కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందా ? 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రానుందా ? ఇంతకాలంగా ఉన్న ఆపార్టీలోని అంతర్ఘత కలహాలకు, పరస్పర విమర్శలకు ఇక తెరపడనుందా? కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లకు మళ్ళీ ప్రాధాన్యత లభించనుందా ? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానవర్గం, నాయకులు, కార్యకర్తల తప్పిదాల వల్ల పార్టీ ఇటీవల భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఇంకా ఆలస్యం చేస్తే నూటా ముప్పై ఏండ్ల ఆ పార్టీ చరిత్రకే చరమగీతం పాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయన్న విషయాన్ని ఆలస్యంగానైనా అగ్రనేతలు గ్రహించినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు దశాబ్దాలుగా అండదండలు అందిస్తున్న తెలంగాణ ప్రాంతంపైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని సారించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణను హస్తగతం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ ఒక పక్క ప్రణాళికలను రూపొందించుకుంటుండగా, మరో పక్క పంజాబ్‌లో బిజెపిని ఎదిరించి నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణపైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే.
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పటికే తెలంగాణ అంతా చుట్టుముట్టింది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో, పాదయాత్రలు నిర్వహిస్తూ అధికార తెరాసను తూర్పారపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే అధికారంలో, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటూ వొస్తున్న కాంగ్రెస్ స్థానం కాలక్రమేణ దిగజారిపోతున్న విషయం తెలియందికాదు. ఈ పరిస్థితిలో కేంద్ర నాయకత్వం మేల్కొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి రాష్ట్ర నాయకులు తీసుకురాగలిగారు. దాని పరిణామమే దిల్లీలో ఈ నెల 4న జరుగనున్న పార్టీ నేతల సమావేశం. ఈ సమావేశంలో సీనియర్లతోపాటు పార్టీకి చాలా కాలంగా దూరం ఉంటున్నవారు, అసంతృప్తిగా ఉన్నవారు, విభేదాలున్నవారందరిని ఆహ్వానించాలని రాహుల్‌గాంధీ చెప్పినట్లు తెలుస్తున్నది.
ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన డబ్బును కేంద్ర పార్టీకి అందించే క్రమంలో బాగంగా రాష్ట్ర నేతలు రాహుల్‌ను కలిసే అవకాశం లభించింది. ఇతర రాష్ట్రాల కన్నా భారీగా నలభై లక్షల సభ్యత్వంతో వొచ్చిన సుమారు ఆరున్నర కోట్ల రూపాయలను ఆయనకు అందించడం ద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. అయితే రాహుల్‌ను కలిసే విషయంలో రాష్ట్రం నుండి కొందరు మాత్రమే దిల్లీ వెళ్ళారు. దిల్లీ వెళ్తున్న విషయంలో కొందరికి సమాచారమేలేదన్న విషయం కూడా అక్కడ చర్చ003కు వొచ్చింది. అదే క్రమంలో సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి రాష్ట్ర పరిణామాలన్నిటినీ రాహుల్ దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతుడైనట్లు తెలుస్తున్నది. ఆయన రాహుల్ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై రాహుల్ స్పందించి వెంటనే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకున్నవారు, పార్టీ పరంగా అనేక పదవులు అలంకరించి, ఇప్పుడు పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న తరుణంలో అంటీముట్టనట్లు ఉంటున్నవారితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని ఇతర రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దానినుండి ఇప్పుడు కాంగ్రెస్ బయటపడాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామంలో ఇంకా కాంగ్రెస్ అభిమానులున్నారు.
వారిని తిరిగి అకట్టుకోగల పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి అవసరం. ఇప్పటికే రాంష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కొందరు పట్టుపడుతున్న పరిస్థితిలో జరిగే ఈ భేటీతో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయోనంటున్నారు. లేదా సీనియర్లకు పార్టీ పరంగా నూతన బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని తిరిగి పార్టీ కార్యక్రమాలవైపు మళ్ళించే ప్రయత్నం చేస్తారా? అన్నది సమావేశానంతరం తేలనుంది. ఇదిలాఉంటే రాష్ట్రంలో అభిప్రాయ భేదాలున్నప్పటికీ ఇతర పార్టీలతో ఏమాత్రం వెనుకబడకుండా పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధికార పార్టీతోపాటు, కేంద్ర ప్రభుత్వ విధానలపై సుధీర్ఘపోరాటానికి కార్యక్రమాలను రూపొందించారు. తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్‌గా ఉన్న వరి ధాన్యం సేకరణపై దాదాపు నెలరోజుల పాటు ఉద్యమించేందుకు పార్టీ సిద్ధమయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై పోరాటం సాగించేందుకు నిర్ణయించింది. ఇదే క్రమంలో వరంగల్‌లో రైతు బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ ఐక్యతను మరోసారి చాటాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతల్లో ఐక్యతను తీసుకురాని పక్షంలో రానున్న ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వొచ్చే అవకాశాలు శూన్యం.