రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ తేదీన కొత్తగా పార్టీని ఏర్పాటు చేసేందుకు సచిన్ సిద్ద పడుతుండడంతో రాజస్తాన్‌లో ఇప్పుడు మరోసారి రాజకీయ సంక్షోభం మొదలైనట్లైంది. ఒకవైపు కర్ణాటకలో చాలా కాలం తర్వాత తిరిగి అధికారంలోకి రాగలిగామన్న సంతోషంలో ఉండగానే రాజస్తాన్‌లో ఉపద్రవం ముంచుకొచ్చింది. మరో నాలుగు నెలల్లో ఇక్కడ శాసనసభ ఎన్నికలు రానున్న తరుణంలో ఇరువురు నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగా పొడసూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఈసారి సచిన్ పైన ఏ మాత్రం పనిచేయడంలేదు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్‌లో అధికారంలోకి రావడానికి ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా సచిన్ పైలెట్ విశేషంగా కృషిచేశాడు. తానుపడిన కష్టాన్ని చూసి తనకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారని సచిన్ చాలా ఆశగా ఎదురుచూశాడు. అయినా పార్టీలో అత్యంత సీనియర్ అయిన అశోక్‌గెహ్లెట్‌నే ముఖ్యమంత్రిని చేశారు.అప్పటినుండి ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు పొడసూపుతూ వొచ్చాయి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వాన్ని ఎదగనీయడంలేదన్నది చాలాకాలంగా వినిపిస్తున్నది. రాహుల్‌గాంధీ కూడా తనకు ఏఐసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టే విషయంలో ఇదే అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అయినా కాంగ్రెస్ పార్టీలోని కురువృద్ధులెవరూ ఆయన మాటను పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న జ్యోతిరాధిత్య(మధ్యప్రదేశ్), సచిన్‌పైలెట్‌లకు ఇది తీవ్ర విఘాతంగా మారింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధి త్యకు ముఖ్యమంత్రి పదవిపై ఇచ్చిన హామీకి వృద్ధ నాయకత్వం అడ్డుపడడంతో విసిగిపోయి ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడక్కడ ఆయన ఉపరితల రవాణాశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు. అదే సమయంలో సచిన్ పైలెట్‌కూడా పార్టీ వీడిపోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఆయన ను అనునయించి ఆయన ఆలోచనను విరమింపజేశారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవిని ఈ అయిదేళ్ళ కాలంలో ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు అనుభవించే విధంగా ఒడంబడిక చేశారు. అయితే గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అశోక్ గెహ్లెట్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేక పోవడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వొచ్చింది.
మరో నాలుగైదు నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సంక్షోభంగా మారింది. కర్ణాటకను గెలుచుకున్నట్లే పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కొనసాగితే రాజస్తాన్‌లో తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆ పార్టీ అధిష్టాన వర్గం ఊహాగానాలు చేస్తోంది. ఈ వివాదాన్ని ఎట్టి పరిస్థితిలో పరిష్కరించాలని మే 29న గెహ్లెట్‌ను, పైలెట్‌ను దిల్లీకి పిలిపించుకుని ఇద్దరి మధ్య సయోధ్యకూర్చే ప్రయత్నాలు చేశారు. కాని ఇద్దరు కూడా పట్టుదలగానే ఉండడంతో అధిష్టానం ఇప్పుడు తల పట్టుకుంది. సచిన్ పైలెట్ మొదటినుండి గత బిజెపి ప్రభుత్వంలో వసుంధరరాజె ముఖ్యమంత్రిగా అనేక అవినీతిచర్యలకు పాల్పడిందని, వాటిపై విచారణ జరిపించాలని తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఆయన డిమాండ్‌ను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా ఆయన అగ్రహానికి కారణంగా మారింది. దీనిపైన ఏప్రిల్ 11న ఒక రోజు నిరహారదీక్షకూడా ఆయన చేపట్టాడు. దీనితోపాటు రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాల లీకేజీపై చర్యలు తీసుకోవాలని మరో డిమాండ్‌ను ముందుకు తీసుకు వొచ్చారు. ఈ విషయమై అజ్మీర్ నుండి జైపూర్ వరకు సుమారు అయిదు రోజులపాటు పాదయాత్రకూడా చేపట్టాడు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం తో దీనిపై నిర్ణయం తీసుకోవడానిక మే 31 ఆఖరు తేదీగా ఆయన ప్రకటించారు. కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించాడు.
సచిన్‌పైలెట్ తండ్రి రాజేష్‌పైలెట్ కూడా కాంగ్రెస్ నాయకుడు. ఆయన రెండు సార్లు ఎంపీగా ఎన్నికై డా. మన్‌మోహన్‌సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. అలాగే రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. తండ్రిబాటలోనే సచిన్‌కూడా కాంగ్రెస్ వీడి పోవడానికి ఇష్టం లేకపోయినా పరిస్థితులు ఆయనను వివషుడిని చేస్తున్నాయి. జూన్ 11న రాజేష్‌పైలెట్ వర్థంతిని పురస్కరించుకుని ప్రతీఏట స్వచ్చంద కార్యక్రమాలు చేసే సచిన్ ఈసారి ఆదే రోజు కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ప్రోగ్రెసివ్ కాంగ్రెస్, రాజ్ జన సంఘర్ష్ అన్న పేర్లు రిజిస్ట్రేషన్ చేయించాడన్న వార్తలు వొస్తున్నాయి. కాగా కొత్త పార్టీకి ‘ప్రగతిశీల కాంగ్రెస్’ అని నామకరణం చేయనున్నట్లు కూడా తెలుస్తున్నది. ఏదిఏమైన ఆయన పార్టీ ప్రకటించేందుకు మధ్యలో ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఈ లోగా సోనియాగాంధీ చొరవతీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.