ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల మొత్తం ఎంత? జరిగిన ఈ ఖర్చుల బాధ్యత దేశ ఖజానా నుంచి వస్తుందా లేక ఆ పార్టీ పెట్టుకుంటుందా? దేశ ఖజానా నుంచే తప్పనిసరిగా ప్రధానమంత్రి ఖర్చులు భరించాలి అంటే, ఆయన తన రాజకీయ పార్టీ స్వప్రయోజనాల కోసం ఇలా ఖర్చు పెట్టించవచ్చా? ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఈ అంశం రాదా? ఈ ప్రశ్న కేవలం ప్రధాని సభ్యుడుగా ఉన్న బిజెపికి మాత్రమే పరిమితం కాదు. అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీకి వర్తించే అంశం. ఎవరన్న ఇలాంటి చిన్నచిన్న అనుమానాలను నివృత్తి చేస్తే బాగుండు.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ ఊపేస్తోంది. ఇంకొక్క రోజులో ఎవరి భవితవ్యం ఏమిటి అనేది ఈవీఎంలలో నిక్షిప్తం అవుతుంది. ఫలితం కోసం మూడవ తేదీ వరకు ఎదురు చూడాలి. ఎన్నికలు రెండు రోజులుందనగా రెండు ఆసక్తికరమైన అంశాలు నా దృష్టికి వచ్చాయి. రాజు వెడలె… టటాట్టం అన్నట్టుగా సాక్షాత్తూ దేశప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ నగర వీధుల్లో సావకాశంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా రెండున్నర గంటలపాటు భారీ కాన్వాయ్ తో రోడ్డుషో చేశారని ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. ఆ రెండున్నర గంటల కోసం ఒకరోజు ముందునుంచే ఆయన తిరగబోయే ప్రాంతాల్లో విపరీతమైన పోలీస్ ఫోర్స్ కాపుగాసి ఆ రోడ్లమీద వాహనాల్లో వెళుతున్న సామాన్య ప్రజల్ని నానా రకాల ప్రశ్నలతో విసిగించారు. నేను కూడా వాటి బారిన పడ్డాను కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. సరే, దాని సంగతి వదిలేద్దాం. ప్రధానమంత్రి భద్రతకు ఆ మాత్రం మన సమయాన్ని త్యాగం చేయలేమా ఏమిటి? పోలీసులు వాళ్ల పనివాళ్లు చేసుకున్నారు అని అనుకోవచ్చు మనం. ప్రజల వాహనాల్ని ఆ రెండున్నర గంటలే కాదు ఇంకా చాలాసేపు ఆ రోడ్ల మీద తిరగనివ్వలేదు. అంతేకానీ ఆ భారీ కాన్వాయ్ లో వాహనాలు ఎక్కువయ్యాయని ఎక్కడా ఆపలేదు.
సజావుగా పూలజల్లులు కురిపించుకుంటూ ప్రధానమంత్రిగారు షో చేసుకుంటూ వెళ్లారు. ఆయన షోకోసం మెట్రోరైళ్లను కూడా ఆపేశారట! ఇక్కడ నాదొక చిన్న అనుమానం! ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల మొత్తం ఎంత? జరిగిన ఈ ఖర్చుల బాధ్యత దేశ ఖజానా నుంచి వస్తుందా లేక ఆ పార్టీ పెట్టుకుంటుందా? దేశ ఖజానా నుంచే తప్పనిసరిగా ప్రధానమంత్రి ఖర్చులు భరించాలి అంటే, ఆయన తన రాజకీయ పార్టీ స్వప్రయోజనాల కోసం ఇలా ఖర్చు పెట్టించవచ్చా? ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఈ అంశం రాదా? ఈ ప్రశ్న కేవలం ప్రధాని సభ్యుడుగా ఉన్న బిజెపికి మాత్రమే పరిమితం కాదు. అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీకి వర్తించే అంశం. ఎవరన్న ఇలాంటి చిన్నచిన్న అనుమానాలను నివృత్తి చేస్తే బాగుండు. వోటర్లు డబ్బులకు అమ్ముడుపోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెగ ఆయాసపడిపోయే వాళ్లు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు.
పూర్తిగా చదవకుండానే వాళ్ల పార్టీ మీద అక్కసుతో ఈ ప్రశ్న వేస్తున్నామని వెంటనే ‘అమ్మనా బూతులతో’ ట్రోలింగ్ కి దిగుతారని కూడా తెలుసు. మణిపూర్లో మహిళలని నగ్నంగా ఊరేగించిన సంఘటనని ఈ దేశ పౌరులుగా, మహిళలుగా మనమెవరం మర్చిపోలేం. అక్కడ జరుగుతున్న జాతి విద్వేషాన్ని ఆపటానికి దేశ ప్రధానిగారికి ఇప్పటివరకూ సమయం చిక్కలేదు. ఆ మారణహోమాన్ని ఆపగలిగిన అధికారం ఆయన చేతిలో వుంది. అయితే, అది ఆయనకు ముఖ్య విషయం కాలేదు. కానీ, వివిధ రాష్ట్రాలలో తమ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి రోజుల తరబడి, గంటల తరబడి సమయాన్ని వెచ్చించగలరు! ప్రజాధనంతో రోడ్డు షోలను నిర్వహించగలరు! ‘‘క్షణం క్షణం.. కణం కణం మా జీవితం భారతమాతకు అంకితం.. జై భారతమాత..’’ అనేవాళ్లు కళ్ళు, చెవులూ, మూతి మూసుకునే ఉన్నారు. రెండో విషయం, ఎవరిని ఎవరితో పోలుస్తున్నారు అని ఉక్రోషపడొచ్చు- కోపం తెచ్చుకోవచ్చు కానీ, కోట్లాది రూపాయల ఖర్చుతో దేశప్రధాని చేసిన భారీ షో కన్నా ఒక చిన్న అమ్మాయి ఉద్యోగాలు, చదువులూ కావాలి అంటూ వేస్తున్న ‘ఈల’ చప్పుడు ఆసక్తికరం ఉంది. మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది విషయం. అవును, నేను కర్నే శిరీష అలియాస్ బర్రెలక్క గురించే చెబుతున్నాను.
