- పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు
- రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి
ముషీరాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 03 : కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు. ఈ మేరకు శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కుల, మాతాంతర వివాహాలు హత్యా రాజకీయాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం పీవోడబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల పరువు హత్యల బాధితులు అశ్రీన్, సంజన, అవంతిక, మాధవిలతో కలసి జడ్జి రాధా రాణి మాట్లాడుతూ సమాజంలో కులం పిచ్చి ఎక్కువవుతుందని, ప్రభుత్వ అసమర్థత వల్లనే పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ హత్యలపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. వోట్లు రావనే భయంతో రాజకీయ నాయకులు హత్యలపై నోరు విప్పడం లేదన్నరు. ఐనా వారికే వోట్లు వేసి గెలిపిస్తున్నాం కాబట్టి ఇలాంటి ఘటనకు కారణం మనమే అన్నారు. సమాజంలో మంచి చెడు చెప్పే తల్లిదండ్రులు, టీచర్లు, రాజకీయ నాయకులు కావాలన్నారు. రాష్ట్రంలో పరువు హత్యలపై మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ స్పందించకపోవడం బాధాకరం అన్నారు.
జడ్జిల సంఖ్య తక్కువగా ఉన్నందున సత్వర న్యాయం జరుగడంలేదన్నారు. ప్రొఫెసర్ రమ మేల్కొటే మాట్లాడుతూ..ఇటీవల కులం, మతం, వర్గం పేరుతో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలపై జరుగుతున్న హత్యలు ఎక్కువయ్యాయని, వీటిని వార్తా పత్రికల్లో, టీవీల్లో పరువు హత్యలు అని పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ ఈ హత్యలను కులోన్మాది పురుషాహంకార హత్యాలుగా చూడాలన్నారు. ముఖ్యంగా దళితేతర కులాల్లో మతాల్లో దళిత అబ్బాయిని వారి అమ్మాయి పెళ్లి చేసుకున్న సందర్భాల్లో ఈ దుర హంకారం కట్టలు తెంచుకుని వొస్తుందన్నారు. ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్‌లో ముస్లిం యువతి ఆశిన్ ఫాతిమా దళిత అబ్బాయి నాగరాజులు పెళ్లి చేసుకున్న సందర్భంలో అలాగే బేగం బజార్లో నీరజ్ పనవర్, సంజనాలు పెళ్లి కి సంబంధించి ఈ పితృస్వామిక కుల దురహంకార భావజాలం అత్యంత హింసాత్మకంగా బైట పడిందన్నారు. ఇది మహిళల స్వేచ్ఛను, రాజ్యాంగంలో కల్పించబడిన సమానత్వం, స్వేచ్ఛ, జీవించే హక్కులను ఉల్లంఘించడమే అన్నారు.
పీవోడబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య మాట్లాడుతూ…పరువు పేరిట జరుగుతున్న ఈ దురహంకార హత్యలు ఎవరో గ్రామీణ ప్రాంత వెనుకబడిన, భూస్వామి భావ జాలానికి చెందిన వారిని మాత్రమే కాదు పూర్తిగా పట్నవాస ఆధునిక జీవనం చేస్తున్న ప్రాంతాల్లో, వ్యక్తుల్లో, అందరిలో ఇవి కనబడుతున్నాయన్నారు. పోలీసుల రికార్డుల్లో ఇవి కేవలం హత్యలుగా మాత్రమే నమోదవడంతో ఈ దురహంకార హత్యల గణాంకాలు లేవన్నారు. ఈ దురహంకార హత్యలు వేరువేరు కులాల వారి వివాహ సందర్భంలోనే కాక ఒకే కులంలో ఆర్థిక అంతస్థుల తేడా వున్నపుడు కూడా జరుగుతున్నాయన్నారు. పేరుకు ఆధునికత, స్మార్ట్ ఫోన్స్, పాశ్చాత్య సంస్కృతులు కనబడుతున్నా మనసులో ప్యూడల్ దురహంకారం అలాగే కొనసాగుతుందన్నారు. మన దేశంలో కుల వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసిన అంబేద్కర్ కులాంతర వివాహాలు జరగాలనీ, తన పుస్తకంలో రచించారు కానీ దురదృష్టవశాత్తు నేడు కుల దురహంకారం మరింత వేళ్ళూనుకుని వుందన్నారు. ఈ అన్ని అంశాలపై లోతైన అధ్యయనం, చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సామజిక కార్యకర్త సజయ, ప్రొఫెసర్ పద్మజా షా, గడ్డం ఝాన్సీ, సుజాత సూరేపల్లి, కొండవీటి సత్యవతి, ఖలీదా పర్వీన్, రచనా ముద్రబోయిన, మీరా సంఘమిత్ర, గాది ఝాన్సీ, బి.జ్యోతి, విజయ, సుమిత్ర, దీప్తి, విజయ బండారు, పద్మ వంగపల్లి, రుక్మిణి రావు పాల్గొని ప్రసంగించారు.