జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి
న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్, నికోబార్ దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్ 1వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ముందుగానే వొస్తాయని తెలిపింది. అయితే రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తుందని వెల్లడించింది. మే 27 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించిన ఐఎమ్‌డి ఇంకా నాలుగు రోజులు ఆలస్యమవుతుందని తెలిపింది. రుతుపవనాల ఎంట్రీకి సంబంధించి ఎలాంటి సూచనను ఇవ్వలేదని ఎఓఆ డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్ర తెలిపారు.
గాలుల స్థిరత్వం, బలం పుంజుకొంటేనే కేరళకు రుతుపవనాలు తాకుతాయని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. జూన్ 2, జూన్ 8 మధ్య ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకొంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాల కదలిక నిదానంగా కొనసాగవచ్చని, అయితే.. నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. మరోవైపు మే 29 వరకు వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ఐఎమ్‌డి ఉపసంహరించుకుంది.