అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’

అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ రాసిన వ్యాసం చదివితే తెలుస్తుంది తనేమిటో… తను ఈ మధ్య రాసిన పుస్తకం “రణధీర సీతక్క” సీతక్క అంటే తెలియని వారు ఎవరు.. శ్రీనివాస్ విద్యార్థి దశలో సీతక్కతో విప్లవ ఉద్యమాల సహచర సోదరుడిగా పనిచేసిన అనుభవం, తన గురించి చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తిగా సీతక్క జీవిత విశేషాలను లోతుగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దాదాపుగా తను సఫలీకృతుడు అయ్యాడని చెప్పవచ్చు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు పూర్వ తెలంగాణ పరిస్థితులను, ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి ఆసనాల కూలంకషంగా తనకున్న పరిధిలో వివరించిన విధానం మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. విద్యార్థి దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో తను పనిచేసిన అనుభవం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది.
ధనసరి అనసూయ – సీతక్క గురించి ముందుమాటలోనే ఈ విధంగా అన్నాడు ” పీడకులపై అగ్నివి పీడితుల పట్ల ప్రేమవి ఆదర్శాల ఆచరణలో అరుదైన నవ్య మానవి” అని .. సీతక్క గురించి నాలుగు మాటల్లో గొప్పగా చెప్పాడు ఆసనాల. సీతక్క బాల్యం నుండి మంత్రిగా నేటి వరకు మారిన విధానం గమనిస్తే ముందుమాటలో కోట్ చేసిన ‘రేగోబెర్త’ మాటల రూపంలో “ప్రజల పట్ల మా నిబద్ధత మాకు ప్రతిసారి కొత్త పోరాట రూపాలను ఎంచుకోవడానికి ప్రేరణ అయింది” ఈ మాట శ్రీతక్క విషయంలో అక్షరాల నిజం..కొత్త పోరాటాలు, పోరాట రూపాలు ఎంచుకోవడం అంటే పోరాటాలు ఎందుకు చేస్తారు ? అంతిమ లక్ష్యం పీడితులకు న్యాయం జరగడం కోసమే ఎన్నో ఏళ్ళు అజ్ఞాతంలో ఉండి పోరాటం చేసిన తను ప్రజా జీవితంలో ప్రజల మధ్య ఉంటూ సేవ చేయవచ్చని నిరూపించారు సీతక్క. ఆస్నాల ఇదే విషయాన్ని … “నిజమైన అర్దంలో ‘ప్రజల నేత అనేవారు తన ప్రాంతపు జీవితాన్ని జీవించాలి, తన ప్రజల బాధలను అనుభవించాలి, వారి ఆనందాలతో సంతోషం పొందాలి, వారి అవసరాలను పంచుకోవాలి’ అని చెప్పాడు. నూటికి నూరు శాతం సీతక్క ఆదివాసీల కష్టాలను కుటుంబ సభ్యురాలిగా తెలుసుకొని వారి అవసరాలను తీర్చింది. ముఖ్యంగా కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ దిక్కుతోచని స్థితిలో ఎక్కడో గుట్టలపై నివసించే ఆదివాసీలను ఆదుకున్న గొప్ప మానవతా మూర్తి సీతక్క. మోకాలి లోతు నీటిలో తడుచుకుంటూ మూట నెత్తిన పెట్టుకొని వారి చెంతకు వెళ్లి ఒక తల్లిగా వారిని ఆదరించిన తీరు ఆదివాసీలకే కాదు మిగిలిన ప్రజలందరి హృదయాలలో చెరగని ముద్ర, మెప్పు పొందేలా చేసింది.