దేశప్రధాని హైదరాబాద్ నగర వీధుల్లో వూరేగుతున్న సమయంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి ఆమెకు స్వచ్ఛందంగా మద్ధతు ప్రకటిస్తూ అనేకమంది తమ స్వంత ఖర్చులతో ఆమె ఊరేగింపు కి జత అయ్యారు. అనుమతించిన దానికన్నా ఐదారు వాహనాలు ఎక్కువున్నాయని కొన్నిటిని ఆపేశారట పోలీసులు! మరి హైదరాబాద్ లో ప్రధానిగారి కాన్వాయ్ కి ఈ నిబంధన వర్తించినట్టు లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బియ్యారెస్ వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తున్నట్టు లేదు. వారి వాహనాలు నిరభ్యంతరంగా అధికార కార్యాలయాలలోకి దూసుకుపోతాయి. అదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్లో, స్వతంత్ర అభ్యర్థులో అయితే నిబంధనలు అత్యంత కఠినతరం అవుతాయి. ఎందుకీ ద్వంద్వ వైఖరి? ఎన్నికల నిబంధనలు అందరికీ ఒక్కలాగే ఉండాలి కదా? మాట మాట్లాడితే తమ విమర్శలలో ‘ప్రజాస్వామ్యం అపహాస్యమయిపోతోంది’ అని తూర్పారపట్టేవాళ్లే ప్రజాస్వామ్య విధానాలకు తాము అతీతులం అనుకోవటం అడుగడుగునా కనిపిస్తోంది. దేశ ప్రధానిగారు ఒక పక్క మా పార్టీని గెలిపిస్తేనే తెలంగాణకు అభివృద్ధి అని చెబుతున్న సమయంలోనే, కొల్లాపూర్ నియోజకవర్గంలో వోట్లు వేయమంటూ ఆయన పార్టీ వాళ్లు పంచిన ‘లోటస్ కంపెనీ’ చీరల్ని మహిళలు మాకు చూపించారు. మణిపూర్లో బట్టలు విప్పదీయించి ఊరేగిస్తారు, ఇక్కడ అధికారంలోకి రావటం కోసం విద్వేష రాజకీయాలతో పాటు చీరల్ని కూడా ఎరగా వేస్తారు!
ఎలానూ కర్నె శిరీష ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఇక్కడ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. 25 సంవత్సరాల వయసులో కులబలం, కుటుంబ బలం, అధికార బలగం ఏమీ లేకుండా, రిసర్వ్డ్ నియోజకవర్గంలో కాకుండా ఒక దళిత యువతి స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగాలనుకోవటమే కరడుగట్టిన రాజకీయాల్లో మార్పు అవసరం అనే భావనకి ఒక పెద్ద సంకేతం. శిరీష లాంటి యువతరం అనేక చోట్ల ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాటిని మొగ్గలోనే తుంచేయకుండా ఆహ్వానించగలిగితేనే మహిళా రాజకీయ సాధికారత మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే మహిళా అభ్యర్థిత్వాలు భర్త/ తండ్రి/అన్న చాటు వ్యక్తులుగా, లేకపోతే భర్త చనిపోతే సానుభూతి అభ్యర్థులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. శిరీషకి సోషల్ మీడియా వల్ల ప్రచారం ఎక్కువ వచ్చి ఉండవచ్చు. అంతమాత్రం చేత ‘ఆమె వోట్లు చీలుస్తోంది, ఎవరికో కోవర్టుగా పనిచేస్తోందనే’ దురుద్దేశాలను అంటగట్టాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ ఆకాంక్షను చిదిమేయటానికి వ్యక్తిత్వ హననమే రాజమార్గం అనుకునే విషభావజాలం అడుగడుగునా వున్నచోట ఆమె బరిగీసి పోటీలో ఉండటమే , ఇదీ నా మానిఫెస్టో అంటూ పది అంశాలను ఎంచుకుని నిలబడటమే అసలు సిసలైన సమాధానం! ఆడపిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాలు గురించీ ఆ అమ్మాయి మాట్లాడుతోంది. సంక్షేమ పథకాల పేరుతో వోట్లకు ఎరవేసే పార్టీలకన్నా అవసరమైన రాజకీయ స్పష్టతను ఆ అమ్మాయి కనపరుస్తోంది. గెలుపు వోటములు పక్కన బెడితే శిరీషలాంటి అట్టడుగు సమూహాల యువతరం తమ భవిష్యత్తును నిర్ణయించుకునే రాజకీయ నిర్ణయాధికారం కోసం నిలబడి కలబడి కొట్లాడవలసిందే. వేలమైళ్ల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అత్యంత కష్టమైన ముళ్లబాట అని తెలిసినా గానీ ఆ వొక్క అడుగు శిరీష వేసేసింది. అదే ఈరోజు అనేకమందికి స్పూర్తిగా మారింది.
కె.సజయ, సామాజికవిశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్