- సిఎంను పట్టుకుని లిల్లీ పుట్ అంటారా..
- ఏడాదిలోనే కూలుతుందని వ్యాఖ్యానిస్తారా?
- కెసిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటి రెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని..వొస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిసవాల్ విసిరారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. తమను టచ్ చేస్తే బిఆర్ఎస్ను భూస్తాపితం చేస్తామని హెచ్చరించారు. నల్గొండలో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు.
తమను టచ్ చేస్తే బీఆర్ఎస్ను పునాదులతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీపేజీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. 12-13 సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, వాళ్లిద్దరూ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని, చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించి స్వాగతం పలుకుతామని మంత్రి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వొస్తామంటున్నా తాము వొద్దంటున్నామన్నారు. కాంగ్రెస్ అనుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని లిల్లీ పుట్ అంటారా….ప్రజల నుంచి వొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి… దొంగ పాస్ పోర్ట్‌లు చేయలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. విటమిన్ డీ తీసుకుని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేశానని చెప్పుకుంటారా అంటూ మండిపడ్డారు. కవిత జైలుకు పోయినా బుద్ది మారలేదా అని ప్రశ్నించారు.
అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి తాను వెళ్ళాక రైతుల ధాన్యం రూ.2500 కొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే రెండుసార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని…బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. కవిత జైలుకు పోయాక కేసీఆర్‌కు మెంటల్‌గా ఉందని..అందుకే రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నారని మండిపడ్డారు. రెండేళ్లయినా కవితకు బెయిల్ రాదన్నారు. కేసీఆర్ కట్టె పట్టుకుని వేటాడుతాం అంటున్నారని…. రేపటి నుంచి తామూ వెంటాడుతామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.