- కృష్ణా జిల్లా ఫస్ట్..కడప లాస్ట్
- 25 నుంచి జులై 5 వరకు
- రీ కౌంటింగ్‌కు దరఖాస్తు
- ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
- అవసరమైతే డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడి
విజయవాడ, జూన్ 22 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మళ్లీ బాలికలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందజంలో ఉండగా ఉమ్మడి కడప చివరిస్థానంలో ఉంది. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసారు. అనంతరం డియాతో ఫలితాల గురించి మాట్లాడారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్ లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంక నాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. ఉమ్మడి కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 49, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలురు 59, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఇదిలావుంటే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. 884 హై స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.