పక్షం రోజులు పైగా ఫామ్‌హౌజ్ విశ్రాంతి తరువాత -ఖరీదైన- అభ్యర్ధుల్ని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రానిది రాష్ట్రాల నిధుల పంపిణి తీరు చిల్లర వ్యవహారమని కేసియార్ ధ్వజమెత్తడం విడ్డూరంగా ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయితిరాజ్ వ్యవస్థ పరిపుష్టి కి అనేక సూచనలు చేసి అధికారంలోకి రాగానే సర్పంచులను, ప్రజాప్రతినిధులను నామమాత్రం చేసి, అన్ని నిధులు -సింగిల్ విండో- సరళితో ఇష్టా రాజ్యంగా పంపిణి చేస్తూ గ్రామీణ ఉపాది పథకం, గ్రామీణ రోడ్లపై సడక్ యోజన, మౌళిక అభివృద్ది నిధుల కేటాయింపులో కేంద్రం ఏక పక్ష వైఖరి చిల్లర వ్యవహారమని దుయ్యబట్టి ప్రయోజనం ఏమిటి..?
ప్రతి ఆరు నెలలకు కేంద్రం పెత్తనంపై కారాలు, మిరియాలు రువ్వి దిల్లీకి వెళ్ళి నిర్వందంగా నిరసన తెలపక మోడీ, అమిత్ షా ను ప్రసన్నం చేసుకోని వేల కోట్ల అవినీతికి గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకుంటే ఈ డేంజర్ లైట్ ప్రకటనలను ఎవరు నమ్ముతారు..?
రాజీవ్ గాంధీ నుండి మోడీ వరకని వరుస కేంద్ర ఆజమాయిషీని ప్రశ్నిస్తున్న చంద్రశేఖర్‌రావు , చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో భాగమయి ఎందుకు ఒక్కసారి ప్రశ్నించలేదు? తెలంగాణ అభివృద్దిలో నెంబర్‌వన్ అని ఊదరకొడుతూ, 5లక్షల కోట్ల అప్పుల కుప్పగా దిగజార్చి, కనీస పారదర్శకతను పాటించక కేంద్రంపై ధ్వజమెత్తితే అన్ని పక్షాలు ఎట్లా మద్దతును ఇస్తాయి..?
భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవ వేళ ఇంకా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యాలయాలు మూతపడి, విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమై, ప్రజా ఆరోగ్య వ్యవస్థ, గ్రామీణ అభివృద్ది వ్యవస్థ నానాటికి దిగజారుతుంటే జవాబుదారీతనం లేకుంటే కేంద్రం మీద దుమ్మెత్తిపోసి ఏమి లాభం..?
అధికారంలో ఉన్న పార్టీ, సమస్యపై ఐక్యంగా కలసి వచ్చే శక్తులతో చర్చించి ప్రజా సమూహాలతో వొత్తిడి తీసుకురావడం ఆనవాయితి. పంచాయితి రాజ్ వ్యవస్థను బలహీనం చేసి కేంద్రంతో పంచాయితీని తూర్పార పట్టడం కేసియార్ ఏమి పద్దతి? కలసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుదామంటే ఎక్కడ లేని అహంతో ఎవరిని పిలువకపోవడం తెలంగాణకు ఒక శాపంగా మారిందని గుర్తు చేస్తున్నాము.
-డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు