అంతు లేని ఆవేదనలకు తుది రూపం ఆత్మహత్యలు

‘‘ ‌ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే ఆత్మహత్యలను నివారించడం సాధ్యపడుతుంది.’’

కాలం తీరకుండా కాటికి పోయే పరిస్థితులు దాపురించడం వలనో, ఇతరుల వలన భరింపశక్యం కాని మనో క్లేశాలు సంభవించడం వలనో, జీవించడానికున్న అన్ని మార్గాలు మూతబడి,ఎలాంటి సహాయం అందని అత్యంత దయనీయమైన పరిస్థితులు  ఏర్పడడం వలనో, క్షణికావేశం వలనో అర్థాంతరంగా తుది శ్వాస విడిచే తీవ్రమైన మానసిక రుగ్మతను క్లుప్తంగా ‘‘ఆత్మహత్య’’ అని నిర్వచించవచ్చు.ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. జీవితమంటే సుఖ దుఃఖాల సమ్మేళనం. కష్టాలు,కన్నీళ్లు, మన వెంటే నీడలా అనుసరిస్తాయి. ఆనందం, విషాదం అన్నీ మన శరీరంలో ప్రాణమున్నంత వరకే.మనమున్నంత వరకే  ఈ ఆవేదనలు, ఆక్రందనలు.ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టని వింత రహస్యం. మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేసిన ంతవరకే మన వీరత్వం. ఒక్కసారి మన ఆరోగ్యం దెబ్బతిని, మంచానికి పరిమితమైన నాడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు కల మాదిరిగా కనుమరుగు కాక తప్పవు. బ్రతికున్నంత కాలం ఈర్ష్యా ద్వేషాలతో, ధనమదంతో, అహంకారంతో,ఆధిక్యతా భావజాలంతో  విర్రవీగిన గొంతులన్నీ మూగబోక తప్పవు.చేసిన మోసాలకు, ఘోరాలకు,తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చెల్లించక తప్పదు. ఆకాశ హర్మ్యాల్లో విహరించినా,పట్టు పరుపులపై పవళించినా, పూరి గుడిసెలో, నేలపై పవళించినా,పంచభక్ష్య పరమాన్నాలు భుజించినా,నోట్ల కట్టల మధ్య,బంగారు ఆభరణాల మధ్య ఆడంబరంగా,దర్పంగా జీవించినా చివరకు మిగిలేది శూన్యం. ఎలా పుట్టామో అలాగే కన్ను మూయక తప్పదు.బ్రతికున్నంత వరకు మన సంపదను  చూసి,కాకుల్లా మూగిన  వారంతా శవం పక్కన క్షణమైనా నిలవజాలరు.
మన జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు జన్మించామో, ఆ జన్మకు సార్ధకత ఎలా సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి.విజ్ఞానం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి.విలాసవంతమైన జీవితం మానవ జీవితాలను మలుపు తిప్పింది. వైద్య సదుపాయాలు పెరిగాయి. సగటుమానవ ఆయుః ప్రమాణం పెరిగిందని భ్రమిస్తున్నాం. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం అనే భ్రమలో మనమున్నాం. కాని విలాసాలతో పాటుగా  వికటించిన ఆరోగ్యం గురించి మరచి పోతున్నాం. భోగాలు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. రోగాలకు సగటు జీవుల జీవితాలు తలక్రిందులైపోతున్నాయి.  విలాస వంతమైన జీవితం గడుపుతూ,కరెన్సీ పాన్పుల మీద శయనిస్తూ, అదే జీవితమని భ్రమించడం తాత్కాలికం.పలు రోగాలతో ప్రతినిత్యం చస్తూ బ్రతుకుతూ, బ్రతుకు జీవుడా అనుకుంటూ జీవశ్చవాల్లా బ్రతుకీడ్చడం కంటే నరకం మరొకటుండదు. ప్రతినిత్యం బ్రతుకు కోసం పోరాటమే. ఏదో సాధించాలని ఆరాటమే. తినడానికి తిండిలేక ఆకలితో అలమటించే జనం కొందరు,అన్నీ ఉన్నా తినలేని అసహాయ పరిస్థితుల్లో మరికొందరు. ఎన్ని పోరాటాలు చేసినా,తల్లక్రిందులుగా తపస్సు చేసినా 50 ఏళ్ళకంటే ఎక్కువగా జీవించలేని దుస్థితి ఏర్పడింది.అంతకంటే పైబడి జీవించినా అనారోగ్య పీడితులుగా కాలం వెళ్ళ బుచ్చాలి.
