కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా )
భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై అసంతృప్తిని బుజ్జగించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. జాతీయ వాద రాజకీయ కార్యకర్తలతో ఒక అఖిల భారత సంస్థను స్థాపించాలన్న భారతీయుల ఆలోచనకు ఏ .ఓ హ్యూమ్ 1829–1912 మధ్య కాలంలో ఒక నిర్దిష్టమైన తుది రూపు నిచ్చాడు.1885 డిసెంబర్‌లో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల నుంచి 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెస్ భారత ప్రజా జీవితంలోకి ప్రవేశించింది.అప్పటికే మన రాజకీయ పరిజ్ఞానము పరిణతమైనది. జాతి మత వర్గ విభేదములు సర్దుబాటు చేసుకొని భారతీయులు ఒక్క త్రాటి మీద నిలవవలసిన ఆవశ్యకత వచ్చింది.కొత్తశక్తులు సాంఘిక సంస్కరణములను చేపట్టి తమ ప్రభావములు ఒండింటిపై ప్రసరింపచేసుకొని నూతన చైతన్యమును బాటలు వేసినాయి.మూడు దశాబ్దాల కృషి ఫలించినది.అదే మన భారత జాతీయ కాంగ్రెస్.రాజకీయాభ్యుదయమునకు వారసత్వం సృష్టించి ముందు తరముల వారికి పాలు పంచగలిగినది.ఆది నుంచీ హస్తం పార్టీలో బలమైన నాయకత్వం లేకుండా నెహ్రూ కుటుంబం జాగ్రత్త పడటం వల్ల బయటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించలేదు.
సోనియా గాంధీ మాత్రం బిన్నంగా గాంధేతర కుటుంబం నుంచి మల్లికార్జున ఖర్గేను  నియమించి ప్రజాధారణను సంపాదించిందంటే అతిశయోక్తి కాదు.  దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ప్రధాన శక్తిగా అవతరిస్తుందనే భావం ఒక డీకే శివకుమార్,అనుముల రేవంత్ రెడ్డి దూకుడు,పకడ్బందీ ప్రణాళికలు చూస్తే అర్థం అవుతుంది. కాంగ్రెస్ భవిష్యత్తు గురించి 2024లో కూడా అధికారంలోకి వస్తుందనే అనుమానం అందరిలో దాపురించింది.అయితే కాంగ్రెస్ పార్టీ కష్టాలకు అంతే లేనట్లుంది.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో చవిచూసిన చేదుఫలితాలు ఒకింత ఖంగారు పెడుతున్నాయి.అధికారంలో ఉండి కూడా రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఓటమికి గురికావడం మధ్యప్రదేశ్,మిజోరాం చేజార్చుకునే సరికి  2019 ఫలితాలు పునరావృతం అవుతాయా? మళ్ళి మతశక్తులకు అప్పనంగా చేతులో పెడుతారా? 140 కోట్ల ప్రజల అంచనాలు తప్పుకాకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రానెలకొంది. దానికి బలమైన కారణం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడమే.గాంధీ నెహ్రూ వంశీయులు పార్టీ పునరుద్దరణకు ఆరాటపడుతున్నట్లుగా సంకేతాలిస్తున్నారు.అయితే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాంగ్రెస్ కు కొత్త కాదు.ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి బలోపితానికి తగ్గి నడుస్తున్నారు. ఎస్సి,ఎస్టీ,ఓబీసీల సంక్షేమానికి ఏదో ఒకటి చేయాలనీ గ్యారెంటీ పేరుతో తాపత్రయం పడుతుంటే పార్టీకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకునేందుకు కర్ణాటక,తెలంగాణ ఫలితాలు ఊతమిస్తున్నాయి.పార్టీని గాడిలో పెట్టేందుకు,విపక్షాల విమర్శలను తట్టుకునేందుకు గాంధేతర కుటుంబం నుంచి జాతీయ అధ్యక్షునిగా ఎంపిక కొంత ఊరట కల్గించిందనేది జగద్విదితం.
