కాదు. ప్రధానోపాధ్యాయుడిగా..వివిధ మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈవోగా బాధ్యతలను నిర్వహిస్తున్న వారికి ఈ విధులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడిగా మరో పాఠశాలకు బదిలీ అయినా ఇన్‌ఛార్జిగా ఎంఈఓ బాధ్యతలు మాత్రం తప్పడం లేదు. ఇన్‌ఛార్జిగా ఎంఈవోల్లో ఎవరైనా ఉద్యోగ విరమణ పొందితే కోర్టులో ఉన్న కేసుల దృష్ట్యా ప్రస్తుతమున్న వారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు, మండలాల పర్యవేక్షణకు వారు దేనికి న్యాయం చేయలేని పరిస్థితిలో నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై మొక్కుబడి పర్యవేక్షణ జరుగుతుండగా, ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసిన దాఖలాలు అరుదుగానే నిలుస్తున్నాయి. పాఠశాల విధులు, విద్యాశాఖ అడిగే సమాచార సేకరణ, సమావేశాలు, శిక్షణలు వంటి కార్యక్రమాలకి సమయం సరిపోవడం లేదు.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మరియు కోర్టుల సహకారంతో సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించి, ఎలాంటి న్యాయ వివాదాలకు తావు ఇవ్వకుండా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి భర్తీ చేస్తేతప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు.
ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులకు పర్యవేక్షణాధికారుల పోస్టులలో పదోన్నతులు కల్పిస్తే మరిన్ని ఖాళీలు ఏర్పడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కూడా లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని మండల,జిల్లా పర్యవేక్షణ అధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు
వరంగల్ జిల్లా అధ్యక్షులు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టిపియుఎస్), 9866776286