ఆరోగ్యం కోసం ఎంత తపించినా కాలుష్యం మధ్య జీవించడం, కల్తీ పదార్ధాలు భుజించడం వంటి పలు కారణాల వలన మానవ ఆయుః ప్రమాణం హారతి కర్పూరంలా హరించుకు పోతున్నది.ఈ మాత్రం జీవితానికి ఇతరులను వేధించుకు తినడం ఎందుకు? పీడించుకుతిని, జీవించడమెందుకు?  గాలిలో దీపాల్లా ఎప్పుడు ఆరి పోతాయో తెలియని భద్రత లేని బ్రతుకుల కోసం ఇంతటి స్వార్ధం ఎందుకు? డబ్బు సంపాదన పేరుతో ఇతరుల పొట్టకొట్టడం దేనికి?  అహంకారంతో విర్రవీగి , అసూయతో చెలరేగి ఇతరుల జీవితాలను  శాసించి,వారి స్వేచ్ఛను హరించి, మనో వేదనకు గురి చేసి, ఆత్మహత్యల వైపు పురి గొల్పడం దేనికి సంకేతం? మనిషిలో మానవత్వం నశించి పోవడం వలన, మంచి చెడుల మధ్య విచక్షణ గుర్తించక పోవడం వలన ఎన్నో జీవితాలు బలై పోతున్నాయి. సమాజంలో చోటు చేసుకుంటున్న పలు కారణాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, ఇతరులు పెట్టే క్షోభ ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి.  ఆత్మహత్యలకు పాల్పడే వారిని పిరికి వారిగా భావించడం, బ్రతికుండగా ఆదుకోలేని వారు చనిపోయిన తర్వాత కూడా కారణాలు తెలుసుకోకుండా, నిందలు వేయడం భావ్యం కాదు. చిన్న గాయం తగిలితేనే బాధపడే వారు, ఎలాగైనా బ్రతకడానికి నిరంతరం పోరాటం చేసే వారు,ఎన్నో సమస్యల సుడిగుండాలను దాటుకుంటూ, కష్టాలను అనుభవించిన వారు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఏ హృదయంలో ఎలాంటి బడబాగ్ని జ్వాలలు పెల్లుబికుతున్నాయో, ఎవరి స్వార్ధం కన్నీళ్లు పెట్టిస్తున్నదో, ఎవరి హింస  వేదనగా మారి మనసును అల్లకల్లోలం చేస్తున్నదో ఎవరికి తెలుసు?  ధనవంతులు కావచ్చు పేదవారు కావచ్చు, జీవితంలో మనశ్శాంతి కరువై,తీవ్ర మనో వేదనకు గురై, అర్థాంతర మరణాలకు చోటివ్వడం చూస్తున్నాం.
