- నిర్లిప్తతలో కేంద్రం…పరిష్కార చర్యలపై ఉదాసీనత
- ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటులో మందగమనమే నిదర్శనం
- ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో 101వ స్థానంలో భారత్
- కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్ష అవసరం
- మీడియాతో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
ఉదయ్‌పూర్, మే 14 : దేశఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చెప్పారు. ఆర్థిక సంక్షోభం విషయంలో మోడీ సర్కార్ నిర్లిప్తత అవలంబిస్తుందని అన్నారు. దీనిని పరిష్కరించే చర్యల విషయంలో ఉదాసీనత కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ మేధోమథనం సమావేశాల నేపథ్యంలో శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ…జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినపుడు ఆర్థిక విధానాలను విభిన్నంగా మార్చడం గురించి పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో వృద్ధి రేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం నిర్లిప్తంగా ఉందని, నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను సమగ్రంగా సవి•క్షించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. వస్తు, సేవల పన్ను చట్టాలను మోదీ ప్రభుత్వం పేలవంగా రూపొందించిందని, జిఎస్టీ చట్టాలను 2017లో అనుచితంగా అమలు చేసిందని, ఆ పర్యవసానాలను ప్రతి ఒక్కరూ చూడవలసి వొస్తుందని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా బలహీనపడిందన్నారు. ఈ విషయంలో అత్యవసర ఉపశమన చర్యలు అవసరమని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 1991లో సరళీకరణ నూతన శకాన్ని ఆవిష్కరించిందని గుర్తు చేశారు. ఈ సరళీకరణ వల్ల దేశానికి గొప్ప ప్రయోజనాలు లభించాయని తెలిపారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుదల, లక్షలాది ఉద్యోగావకాశాలు, ఎగుమతులు, పదేళ్ళలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం వంటి ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు. 30 ఏళ్ళ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినపుడు, ఆర్థిక విధానాలను మార్చడం గురించి ఆలోచించవలసిన అవసరం కనిపిస్తుందని తెలిపారు. ఆర్థిక విధానాలను మార్చడం వల్ల అసమానతల పెరుగుదల, తీవ్ర పేదరికం వంటి సమస్యలకు పరిష్కారం లభించాలన్నారు. ప్రపంచ ఆకలి సూచీ 2021లో 116 దేశాల్లో మన దేశం 101వ స్థానంలో ఉందన్నారు. మహిళలు, బాలల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై బాహ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయని, ఈ పరిణామాలను ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదని చెప్పారు. ఈ పరిణామాలను ఎదుర్కునడానికి ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి తెలిసినట్లు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ మేధోమథనంలో మూడు రోజులపాటు జరిగే సమాలోచనలు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆర్థిక విధానాలపై దేశవ్యాప్త చర్చకు దారి తీస్తాయన్నారు. నవ సంకల్ప చింతన్ శివిర్ పేరుతో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్ మేధోమథనం సమావేశాలు ఆదివారం వరకు జరుగుతాయి. ముసాయిదా ప్రకటనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం చర్చిస్తుంది. ఈ మేధోమథనం సమావేశాల్లో ఆర్థిక రంగంపై కమిటీకి చిదంబరం నాయకత్వం వహిస్తున్నారు.