ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై ఏళ్ళలో ఆ రెండు పార్టీల ఆలోచనా ధోరణుల్లో ఏలాంటి మార్పు లేదు. అందుకే దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకు వొచ్చేందుకే బిఆర్‌ఎస్‌ ‌పేర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా చెబుతూ వొచ్చిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు గత రెండు సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలను వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో కూటమి కట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

ఏక్కే గడప, దిగేగడప లేదన్నట్లుగా మహారాష్ట్ర, కర్నాటక, బీహార్‌, ‌బెంగాల్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌తో పాటు అనేక రాష్ట్రాలకు స్వయంగా వెళ్ళారు. రాష్ట్రానికి వొచ్చిన కొందరు, రాష్ట్రానికి ఆహ్వానించబడిన మరికొందరితో చర్చలు జరిపారు. కాని, పై రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో ఎవరూ పెద్దగా స్పందించలేదనడానికి తాజాగా దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులే అద్దం పడుతున్నాయి. కెసిఆర్‌తో చర్చలు జరిపిన వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజెపి లేదా కాంగ్రెస్‌తో కలిసిన కూటమిలో ఉండేందుకే ఇష్టపడుతున్న వాతావరణం కనిపిస్తున్నది. దానికి తగినట్లుగా మొదట్లో దూకుడుగా వ్యవహరించిన కెసిఆర్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కాస్తా దూకుడును తగ్గించినట్లు కనిపిస్తున్నది.

మరో ఏడు ఎనిమిది నెలల్లో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. బిజెపి మళ్ళీ అధికారంలోకి వొచ్చేందుకు భావసారూప్యత ఉన్న పార్టీలన్నిటినీ తమ గూటికి చేర్చుకునే పనిలో ఉంది. అందులో భాగంగా నేడు ఎన్‌డిఏ తన పాత, కొత్త మిత్రులతో దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు ముప్పై రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తున్నది. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపికి చెందిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మాత్రమే ఈ సమావేశానికి బిజెపి ఆహ్వానించింది. వైఎస్‌ఆర్‌సిపి బిజెపికి దగ్గర ఉన్నప్పటికీ ఆ పార్టీని ఆహ్వానించకపోవడంలో బిజెపి రాజకీయ ఎత్తుగడ ఉందనుకుంటున్నారు. అలాగే టిడిపిని కూడా ఆహ్వానించలేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలో బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌మధ్య ఉప్పులో నిప్పులా ఉంది. మొదటి నుండి బిజెపి, కాంగ్రెస్‌ ‌మినహా ఇతర పార్టీలన్నిటినీ ఏకం చేసే ప్రయత్నంలో బిజెపిపై పెద్దఎత్తున మాటల దాడి చేస్తున్న బిఆర్‌ఎస్‌ను ఎలాగూ ఈ భేటీకి ఆహ్వానించరన్నది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉంటే బెంగళూరులో భావసారుప్యం గల పార్టీలతో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు కూడా బిఆర్‌ఎస్‌కు ఆహ్వానం అందలేదు. ఒకవేళ ఆహ్వానం అందినప్పటికీ కాంగ్రేసేతర కూటమి కట్టాలనుకుంటున్న క్రమంలో బిఆర్‌ఎస్‌ ‌పాల్గొనే అవకాశం లేదు. ఇదిలా ఉంటే మరో నాలుగు నెలల్లో తెలంగాణలో రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో బిజెపి, కాంగ్రెస్‌ ‌తీవ్ర స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్ర నాయకత్వం కూడా బిఆర్‌ఎస్‌తో దూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉంది.

ఇటీవల రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు సమావేశానికి కెసిఆర్‌ను ఆహ్వానించే అవకాశం లేదు. బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌చొరవతో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవిద్‌ ‌కేజ్రీవాల్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవత్‌సింగ్‌ ‌మాన్‌, ‌తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటుగా మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ ‌యాదవ్‌(ఎస్పీ), ఫరూక్‌ అబ్దుల్లా (ఎన్సీ), మహబూబాముఫ్తీ( పిడిపి), బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌(ఆర్జేడి), ఉద్దవ్‌ ‌థాక్రే(శివసేన), కమ్యూనిస్టు నాయకులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో చాలామంది థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో కెసిఆర్‌తో సంప్రదింపులు జరిపిన వారే కావడం విశేషం. ఎన్డీఏ లాగానే ఇక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌(‌బిజెడి), కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి(జెడిఎస్‌)‌లకు ఆహ్వానాలు అందనట్లు తెలుస్తున్నది.

మొత్తం మీద రెండు రోజుల పాటు జరిగే బెంగళూరు సమావేశంలో దాదాపు 80 మంది రాజకీయ నాయకులు పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది. సోమవారం నాటి సమావేశం సాదాసీదాగా జరిగినప్పటికీ మంగళవారం నాటి సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. ఈ సమావేశం కొత్త కూటమి ఏర్పాటు దిశగా జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్న బిజెపిని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్య పోరాటం చేయాలన్న దిశగా ఈ సమావేశం చర్చలు జరిపే అవకాశముంది. బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇలాంటి ఐక్య పోరాటం చేయాలనుకున్న కెసిఆర్‌ ‌ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ రెండు జాతీయ పార్టీలను కలుపుకుని జరుగుతున్న కూటమి సమావేశాలకు కనీసం బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆహ్వానం లేకపోవడంతో ఇక ఆ పార్టీకి ఒంటరి పోరాటం తప్పేట్లు లేదన్నది స్పష్టమవుతున్నది. అందుకే కనీసం ఎక్కువ పార్లమెంటు స్థానాలను సాధించుకోవడం ద్వారా నైనా జాతీయ రాజకీయాల్లో తన మార్క్‌ను చూపించుకునేందుకు బిఆర్‌ఎస్‌ ‌ప్రయాసపడుతుంది. అందుకే మహారాష్ట్ర, కర్నాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బహిరంగ సభలను నిర్వహిస్తుండగా, ఆయా రాష్ట్రాల నుండి నిత్యం పలువురి చేరికలతో ప్రగతి భవన్‌ ‌హడావిడిగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page