పరమాత్ముని తత్త్వాన్ని ప్రబోధించడమే ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్ చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన భావాన్ని అందించగల రచయితలోని నైపుణ్యం ఇందులోని వ్యాసాలలో వ్యక్తమైంది. 24 తెలుగు, 8 ఆంగ్ల అంశాలను ఈ గ్రంథంలో చేర్చారు. విషయంపై అధికారం, అందుకు సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం, విజ్ఞతతో భాగాలుగా విభజించి చెప్పడం రచయితలోని సూక్ష్మ పరిశీలన దృక్పథానికి నిదర్శనంగా కన్పిస్తుంది. మహనీయులు తమ జీవన ప్రయాణంలో ఆచరించి చూపిన విశేషాలను మహావాక్యాలతో అనుసంధానించి ఒక జిజ్ఞానుసువుగా రచయిత చేసిన జ్ఞాన యజ్ఞం ఏమిటో ఇందులోని అంశాలను అవలోకిస్తే బోధపడుతుంది. భావుకత, తార్కికత, విశ్లేషణాత్మకతతో ఇందులోని వ్యాసాలు దేనికవే ప్రత్యేకంగా కన్పిస్తాయి. మహితాత్ముల హితోక్తులను అందిస్తూనే చదివించే చక్కని శైలిని రచన కోసం రచయిత ఎంచుకున్న తీరు ప్రశంసనీయం. ఎన్నో గ్రంథాలు చదివి సారాన్ని మధించి ఒకచోట పంచిన అనుభూతిని అందించేందుకు చేసిన సృజన ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఆధ్యాత్మికత చింతనతో కూడిన బాధ్యత, భావితరాలకు అనేక విషయాలను సులభతరంగా ప్రబోధించాలన్న తపన ఈ వ్యాసాల్లో స్పష్టంగా కనబడుతుంది.
శ్రీ దేశిరాజు పెద బాపయ్య గురించిన మొదటి వ్యాసం ఆయనలోని రాజకీయ స్వాతంత్య్ర తపనకు తార్కాణంగా నిలిచింది. స్వదేశీ వస్త్రాలనే ధరిస్తూ, స్వరాజ్యోద్యమంలో పాల్గొని సౌభ్రాతృత్వాన్ని కనబరిచి ఆత్మ గౌరవంతో సత్కార్యాలకు పాటుపడి సమగ్ర జీవన సాఫల్యతను పొందిన బాపయ్య అమేయ శేముషీ వ్యక్తిత్వ గరిమను రచయిత తనదైన శైలిలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అంతరంగంలో, భాహ్యంలో జ్ఞానజ్యోతిని దర్శించిన ఆధునిక కాలపు జ్ఞానిగా అభివర్ణిస్తూ దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించిన వ్యాసం ఆలోచనాత్మకంగా సాగింది. అవిద్యను తొలగించుకునేందుకు ఎనమిది అంశాలతో కూడిన మార్గాన్ని బుద్ధుడు ఉపదేశించాడని అదే అష్టాంగీక మార్గమని వివరించారు. సమ్యక్ దృష్టి, వచనం, కర్మ, జీవనం, వ్యాయామం, స్మృతి, సమాధి వంటి అంశాలను సోధాహరణంగా వివరించారు. దీపావళి అంటే జీవన ప్రమోదావళి అని విశ్లేషించారు. దీపావళికి ఉన్న పౌరాణిక నేపథ్యాలను సమగ్రంగా వెల్లడించారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి, ఒత్తిచేసి వెలిగించి, పూజ చేసి నైవేద్యం సమర్పించిన క్రమాన్ని చెబుతూ కాంతి జీవన క్రాంతిగా ఎలా పరిణమిస్తుందో తెలిపారు.