కాంగ్రెస్ చింతన్ శిబిరాల్లో ఆర్భాటం జాస్తి,ఆచరణ నాస్తి అన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న విమర్శకు తగ్గట్టుగా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు అద్ధం పడుతున్నాయి.పట్టుమని నాలుగు నెలలు కూడా లేని పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తూ ప్రణాళిక అంటూ ఏదీ రూపుదిద్దుకోవడం లేదు. నెరవేర్చాలన్న నిబద్దత జాతీయ నాయకత్వంలో కనబడదు.ఏ నిర్ణయాలైన సోనియా కుటుంబం కనుసన్నల్లోనే జరిగిపోతుందనే ప్రచారం ఉండేది.అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక తర్వాత కొత్త నాయకత్వం అవతరించే సరికి కొత్త ఆశలు చిగురించాయి.అయితే నూతన ఆరంభం దృఢ సంకల్పం,కొత్త మార్పు అంటూ ఊకదంపుడు ప్రసంగాలు రివాజుగా సాగిపోతున్నాయి.భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లలో చీలికను నివారించడానికి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకోవద్దనే అభిప్రాయంతో దారులు వెతుకుంటున్నారు. అధికారికంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అయినా అనధికారంగా రాహుల్ సలహాలు,సూచనలు తూ.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించాలంటే దశాబ్ద కాలంగా జరిగిన తప్పులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.డీకే శివకుమార్,రేవంత్ రెడ్డి లాంటి వ్యూహకర్తలు అన్ని రాష్ట్రాల్లో ఉంటే అధికారం ఆమెడ దూరమే.సీనియార్టీ పేరుతో కాకుండా సిన్సియర్ గా పనిచేసే కొత్త తరాన్ని ప్రోత్సహించడం వల్ల, ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా? అనేది పాయింట్ ‘పోకిరి’ సినిమా పంచ్ డైలాగ్ లాగా రేవంత్ ఆసక్తికర డైలాగ్ లు కాంగ్రెస్ ను అందలం ఎక్కించాయనేది నిర్వివాదాంశం.
భారత కాంగ్రెస్ నేతలు దాన్ని స్వాతంత్ర్యోద్యమ వ్యాప్తికి వేదికగా మార్చుకున్నారు.ఫలితంగా కాంగ్రెస్ దేశాన్ని ఆరు దశాబ్దాల పాటు ఏలగల్గింది. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థ,నాయకత్వంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. చీలికలు,చేరికలు బోలెడు.. అయితే 2014 నాటి ఎన్నికలు దేశ రాజకీయాల్లో ప్రస్ఫుటమైన సైద్ధాంతిక మార్పునకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అనూహ్యమైన పరిణామాలతో ఖంగుతిన్నది.మళ్ళీ పుంజుకుంటుందని అందరు ఊహించారు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటుకు గురవడంతో పార్టీలోనే ఆందోళన మొదలైంది. ఆత్మ పరిశీలన, చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం కొంతవరకూ ఫలితాలిచ్చినా.. అవన్నీ తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చ కల్గినాయి. ఒక్కొక్కటిగా రాష్టాలు హస్తం చేజారిపోగా ఇదే స్వార్థంతో జాతీయ స్థాయిలో జీ-23 అగ్రనేతలు అసమ్మతి కుంపటి దిగజార్చాయి. రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. 136 రోజులపాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సైతం కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ జోడో యాత్ర సాగిన మొత్తం 51నియోజకవర్గాల్లో 36 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది.నేడు అదే ఉత్తేజంతో, రాహుల్ స్పూర్తితో తెలంగాణలో ఏకంగా అధికారం చేజిక్కించుకుని దేశానికి కొత్త సంకేతాన్ని ఇచ్చింది. తెలంగాణలో వృద్ధతరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ చూపించినంత ధైర్యం తెగువ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

-డాక్టర్ సంగని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page