ఆహార కొరతకు కారకులెవరు..?

అభివృద్ధి అంటే  అద్దంలా మెరిసే రోడ్డు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు కాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమి మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాలీ  కడుపుతోనే నిద్రపోతుండటం కలవం పెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం, ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. పోషకాహార లోపం.. చిక్కిపోయిన పిల్లలు (ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు), పిల్లల మరణాలు (ఐదేళ్లలోపు పిల్ల మరణాల రేటు) వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉపయోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం.. భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యలో మొత్తం 116 దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది.

ఒకవైపు కొరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహార కొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేదదేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట ప్రమాదకరంగా మారింది. నానాటికి ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత గల సమస్యగా పరిణమించింది. మలేరియా, క్షయ, హెచ్‌ఐవి వ్యాధుల కంటే పోషకాహార లోపంతో నీరసించి మృత్యువు పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకరం. చాలా దేశాల్లో కొనుగోలు శక్తిలేని ‘పేదవర్దాల వారు ఆహార ఉత్పత్తులను అందుకోలేక పోతున్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల వల్లనే గత దశాబ్ద కాలంలో ఆకలి సమస్య కారణంగా పేద దేశాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ శరణార్థులుగా మారుతున్నారు. ఈ శరణార్థులు ఆహారానికే కాదు, కనీస మానవ హక్కులకు కూడా దూరమవుతున్నారు. వీరు ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రపంచ జనాభాలో 11 శాతం మంది పోషకాహార లోపంతో సతమతమవుతుండగా, మరోవైపు 40 శాతం మంది మధ్య వయస్కులను అధిక బరువు వేధిస్తుండడం విచిత్రమైన పరిణామం. పేద దేశాల్లో ఆకలి తాండవిస్తుండగా, పెద్దల్లో ఊబకాయం పెరగడం సమాంతర పరిణామం. శరీరం శుష్మించి పోవడం, ఊబకాయం, ఈ రెండూ ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.

ఇవాళ ప్రపంచ జనాభాలో 30 శాతం మందికి తగినంత ఆహారం దొరకడం లేదు. దీనికి కారణం మంచి పోషకాలున్న ఆహారాన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు ‘‘ఖరీదైన’’ వ్యవహారంగా మారింది. అల్పాదాయ వర్గాలు ప్రజలు నాణ్యత లేని, పోషక విలువలులేని ఆహారాన్ని కొనక తప్పడం లేదు. సామాన్యులు తక్కువ ధరకు లభించే ఆహారంతోనే సంతృప్తి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత అన్న నినాదం ఓ ప్రహసనంగా మారింది. 2080 నాటికి క్షుద్చాధను నివారించలన్నది ఐక్యరాజ్య సమితి లక్ష్యం అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అది సాకారమయ్యే పరిస్థితి కానరావడం లేదు. అన్ని దేశాల్లోనూ పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారిలో కొనుగోలు శక్తి పెంచేలా, నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉండడం ఒకవైపు, మరోవైపు పోషకాహార లోపంలో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కెర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేణా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

2021 అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం పోషకాహార లోపంతో, 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరక్కపోవడం గమనించారు. కొరోనా వైరస్‌ విజ్బంభణతో అదనంగా 11.8 కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు. 2021-22 లో 816 మిలియన్‌ టన్నుల రికార్డ్‌ స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. 2020-21లో 311 మిలియన్‌ టన్నులు, 2019-20లో 298 మిలియన్‌ టన్నులు, 2018-19లో 285 మిలియన్‌ టన్నులు భారతదేశం ఆహారధాన్యాలలో స్వయం సంవృద్ధి స్థాయికి చేరినా, పోషకాహార లోపం 2018లో 18.8 శాతం ఉండగా 2020లో 15.8 శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. నిరుద్యోగం, పేదరికంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహాలోపం, ఆకలి మరణాలు  పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో దాదాపు 14 శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహార లోపంతో, 20 శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35 శాతం పిల్లలు స్టంటెడ్‌ గ్రోత్తో, 52 శాతం 15-419 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతం అవుతున్నారు.

ప్రపంచ దేశాల సగటు కంటే భారత్‌లో ఆకలి మరణాలు  ఎక్కువ ఉందని పలు నివేదికలు తెలిపాయి. దేశంలో ప్రతిరోజూ దాదాపు 19 కోట్ల మంది ఆకలి కడుపులతో నిద్రపోతున్నారని, ప్రతి దినం 1500 మంది ఐదేళ్లలోపు బాలలు పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారని, ఆ విధంగా ఏటా 3 లక్షల మంది బాలలు ప్రాణాలు కోల్పోతున్నారని 2020 జాతీయ ఆరోగ్య నివేదిక తేల్చింది. పోషకాహార లేమి ఉన్నమాట నిజమేనని అంగీకరించిన మోదీ ప్రభుత్వం ఆకలి మరణాల సమాచారం తమ వద్ద లేదంటున్నది. కొరోనా వల్ల దేశ ప్రజల ఆదాయాలు పడిపోయాయని, ఆహార అభద్రత పెరిగిందన్న హంగర్‌ వాచ్‌-2 నివేదికలోని అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్‌ రెండవ దశ అనంతరం ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేయడం కోసం రైట్‌ టు ఫుడ్‌ క్యాంపెయిన్‌, సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌ సంస్థలు 2021 డిసెంబర్‌ నుండి 2022 జనవరి వరకు 14 రాష్ట్రాల్లో సర్వే చేపట్టాయి. తమ ఆదాయాలు కొవిడ్‌ రాక ముందునాటి కంటే తగ్గిపోయాయని సర్వేలో సమాధానాలిచ్చిన వారిలో 66 శాతం అంటే మూడిరట రెండువంతుల మంది చెప్పారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో విధితమవుతోంది. పట్టణాల్లో నెలకు రూ.3,000, అంతకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. ఆహార లేమి, అభద్రత వంటి అంశాల్లో భారత్‌ దిగజారడం హఠాత్పరిణామం కాదు. 2022 ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 116 దేశాల్లో భారత్‌ 107 వ స్థానంలో, 2021 లో 101వ స్థానంలో,అంతకు ముందరి ఏడాది 94 వ స్థానంలో ఉన్నది. ఇలా దిగజారి ‘తీవ్ర స్థాయిలో ఆకలి కలిగిని దేశాల జాబితాలో చేరింది. ఎత్తుకు తగిన బరువుకన్నా చాలా తక్కువ గల పిల్లలున్న దేశాల్లో భారత్‌ ఒకటయింది.

