రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండీ బిజెపి తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంది. వ్యతిరేకత అన్నది తెలంగాణ ప్రజలపైనా లేక తెలంగాణ ప్రభుత్వాల పైనా అన్నది బిజెపినే స్పష్టంచేయాలి. తెలంగాణలో ఇప్పటివరకు రెండు పార్టీలు మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానభూమిక నిర్వహించిన బి(టి)ఆర్‌ఎస్ అధికారంలో ఉన్న దశాబ్ధకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడముఖం పెడ ముఖంగా ఉండింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో కేంద్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం సఖ్యత గా ఉండే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షాలు విమర్శించినా కేందప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు బిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది . అయినా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగుపడలేదు. కాలక్రమేణ విబేధాలు పెరుగుతూ వొచ్చాయి. విభజన హామీల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా, లేఖలెన్ని రాసినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది . పైగా సందర్బం దొరికినప్పుడల్లా తెలంగాణను విమర్శించడమే పనిగా పెట్టుకుంది బిజెపి ప్రభుత్వం.
తెలంగాణను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తున్నది..?

సాక్షాత్తు ప్రధాని అంతటివాడు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భాల్లోనూ విభజనపై విషం చిమ్ముతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమన్నది తెలంగాణ ఏర్పడిన కొద్దికాలంనుండే ప్రారంభమైంది. తెలంగాణను అంతగా ద్వేషించడానికి కారణం స్థానిక ప్రజలకు అంతుబట్టకుండా ఉంది. నిధుల కేటాయింపులో, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ కేంద్రం కావాలని ఆలస్యం చేస్తూ వొస్తున్న విషయాన్ని నాటి బిఆర్‌ఎస్‌తోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తూనే ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే కర్ణాటకలోని గుల్బార్గాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్బంగా అన్నమాటలు నేటికీ తెలంగాణ ప్రజల చెవుల్లో గింగురుమంటున్నాయి. అక్కడ తెలంగాణ అంశాన్ని లేవనెత్తి ‘తల్లిని చంపి బతికిచ్చినట్లు’ ఆంధప్రదేశ్‌ను విభజించారనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి ఎవరో పిల్ల ఎవరన్నది అర్థంకాదు. ఆంధ్ర ప్రాంతం తెలంగాణలో కలిసిందేగాని, తెలంగాణ ఆంధ్రలో కలువలేదన్న విషయం ప్రధాని మోదీకి తెలువదని అనుకోలేము. అలాంటప్పుడు ఆంధ్ర ప్రాంతం తల్లి ఎలా అవుతుందో అర్థం కాదు. అయినా ఆంధ్రలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజల మెప్పుకోసం ‘తల్లినుంచి బిడ్డను వేరుచేశా’రన్న మాటలతో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వేర్పాటును ఆయన దెప్పిపొడిచారు. ఆంధ్ర ప్రాంత పాలకులు అన్యాయం చేయడంవల్లే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందన్న విషయాన్ని మోదీ తెలియకుండా ఉన్నారా ..
ఆలాంటప్పుడు ఆయన మాటలకు అర్థమేంటో ఆయనే చెప్పాలె. మరో సందర్భంలో పార్లమెంటు తలుపులుమూసి రాష్ట్ర విభజన చేశారని, ఆంధప్రదేశ్‌ను అవమానకర రీతిలో వేరు చేశారంటూ ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రీతిలో తెలంగాణ పైన ప్రధానిలాంటివాడే విషం చిమ్మడమన్నది తెలంగాణ పట్ల వారికున్న ద్వేషభావం ప్రస్పుటిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంలో బిజెపి భాగస్వామ్యాన్ని ఎవరూ కాదనలేని విషయం. అలాంటి బిజెపి తెలంగాణ ఆత్మగౌరవం పై ఎందుకు విషం చిమ్ముతున్నదన్నది అర్థం కాకుండా ఉంది. చివరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమితిషా కూడా రాష్ట్ర విభజన జరిగిన రోజును చీకటి రోజుగా అభివర్ణించాడంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నిజంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం ఏమాత్రం ఇష్టంలేదన్న స్పష్టమవుతున్నది.
తెలంగాణ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా బిజెపికి తెలంగాణ పట్ల న్యూనతాభావం పోవడంలేదనడానికి తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మరోసారి బహిర్ఘతమైంది. బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను దేశ విభజనతో పోల్చడం చూస్తే ఈ ప్రాంతం పైన ఆ పార్టీకి ఎంతటి చిన్నచూపు ఉందన్నది స్పష్టమవుతున్నది. విచిత్రమేమంటే అదే సభలో తెలంగాణ ప్రాంతంనుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బిజెపి ఎంపీలు పదహారు మంది ఉన్నప్పటికీ వెంటనే వ్యతిరేకించకపోవడం బాధాకర విషయం.
స్వాతంత్య్రానంతరం దేశంలో అనేక రాష్ట్రాల ఆవిర్భావం జరిగింది. అయినా పనిగట్టుకుని ఒక్క తెలంగాణ విషయం వొచ్చేసరికి బిజెపి ఎందుకు ఇలా మట్లాడుతున్నదన్నది అంతుపట్టకుండా ఉంది. వాస్తవానికి వివిధ రూపాల్లో కేంద్రానికి చేరుతున్న ఆదాయంలో తెలంగాణ పాలు ఎక్కువే. అయినా నిధులు, ప్రాజెక్టుల మంజూరిలో తెలంగాణ కేంద్ర జాబితాలో చివరలోనే ఉంటున్నది . ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజనను బ్రిటీషువారు భారత్, పాకిస్తాన్‌ను విభజనకంటే దారుణమనడం వెనుక ఏదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా లేక విడిపోయిన ఆంధప్రదేశ్‌లో అధికారపార్టీతో ఉన్న పొత్తు ఆ విధంగా అనిపిస్తున్నదా? రానున్న ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టి తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మార్గం సులభం చేసుకునేందుకు ఇదొక ఎత్తుగడే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