కొంత మంది ప్రేమల పేరుతో తీవ్రంగా వంచించబడి, మనో వ్యాకులతకు గురౌతున్నారు. అమాయకులను ప్రేమ పాశంలో బంధించి, చల్లగా జారుకుంటూ, తప్పించుకునే వారిని చూస్తున్నాం. ఎన్నో ప్రేమ బంధాలు కృత్రిమ ప్రేమ బంధాలని తెలుసుకుని, మనసు వికలమై,తీరని ఆవేదనతో తల్లడిల్లిన హృదయాలకు నచ్చచెప్పుకునే స్థాయి దాటి పోయి,భరించలేని హృదయ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో?  కపట ప్రేమతో,వంచనతో జీవితాలతో ఆటాడుకుని, నిండు జీవితాలను బలిచ్చే కఠిన కర్కశ హృదయాల మధ్య బ్రతక లేక ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడే వారెందరో? ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి ధనిక పేద అనే తారతమ్యం లేదు. తిండి లేక కొంతమంది,అనారోగ్యంతో కొంతమంది, ఆర్థిక బాధలతో మరికొంత మంది తమ జీవితాలను ముగిస్తున్నారు. శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు.  వ్యసనాలకు బానిసలై, విలాసాలకు అలవాటు పడి, డబ్బు చేతికందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని మనం చూస్తున్నాం. నచ్చిన వారితో పెళ్ళి జరగలేదని కొంతమంది, తల్లిదండ్రులు తమ విలాసాలకు డబ్బు ఇవ్వలేదని, తమ కోరికలు తీర్చడం లేదని మరికొంతమంది  సునాయాసంగా ప్రాణాలు తీసుకోవడం అజ్ఞానం. ఇది సమాజం హర్షించని క్షమించరాని నేరం.ఇలాంటి అసమంజసమైన కారణాలతో మరణించే వారిని మార్చడం చాలా తేలిక. కాని అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.
ఆర్థిక ఇబ్బందులతో,అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొంతవరకైనా ఆత్మహత్యలను కట్టడి చేయవచ్చు.ఇలాంటివి కాకుండా పరువు పేరుతోనో, ఇతరులకు ఇబ్బంది కలిగించ కూడదనే ధ్యేయంతోనో ఎవరికీ చెప్పకుండా తమలో తాము క్రుంగి పోతూ, హృదయాన్ని పిండేసే సంఘటనలతో  తల్లడిల్లుతూ ఉసురు తీసుకు కుంటున్నవారెందరో వారి ఉసురు తీస్తున్న వారెందరో ఆత్మహత్యల నేపథ్యాన్ని విశ్లేషించి, అవగతం చేసుకోవాలి. ఆత్మహత్యకు పాల్పడి,ఈ లోకాన్ని విడిచి పెట్టి పోయిన తర్వాత కూడా విగత జీవులపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ,చులకనగా మాట్లాడడం దారుణం.ఎన్నో బాధలతో హృదయం బరువెక్కి,మానసికంగా నలిగిపోయి, భరింపశక్యం కాని వేదనతో  జీవితాన్ని చాలించి పోయిన వ్యక్తుల గురించి కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ, ఆనందించే పైశాచికత్వం విడ నాడాలి. ఆత్మహత్యలకు కారణం తెలుసుకుని నివారించడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో ప్రతీ 40 సెకండ్లకు ఒకరు చొప్పున ప్రతీ ఏడాది ఏడు లక్షలమందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఒక  అంచనా.
ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే ఆత్మహత్యలను నివారించడం సాధ్యపడుతుంది.
ఎలాంటి భద్రత,భరోసా కల్పించకుండా, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించడం వలన ప్రయోజనం శూన్యం.కాలే కడుపుకు అన్నం కావాలి కాని,ఉచిత సలహాల వలన కడుపు నిండదు. అలాగే బరువెక్కిన హృదయాలకు స్వాంతన కావాలి. ఆత్మహత్యలకు గల కారణాలపై  కూలంకషంగా అధ్యయనం జరగాలి. ప్రాణం చాలా విలువైనది. అలాంటి ప్రాణాలను అతి సునాయాసంగా త్యజించడం దేనికి సంకేతం? ఇకనైనా మారాలి. ఇతరుల ప్రాణాలను ఆత్మహత్యల రూపంలో బలిగొంటున్న వారి నైజం మారాలి.
image.png
సుంకవల్లి సత్తిరాజు.
తూ.గో.జిల్లా, ఆం.ప్ర, 9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page