– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పేదలకు శుక్రవారం స్మార్టు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇవాళ సన్న బియ్యం గురించి ఒకరు.. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొకరు.. ఆరోగ్యశ్రీ గురించి మరొకరు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ వేర్వేరు కాదు.. అవి నాణేనికి బొమ్మాబొరుసు వంటివన్నారు. ఆ పార్టీల నాయకులను అడుగుతున్నా.. ఏనాడైనా సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని మీరు ఆలోచించారా అని అడిగారు. సన్న బియ్యం ప్రతీ పేద ఇంటికి చేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రతీ పల్లెలో రైతులకు తాము 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నది నిజం కాదా అన్నారు. ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడారు.. కానీ సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్న వాస్తవం మీ కళ్ల ముందున్నది.. రైతు భరోసా రూ.2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నాం. రూ.36 వేల కోట్లు రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశాం.. ఈ వేదికగా కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. రైతులకు మేం చేసిన మేలు ఏంటో.. మీరు చేసిన అన్యాయం ఏంటో శాసనసభలో చర్చిద్దాం రండి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.21 వేల కోట్లు ఖర్చు చేసి రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో రుణం లేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని, ఇది తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కాదా అని అన్నారు. రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వంలో ఉందన్నారు. రెండున్నరేళ్లలో రూ.లక్షా 70 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నానన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు ఏ ఒక్కరికైనా ఇచ్చారా.. కానీ మీ తమ్ముడిగా తాను రెండేళ్లల్లో ఏడు లక్షల ఇండ్లు మంజూరు చేశానని చెప్పారు. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు రాష్ట్రంలో లేదు.. ఉండదు అని అన్నారు. ఒంటరి మహిళలకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తాం.. అర్హులు దరఖాస్తు చేసుకోండి.. పెన్షన్లు అందించే బాధ్యత మాది అని ఆయన హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో పది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ప్రతీ ఆరు నెలలకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తమదేనŠన్నారు. రాజకీయం కోసం.. అధికారం కోసం కొందరు కుట్రలు చేస్తున్నారు.. వారి మాయలో పడకండి.. పరీక్షలకు సిద్ధమవ్వండి అని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేశారు. మీ హక్కులను కాదనం.. అవకాశాలను తొలగించం అని అన్నారు. అడుగు పెడితే సోషల్ మీడియాలో పోస్టు పెట్టే వాళ్లు తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారని రేవంత్ ప్రశ్నించారు. వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం మనపై ఉంది.. అందుకే ఎల్ నినో కరువులోనూ ఎల్లంపల్లి నిండింది అన్నారు. మీ ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుతున్నానన్నారు. సంగారెడ్డిలో పోటీ చేయాలా వద్దా అనేది జగ్గారెడ్డి చేతిలో కూడా లేదు.. అది రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది.. రాహుల్ గాంధీ రాముడైతే జగ్గన్న హనుమంతుడి లాంటివాడు.. జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరు.. ఎన్నికల్లో ఓడినా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారన్నారు. అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి.. ఆయనకు మీరు అండగా ఉండాలి అని రేవంత్ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ సురేష్ షెట్కర్, నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
విగ్రహాల ఆవిష్కరణ
సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
——————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