2004 ములుగు ఎమ్మెల్యే గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా ఏమాత్రం నెరవకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా బిడ్డ ఏడిస్తే తల్లి స్పందించినట్లు ప్రజల కష్టాలను తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ 2009 ఎన్నికల్లో అదే ప్రత్యర్థిపై భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించి తోటి ప్రజా నాయకులకు ఆదర్శంగా నిలిచింది. తను చేసిన పలు సేవా కార్యక్రమాలు నిరాడంబరత కేవలం తన ప్రాంత వాసులకే కాక దేశ మొత్తం తన వైపు చూసేలా చేసింది. దీనికి ఒక ఉదాహరణ డిసెంబర్ 7, 2023 నా లాల్ బహుదూర్ స్టేడియంలో రాష్ట్ర మంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తన పేరు చదవగానే అక్కడ సభ్యుల నుంచి అభిమానుల నుండి వచ్చిన స్పందన మహాద్భుతం నిస్వార్థ సేవ చేసే నికార్సైన నాయకులకు ప్రజల నీరాజనం ఈ విధంగానే ఉంటుంది. ఇంతటి స్పందన చూసి వేదికపై ఉన్న రాజకీయ దిగ్గజాలు (గవర్నర్ తో సహా) అందరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. టీవీల్లో ఈ దృశ్యాన్ని చూస్తున్న కోట్లాది ప్రజలు ఆనందంతో పులకించిపోయారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యురాలికి దక్కుతున్న గౌరవంగా భావించారు. ఈ క్షణాలు బహుశా సీతక్క తన జీవితంలో మరువలేని ఎప్పటికీ గుర్తుంచుకునే మధుర క్షణాలు..తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆసనాల శ్రీనివాస్ ఈ పుస్తకానికి “రణధీర సీతక్క” అనే పేరును ఎందుకు పెట్టాడో తెలిసింది. సీతక్క తన నక్సలైట్ జీవితంలో కొంతకాలం ‘రణధీర్’ పేరుతో పలు కార్యకలాపాలు నిర్వహించారు. తొలి మహిళ దళ కమాండర్ గా పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరులో మల్లు స్వరాజ్యం, కడవెండి వజ్రమ్మల తరువాత అంతటి స్థానానికి మహిళా సాయిధ బలగానికి నాయకత్వం వహించే అవకాశం సీతక్కకు దక్కిన విషయాన్ని ఆసనాల గుర్తు చేశాడు.
ఆసనాల ఈ పుస్తకంలో ముఖ్యంగా మూడు విషయాలను తెలియచేశాడు ధనసరి అనసూయ ఎటువంటి పరిస్థితుల్లో సీతక్కగా మారిన విషయం అందుకు ప్రభావితం చేసిన ఆనతి పరిస్థితులు, కుటుంబ నేపధ్యం, నక్సలైట్ గా తను ఎదుర్కొన్న ఆటుపోట్లు మరియు క్రమేణ తను దళ కమాండర్ గా ఎదిగిన తీరు, తర్వాత క్రమంలో అజ్ఞాత జీవితాన్ని వీడి ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమకు పాత్రురాలై వారి మన్ననలు పొందిన విధానం, శాసన సభ్యురాలిగా ఆ తర్వాత మంత్రిగా ఉన్నత స్థానాన్ని చేరిన తన రాజకీయ జీవితాన్ని గురించి స్థూలంగా వివరించే ప్రయత్నం చేశాడు. రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలు తెరిచిన పుస్తకంలో అందరికీ తెలిసినా ..తెలంగాణ సాయుధ పోరాటంలో తను గడిపిన జీవితాన్ని ఆ నేపథ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించాడు ప్రజాక్షేత్రంలో గెలుపోటములతో సంబంధం లేకుండా ఆదివాసీలకు ఎల్లవేళలా అండగా ఉండడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడానికి సాయిశక్తుల కృషి చేసిన మహోన్నత వ్యక్తి సీతక్క పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయ నాయకుడు అభిమానించే ఆదివాసి బిడ్డగా ఉద్యమ నాయకురాలుగా ప్రజా ప్రతినిధిగా వారి ఆదరాభిమానాలకు చూరగొనడంలో నూటికి నూరు శాతం సఫలీకృతురాలయ్యింది సీతక్క. ప్రతి ప్రజా నాయకుడు ప్రేమగా అక్కా అని పలకరించేలా.. ఆఖరికి అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష అధికారపక్ష తేడా లేకుండా అందరూ నాయకులు తనని పొగిడే విధంగా వారి గుండెల్లో స్థానాన్ని సుస్థిరపరచుకుంది అజాత శత్రువులా చేసింది. ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన గోదావరి లోయ పరివాహక ప్రాంతం ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో జన్మించిన ధనసరి అనసూయ సీతక్క గురించి మరో కోణం ఈ పుస్తకంలో మనకు తెలియజేశాడు ఆసనాల. పాఠశాల దశలోనే ఆగిపోయిన తన చదువును తర్వాతి కాలంలో దూరవిద్య ద్వారా అంచెలంచెలుగా పూర్తిచేసి, విద్య ఆవశ్యకతను గుర్తించి డిగ్రీ తో పాటు న్యాయవాద విద్యను అభ్యసించి పీడిత ప్రజల హక్కుల కోసం న్యాయవాదిగా కొంతకాలం పనిచేసిన విషయాన్ని ఆశనాల తెలియజేశాడు.
