ఉగాది పచ్చడి

చూతక ఫలం పలకరింపుతో
పాతకములన్నీ పోయేనుగాక!
నింబపు విరుల పుప్పొడితో
గరళపుఅమ్మల స్వాంతనకాగ!
ఇక్షువు గడల మధురముతో
కుక్షము గోడలు శాంతములాడ!
అమలక రుచుల చక్కిలింతతో
జిహ్వపు చూరులు కితకితలాడ!
మిరప ఘాటు రేగినవేళల్లో
నవనాడుల్లో నీటి ఊటలురేగ!
గుడచూర్ణము అనుపానముతో
అమృతపానము కంఠమునేగ!
సప్తరుచుల సమ్మేళనమే
జీవితమంటూ!
నవగ్రహముల గమనములే
దిశా నిర్దేశంచేస్తూ!
కాలంమార్పు సహజమంటూ
కష్టం ఎల్లకాలం ఉండదంటూ!
కొత్త ఆశలు చిగురిస్తుంటే
క్రొంగొత్త ఊహలు ఊరిస్తుంటే!
స్వప్నాలన్నీ జీవం కూడి
సాకారం అయ్యే సమయం చేరి!
స్వరగతులన్నీ భావం పలికి
జీవన వీణలు రాగం కూర్చి!
యుగాది శుభకృతమై విచ్చేసింది!
శుభాశీస్సులు తెచ్చేసింది!
     – ఉషారం, 9553875577
    (ఉగాది శుభాకాంక్షలతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page