– సదస్సులో మంత్రులు సీతక్క, వివేక్, డిజిపి శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరిని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా – వెట్టిచాకిరి నిర్మూలన రాష్ట్రస్థాయి సమన్వయ సదస్సు పోలీస్ మహిళా భద్రతా విభాగం, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేటలోని ఓ హోటల్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడం ద్వారా వలసలను, అక్రమ రవాణాను అడ్డుకోవచ్చన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో విఫలమైతే మనం కూడా ఆ సమస్యలో భాగస్వాములమేననంటూ అందరూ సమష్టి బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ వెట్టిచాకిరి అనేది కేవలం కార్మిక వివాదం కాదని, అది వంచన, బలవంతపు శ్రమతో కూడిన తీవ్రమైన వ్యవస్థీకృత నేరమని పేర్కొన్నారు. ఉపాధి పేరిట తప్పుడు వాగ్దానాలతో ముఠాలు అమాయకులను బందీగా చేసుకుంటున్నాయని, ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు, వివిధ శాఖల సమన్వయంతోనే బాధితులను రక్షించి నిందితులను పట్టుకోగలమని వివరించారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ సమాజంలో లైంగిక అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ కంటే వెట్టిచాకిరి ఎక్కువగా ఉన్నా అది కంటికి కనిపించకుండా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పేరిట చేసే వెట్టిచాకిరిని సివిల్ వివాదంగా కాÅ£ క్రిమినల్ నేరంగా పరిగణించాలని, బాధితుల గౌరవం, పునరావాసమే ప్రాధాన్యంగా ముందుకు సాగాలని మూడు కీలక అంశాలను సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ మాట్లాడుతూ బాధితులను రక్షించడమే విజయం కాదని, వారికి సరైన ఉపాధి, సామాజిక భద్రత కల్పించినప్పుడే వారు తిరిగి అక్రమ రవాణా బారిన పడకుండా ఉంటారని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించకపోవడాన్ని బలవంతపు శ్రమగా న్యాయస్థానాలు గుర్తించాయని, బాధితులకు న్యాయం చేకూర్చడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వెట్టిచాకిరి అంతమవుతుందన్నారు. బాలకార్మిక వ్యవస్థ పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తుందని, పోలీసు, కార్మిక శాఖల అధికారులు బాధితుల పట్ల అత్యంత సానుభూతితో, మానవీయ కోణంలో వ్యవహరించాలని కోరారు. సదస్సులో అధికారులు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