ఎవరూ ఊహించని విధంగా ఎప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమైనా ..తన జ్ఞాన తృష్ణకు పదును పెడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొంది చాలామంది యువతకు నాయకులకు ఆదర్శప్రాయులయింది సీతక్క. డాక్టర్ పట్టా పొందిన ఉద్వేగక్షణాల్లో సీతక్క ట్విట్టర్లో ఈ విధంగా పేర్కొన్నారు… “నా బాల్యంలో నేనెప్పుడూ ఊహించలేదు నేను నక్సలైట్ అవుతానని, నేను నక్సలైట్ గా ఉన్నప్పుడు ఏనాడు అనుకోలేదు నేను లాయర్ అవుతానని, నేను లాయర్ గా ఉన్నప్పుడు ఊహించలేదు నేను ఎమ్మెల్యే అవుతానని, నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఊహించలేదు నేను (Ph.D) డాక్టర్ పట్టా పొందుతానని.. ఇప్పుడు మీరందరూ నన్ను “డాక్టర్. అనసూయ సీతక్కగా పిలవచ్చు” అని ఎంతో విజయగర్వంతో సంతృప్తికరమైన ఆనందక్షణాల్లో రాసిన మాటలు అవి. సీతక్క నేటి యువతకు ముఖ్యంగా బాలికలకు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం, భవిష్యత్తు పట్ల అవగాహన లేని ఆలోచనలతో, గమ్యం ఏమిటో తెలియక, లక్ష్యం ఏర్పరచుకోకుండా అరకొర చదువులను మధ్యలో ఆపేస్తున్న ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టుదల ఉంటే ఏమి సాధించగలరో నిరూపించారు. ఒక వ్యక్తి వైతాళికతను చరిత్రగతిని మార్చే శక్తిని సంతరించుకోవడానికి, ఏటికి ఎదురీదడానికి వెనుక ఎంత అవిరళ కృషి ఉంటుందో తెలియజేయడానికి ఈ పుస్తకం రాయడం జరిగిందని ఆసనాల శ్రీనివాస్ చెప్పాడు.
సీతక్క బాల్యం నుండి నేటి వరకు సీతక్క ప్రస్థానంపై 500 పదాల నిడివిలో ఒక వ్యాసం రాద్దామని మొదలుపెట్టిన తను సీతక్కతో తనకున్న పూర్వ పరిచయం, ఉద్యమ సహచర సోదరుడిగా మరియు విద్యార్థి దశ నుండి ప్రగతిశీల భావాలు సంతరించుకున్న ఆసనాలను ఆనతి సంఘటనల సమాహారం గుర్తుకువచ్చి తన కలం వ్యాసంతో సరిపెట్టలేకపోయింది తనకు తెలియకుండానే 20 వేల పైచిలుకు పదాలు రాసి దీన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చాడు. సీతక్క గురించి ఈ పుస్తకంలో తెలియజేస్తూ ఆనాటి సంఘటనలను పరిస్థితులకు గల మూల కారణాలను చాలా లోతుగా విశ్లేషించాడు తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు జరిగిన సంఘటనలను అస్నాల వివరించిన తీరు అమోఘం. ఎంతో విషయవగాహనను పరిపక్వతను ప్రదర్శించాడు సీతక్క జీవితం గురించి రాయడం అంటే మూడు దశాబ్దాల పోరాట చరిత్ర ను రాయడమే.
ఈ పుస్తకంలో కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు ఆనాటి చరిత్ర తెలిసిన వారు ఉద్వేగానికి లోనవ్వడం ఖాయం కొన్ని సందర్భాలలో అసలు విషయం కన్నా పూర్వ చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చాడని అనిపించినా నేటి యువతకు అప్పటి విషయాలు ఈ విధంగానైనా తెలియజేయడం అవసరమని రాసాడేమో అనిపిస్తుంది. నేటి యువతకు ముఖ్యంగా బాలికలకు సీతక్క జీవితం చాలా స్ఫూర్తిదాయకం, నిరాశ నిస్పృహల్లో చిన్న కష్టానికి అల్లాడిపోతున్న యువతి యువకులకు మంచి సందేశం ఇచ్చే జీవితం సీతక్క జీవితం. చివరగా వెంకట యోగి గారు చెప్పినట్టు “నిజాయితీగా ప్రజల పక్షం వహించిన వారికి ఏనాడు ఓటమి ఉండదని, ఒడిదొడుగులు అన్నీ తాత్కాలికమైనవని”. సీతక్క పై నాకున్న ప్రత్యేక అభిమానమే నన్ను ఈ పుస్తకం గురించి, ఆమె మహోన్నత వ్యక్తిత్వం గురించి నాలుగు మాటలు రాసేలా చేసింది. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వీర వనిత గురించి గొప్పగా రాసే అవకాశం దక్కిన ఆసనాల శీనన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ ..ముఖ్యంగా తెలంగాణ యువత చదవాలని తెలియజేస్తున్నాను.
– నయీమ్ పాష, ఖమ్మం ఫోన్ : 99089 1678

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page