కృష్ణాష్టమి వ్యాసంలో భక్తిముందు విలువైన వజ్రం కూడా వెలవెలబోయి విస్తారమైపోతుందన్న స్వామి చిదానంద మాటలను ఉల్లేఖిస్తూ వ్యాఖ్యానించారు. సంక్రాంతి మంచి మార్పుకు సంకేతమని చెప్పి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ఆ పండుగ విశిష్టతను వెల్లడించారు. ఏది తెలియదగినదో, దేనిని తెలుసుకోవాలో ఆలోచించమన్న గీతాచార్యుని మాటని గుర్తుచేసి ఆత్మను శ్రవణం చేయమన్నారు. ఆంతర్యం అవగతమైతే ఆత్మజ్ఞానం బోధపడుతుందని తెలిపారు. వెనుదిరిగి చూడని దృష్టి శిఖరానికి చేరుస్తుందని తెలిపి స్వామి శివానంద వాక్యాలను ప్రస్తావించారు. అహంకారం అన్నింటినీ దూరం చేస్తుందని అనేక ఉదాహరణలతో వివరించి శ్రీరామకృష్ణ పరమహంస తెలిపిన చింత, బుద్ధి, మాటలు వంటి అంశాలకు సవివరణ ఇచ్చారు. నేను అనే అహంకారం లేకుండా పోవడమే ముక్తి అని చెప్పారు. సమాజ సేవనే చిద్విలాస చిన్మయానంద అనుభూతిని మిగులుస్తుందని చెప్పి శ్రీరమణ మహర్షి వివరించిన శాంతి స్వరూపాన్ని ప్రస్తావించారు. ఆధ్యాత్మిక జీవన ప్రాధాన్యతను తెలిపారు. సద్గుణాలను అలవర్చుకుంటే జన్మవాసనలు తొలగిపోతాయని అన్నారు. మనస్సు శరీరం వాంఛారహిత సంస్కారాన్ని పొందాలని అభిలషించారు. అంతరంగపు పిలుపు జీవిత పరిపూర్ణత్వాన్ని సాధించేందుకు మార్గదర్శనమవుతుందని అభిప్రాయపడ్డారు. వాల్మీకి, గౌతమబుద్ధుడు, యశోధర, రాహుల్ వంటి పాత్రలలోని నిరాశ, ఆవేదన, శూన్యతలను వెల్లడించారు. వివేక వైరాగ్యాల ప్రభావాలను వివరించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్లోని కరుణ, ధృడత్వం అనే గుణాలను సందర్భానుసార ఉదాహరణలతో వివరించారు. మహర్షుల మార్గం అనుసరణీయమని తెలిపారు. దివ్యజీవనునిగా రఘుపతివెంకటరత్నం నాయుడు గురించి చెబుతూ ఆయన ప్రజ్ఞాశాలీనతను ప్రస్తావించారు. ధ్యాన యోగం గురించి తెలుసుకొని ఆ ప్రయోజనాలను జనావళికి వివరించారు. విలువలతో కూడిన శోధన వల్ల జ్ఞానం పొంది ఆవేదన పోగొట్టుకొని శాంతియుత స్థితిలో ఆరోగ్యంతో శోభిస్తూ శాంతి సుస్థిరతకు ఎలా పాటుపడవచ్చో వివరించారు. ప్రపంచ శక్తులను, వాటి తీరుతెన్నులను విశ్లేషించారు. బ్రహ్మరథం సర్వస్వానికి ఆది విశ్వాసమని వెల్లడించారు. అనుబంధంగా చేర్చిన ఆంగ్ల వ్యాసాలలో Love is Spirit, Making a soul Bargain, Darsanas Relation to Vedas, Jainism, Upasana, Vaisheshika, Character of Experience, Food for thought Spirit is Perfect in Every Believer దీవశ్రీఱవఙవతీ వంటివి పలు దృష్టాంతాలను అందిస్తూ వివరణాత్మకంగా ముగిశాయి. గాంధీ, స్వామి శుభోదానంద, ఎమర్సన్, స్వామి చిన్మయానంద, భగవాన్ శ్రీరమణమహర్షి, దలైలామ, స్వామి వివేకానంద వంటి మహనీయుల సూక్తులను ప్రస్తావిస్తూ ఆంగ్ల వ్యాసాలలో సందర్భోచితమైన జీవన విలువలను రచయిత అందించారు. ఇది వరకే నేనెవడను, అనుదిన సంగ్రహ ప్రార్థనలు వంటి ఉత్తమ గ్రంథాలను ప్రచురించిన సుదర్శన్ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పలు పురస్కారాలను అందుకున్నారు. ఆధ్యాత్మికతతో నైతిక విలువలను పెంపొందించేందుకు నిర్ధుష్టమైన ప్రణాళికతో ఈ చిత్సుధ గ్రంథం రూపొందింది.
– డా. తిరునగరి శ్రీనివాస్, 8466053933