ఆలస్యంగానైనా బిజెపి రైతన్నలకోసం పోరుబాట పట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరున మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవ్వాల్టితో మూడవ రోజు కార్యక్రమం ముగియనుంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హరిగోస పడుతున్న విషయం తెలిసిందే. కోసి, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుపోసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒకవైపు వర్షాలు ఎప్పుడు ముంచుకువస్తాయో తెలియనిపరిస్థితి. మరికొన్నిచోట్ల అకాల వర్షానికి నీటిపాలైన పంట. ఇంకోపక్క తూకం ఇబ్బందులు. మొత్తంమీద ఈ వేసంగిలో రైతంగం గతంలో ఎన్నడూలేనంతగా ఇబ్బందులు ఎదుర్కున్నారు అనేకన్నా ఇంకా ఎదుర్కుంటునే ఉన్నారనడం సముచితం.
సర్కారేమో ఈసారి పండించిన పంటలో ఇప్పటికే 80 శాతం కొనుగోలుచేశామంటుంటే, విపక్షాలు మాత్రం 30 శాతంకూడా కొనుగోలు జరుగలేదని వాదిస్తున్నాయి. వీరి వాదనలు ఎలాఉన్నా ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంకుప్పలు ప్రత్యక్షసాక్షాలుగా దర్శనమిస్తున్నాయి. అయితే ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యానికి రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్, కేంద్రంలోని బిజెపిలు మీరంటే మీరే కారణమంటూ ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నాలుచేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యానికి కేంద్రం సహకరించడంలేదని రాష్ట్రప్రభుత్వం విమర్శిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ చాతగాని తనం వల్లే తీవ్ర ఆలస్యం జరుగుతున్నదని బిజెపి వర్గాలు వాదిస్తున్నాయి. వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. ఒక్క గింజ కొనుగోలు చేయలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
పండించిన పంటలో కనీసం 30శాతమైన కేంద్రం తీసుకోవడంలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మొక్కజొన్న సాగు విస్తీర్ణంపెరిగింది. కాని, కేంద్రం మాత్రం ఈ పంటకొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. నష్టానికైనా తాము కొనుగోలుచేస్తున్నా బిజెపి విమర్షించడాన్ని రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎంఎల్యేలు కూడా ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నప్పటికీ మరో వారం పదిరోజుల్లో కొనుగోళ్ళను నిలిపివేస్తామని వ్యవసాయమంత్రి ప్రకటనతో రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకాలంగా కొనుగోలు చేయడంలో జాప్యంచేసి ఇప్పుడు కొనుగోలును త్వరలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజవరకు కొంటామని చెబుతున్న ప్రభుత్వం మాట తప్పటమేంటని వారు నిలదీస్తున్నారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన సిపిఎం బృందం కూడా ఇంకా సుమారు 40 లక్షల టన్నుల ధాన్యం రోడ్లమీదఉందన్న విషయాన్ని సిఎంకు గుర్తుచేయడం గమనార్హం. ఇదిలాఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల పై ప్రధాన ప్రతిపక్షమైన బిఆరఎస్ ముందస్తుగా స్పందించింది. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వాన్ని ఊపిరి మెసలకుండా చేస్తున్నది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రాల్లో, ముఖ్య గ్రామాల్లో రైతాంగంతో కలిసి ఆందోళన కార్యక్రమాలను బిఆరఎస్ నిర్వహిస్తూ వొస్తున్నది. దాంతో బిజెపికి చురుకుపుట్టింది. ఆలస్యంగానైనా ప్రత్యక్ష కార్యాచరకు శ్రీకారం చుట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరుతో మూడు రోజుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారానికి కార్యక్రమం పూర్తికానుండగా ఆపార్టీ ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ ముఖ్యనేతలు వివిధ జిల్లాల పరిధిలోని మండలకేంద్రాలు, కొన్ని గ్రామాలను సందర్శించి, అక్కడి రైతులతో ముఖాముఖి చర్చించి వారి బాధలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నంచేశారు. బెంగాల్ తర్వాత బిజెపి తెలంగాణను లక్ష్యంగా నిశ్చయించుకుంది. అందుకే ప్రజా సమస్యలపై స్పందించాల్సిందిగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సూచనలమేరకు రాష్ట్ర నాయకులు రైతాంగ బాట పట్టారు. తెలంగాణలో కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న బిజెపి త్వరలో అనేక మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు వినికిడి. త్వరలో కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు జరుగబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ మార్పుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి వర్గంలో ఇప్పటికే రాష్ట్రంనుంచి ఇద్దరికి స్థానం కల్పించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ సీనియర్ నాయకులే. అయితే సీనియర్ నాయకులకు గవర్నర్‌లాంటి పదవులు కట్టబెట్టి, రెండవ జనరేషన్‌కు మంత్రులుగా, కేంద్రపార్టీ పదవులను ఇవ్వడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయవొచ్చని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న వీరిద్దరిని లేదా ఒకరికి స్థానబ్రంశం ఉండనుందనుకుంటున్నారు. ఆ స్థానంలో ఇతర పార్టీలనుంచి వొచ్చిన డికె అరుణ, ఈటల రాజేందర్‌లాంటివారితో భర్తీచేసే అవకాశాలుకూడా లేకపోలేదనుకుంటున్నారు. అలాగే గ్రామస్థాయినుంచి పార్టీని పటిష్టంచేసేందుకు, గ్రామ సమస్యలను తీసుకుని ప్రజల్లో మమేకం కావాలని కేంద్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తున్నది.





అసమర్ధుని దుర్మద విజృంభణ!