తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కెసిఆర్ పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్ ఒక రాజకీయ పార్టీగా అవలంభిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం 60 ఏండ్ల ఆకాంక్ష. ప్రజాస్వామిక పార్లమెం•రీ తరహా పద్దతుల్లో సకల జనులు సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏఏ అంశాలలో పురోగతి సాధిస్తోంది ఇంకా అందుకోవాల్సిన ఫలితాలు, ఆచరించాల్సిన మార్గాలు ఏమిటో ఒక్కసారి గమనించుకోవాలి. తెలంగాణా రాష్ట్రం వస్తే ఏం వచ్చింది? అని అడిగితే ఆత్మ స్థైర్యం వచ్చిందని, ఆత్మ గౌరవం పెరిగిందని ఒక జాతిగా స్వయం పాలిత రాష్ట్రంగా ‘మాది తెలంగాణా’ అని సగర్వంగా చెప్పుకునే సాధికారికత సిద్దించింది. తెలంగాణాకు చరిత్ర సంస్కృతి నాయకత్వం లేదన్న వారికి చెంపపెట్టుగా తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భాలను ఈ ఎనిమిదేళ్లలో గమనిస్తున్నాము.
మనరాష్ట్రం, మనగీతం, మన పండుగలు, మన భాష యాస, మన పాటలు, పాఠాలు, స్వీయ అస్థిత్వం స్వయం పాలనతో తలెత్తుకొని నిలబడి గెలిచి నిలుస్తోంది తెలంగాణా.‘‘తెలంగాణాకు నిధులు ఇవ్వము… ఏమీ చేసుకుంటారో చేసుకోండి’’ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సమైక్య వాదులకు, తెలంగాణాకు చెందాల్సిన వనరులు ఉద్యోగాలు నిధులు పన్నులు అన్ని ఇతర ప్రాంతాలకు మళ్ళించి తెలంగాణాను వెనకబడెసి తెలంగాణాను తామే అభివృద్ధి చేసామని వేరుపడితే తెలంగాణాకే తీవ్ర నష్టపోతుందని, చెప్పిన తెలంగాణా నిరోధులకు చెంపపెట్టులాగా ‘మానిధులు మాకే’ చెందుతున్న వాస్తవాన్ని హర్షించకుండా ఉండలేము. ఎన్నో బాలరిష్టాలను అధిగమించి, ఎదురవుతున్న సమస్యల చిక్కుముడులు విప్పుకుంటా ముందుకెళ్తూ ఉమ్మడి పాలకులు ప్రచారం చేసిన భయాల్ని, పదే పదే వల్లె వేసిన అబద్దాలన్నీ ప్రత్యేక రాష్ట్రంలో పటాపంచలైపోయాయి. కరెంట్ కష్టాలు లేవు తెలంగాణా యావత్ నిరంతర విద్యుత్ వెలుగు జిలుగులతో విరాజిల్లుతోంది. పాలన చేతకాదన్న వారికి పరిపాలనా వ్యవస్థలన్నీ ప్రశాంతంగానే పని చేసుకుంటున్న వైనాన్ని గమనించమని చెప్తున్నాయి.
చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమేనన్న ఉద్యమ సందర్భపు మాటల్ని నిజం చేస్తూ తెలంగాణా ఒక విఫల ప్రయోగం కాదని ఒక కొత్తరాష్ట్రం పలు విషయాలలో దేశంలోని ఇతర రాష్ట్రలకు స్ఫూర్తిని కలిగించడం సంతోషించదగ్గ విషయం. తన నిర్ణయాలను తానే తీసుకునే తన తప్పుల్ని తానే సరిదిద్దుకుని తన ముద్రను బలంగా వేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన వాణిని విన్నవిస్తున్న నేపథ్యంలో తెలంగాణా నాది అని సగర్వంగా చెప్పకుండా ఉండలేము. అయినా, ఇంకా అందుకోవాల్సిన లక్ష్యాలు నెరవేర్చాల్సిన ఆశలు ఆకాంక్షలు ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందరికి అందాలి. సుదీర్ఘ ప్రణాళికలు స్వల్పకాలిక లక్ష్యాలతో బహుముఖంగా సాగుతున్న పరిపాలనలో సకలజనుల భాగస్వామ్యం ఇంకా పెరగాలి. ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణా ప్రజలకు యువతరానికి విద్యార్థులకు పారిశ్రామిక వేత్తలకు రైతాంగానికి ఉద్యోగ ఉపాధ్యాయ శ్రామిక వర్గాలకు మరింత చేయూతనందించాల్సిన అవసరం కనబడుతోంది.
ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆంధ్ర హవా పెరిగిపోవడం రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారే పరిపాలనలో కీలక స్థానలల్లో కొనసాగడం బాధ కల్గించే విషయం. ప్రతి రంగంలో ఇక్కడి భూమి పుత్రులకే అవకాశాలు దక్కేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. దేశంలోనే ఏ రాష్ట్రం పోటీ పడలేని విధంగా నాలుగు సంవత్సరాలలో 426 పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. సంతోషమే కాని రాష్ట్రం ఏర్పడక ముందు టిఆర్‌ఎస్ ప్లీనరీలలో, బహిరంగ సభలో చేసిన తీర్మానాలు ఉద్యమ సమయంలో వివిధ అంశాలపై మాట్లాడిన మాటలు వ్యక్తమైన అభిప్రాయాలు. 2014, 2018 టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో ఇంకా నెరవేరని, ఇంకా కార్యరూపం దాల్చని విషయాలపై వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చే విధంగా నిబద్దతతో కృషి జరగాల్సి ఉంది. సమర్ద నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు నాయకత్వం మరింతగా సమర్దమవుతుంది. సకల జనుల సంక్షేమం సమగ్రాభివృద్ధి వైపు ఇంకా మరింత సమర్దవంతంగా ముందుకు పయనించాల్సిన అవసరం కనబడుతోంది.
సురేష్ కాలేరు, రాష్ట్ర సహాధ్యక్షులు
తెలంగాణా ఉద్యోగుల సంఘం,9866174474