మన దేశ బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, శిశు మరణాల రేటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తేల్చింది. ఇలా ఏ జాతీయ, అంతర్జాతీయ సర్వే లేదా అధ్యయన నివేదికలన్నీ మన దేశ పరిస్థితి అంతకంతకూ కుంగిపోతున్నదని స్పష్టం చేస్తున్నాయి.   రేషన్‌ కార్టులున్నవారిలో 90 శాతం మంది ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పొందగలిగామని సర్వేలో చెప్పారు. కనుక ప్రజా పంపిణీ వ్యవస్థను విసృతం చేయడానికి సర్కారు కృషి చేయాలి. కాని, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రేషన్‌ కార్జులన్నిటికీ సబ్సిడీపై ఆహార ధాన్యాలను కేంద్రం సమకూర్చడం లేదు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కార్డులకు మాత్రమే ఇస్తామంటోంది. మిగతా కార్జులన్నిటి సబ్సిడీ మొత్తాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే సుమారు 40 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు వెలుపలనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడం మానేసి ‘ఒక దేశం ఒకే రేషన్‌ కార్డు వంటి మాటల మాటున ఉన్నదానికి మరిన్ని చిల్లులు పెట్టడం అమానుషం. తిండికే అష్టకష్టాలు పడుతున్న దుస్థితిలో చిన్నారుల చదువులకూ తిప్పలు తప్పడం లేదు. తమ కుటుంబాల్లో కనీసం ఒకరు ఈ కాలంలో పాఠశాల డ్రాపొట్‌ అయ్యారని 18 శాతం మంది గృహస్తులు ‘పేర్కొన్నారంటే భవిష్యత్‌ భారతం ఎంత అంధకారమయమవుతుందో ఊహకే అందడం లేదు.

ప్రపంచీకరణ మార్కెట్‌ సిద్ధాంతం ఒకవైపు, హిందూత్వ ఫాసిస్టు పాలన మరోవైపు కలిసి ప్రజల్ని విభజించే ప్రయత్నాలు చేస్తూ వారి దృష్టిని వాస్తవాల నుంచి పక్కకు మళ్లిస్తున్నాయి. ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. దీనికి కారణం మూడున్నర దశాబ్ధాలుగా అమలు చేస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతలను, నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచాయి.
ఈ దుస్థితి మారాలి: ఇకనైనా ఈ దుస్థితి మారాలి. అందుకు అనువైన కార్యాచరణ పథకాలు సిద్ధం కావాలి. వాస్తవానికి కొరోనాకు ముందే మనదేశ ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. కొరోనా దెబ్బతో అది మరింత వెనుకబడిపోయింది. ఉపాధి కరువై పెద్దసంఖ్యలో కార్మికులు, కూలిపనులు చేసుకుని బతికే కష్టజీవులు బతుకుతెరువు కోల్పోయారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి, పటిష్టమైన పథకాల అమలుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి పటిష్టంగా అమలుకాకపోవడం, సమర్థవంతమైన పర్యవేక్షణ విధానం కొరవవడం వంటి కారణాలతో పరిస్థితి మళ్ళీ మొదటికొస్తోందని, ఎంతో ముఖ్యమైన పోషకాహార సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు కూడా అరకొరగానే ఉన్నాయని, దేశంలోని పలు పెద్దరాష్ట్రాల విధానాలు ఆకలి కేకలను నిలువరించలేక పోతున్నాయని గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ) అంతర్జాతీయ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉంటోందని, ఆ లోపాలను సరిదిద్దుకుని బాలలకు మంచి ఆహారాన్ని అందించాలని  ఆ సంస్థ సూచిస్తోంది. ఇకనైనా ప్రభుత్వాలు, పాలకులు, అధికార యంత్రాంగం, మేధావులు అందరూ కలసికట్టుగా ఆలోచించి ప్రజలను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి. ముఖ్యంగా పేదరికం నుంచి ఆకలి బాధల నుంచి విముక్తి చేసేందుకు కృషిచేయాలి. పేదప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించడం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కృషి చేయడం, ఆహార పథకాలను విస్తరించడం, పేదల ఆర్ధికాభ్యున్నతికి అన్నివిధాలా చేయూతనివ్వడం ప్రభుత్వాల కనీసధర్మం. ఆ ధర్మాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చాలి. దారిద్య్రం, ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం.. వీటన్నిటినీ అరికట్టిన నాడే ప్రజలకు మేలు జరుగుతుంది. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేస్తాయని ఆశిద్దాం!
-మోటె చిరంజీవి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌.
9949194327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page