– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, మహనీయుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను మÖడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు జమలాపురం కేశవరావు, అయితం వెంకటేశ్వర్లు, కొత్త జనార్దన్ రావు, లచ్చమ్మ, జైనాబి, షోయబుల్లా ఖాన్ త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమగ్ర నివేదికను ఆయన వెల్లడించారు.
ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:
1.వ్యవసాయం, రైతు సంక్షేమం : 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు రైతు భరోసా జమ. రుణ మాఫీ: 1,31,760 మంది రైతులకు రూ.912.10 కోట్లు విడుదల. రైతు బీమా: 803 కుటుంబాలకు రూ.40.15 కోట్ల ఆర్థిక సాయం. మొక్కజొన్న కొనుగోలు: 44,568మంది రైతుల నుండి రూ.681.49 కోట్ల విలువైన 2,83,956 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు సేకరణ. 129 రైతు వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటలపై నిరంతర శిక్షణ.
2.విద్య, మానవ వనరుల అభివృద్ధి
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు సెంట్రలైజ్డ్ మెకనైజ్డ్ కిచెన్ వ్యవస్థ, బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు. వైరా(ఏన్కూర్), సత్తుపల్లి(తల్లాడ), పాలేరు (తిరుమలాయపాలెం), మధిర (సిరిపురం) నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) ఏర్పాటు.
3. వైద్యం, ఆరోగ్యం : ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనం పూర్తి. క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్, 2డీ ఎకో సŸదుపాయాలు అందుబాటులోకి. వైరా(రూ.37.50 కోట్లు), కూసుమంచి (రూ.45.50 కోట్లు)లలో వంద పడకల ఏరియా హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతం. తిరుమలాయపాలెం, వైరా, కల్లూరు, పెనుబల్లి, నేలకొండపల్లి హాస్పిటల్స్‌లో నూతన డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు.
4. నీటిపారుదల, మౌలిక వసతులు
సీతారామ ఎత్తిపోతల పథకం: పాలేరు లింక్ కాల్వ ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు.
వరద నివారణ: ఖమ్మం నగరంలో మున్నేరు వరదల నియంత్రణకు రూ.525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం.
రహదారుల అభివృద్ధి: రూ.1,583 కోట్లతో కోదాడ-ఖమ్మం ఎన్‌హెచ్-365-ఎ నాలుగు వరుసల రహదారి 100 శాతం పూర్తి. రూ.180 కోట్లతో మున్నేరు తీగల వంతెన నిర్మాణం.
5.మహిళా సాధికారత అండ్ ఉచిత రవాణా
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో జిల్లావ్యాప్తంగా 6.14 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు; రూ.326.73 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరించింది. ఇందిరా మహిళా డెయిరీ కింద మధిర నియోజకవర్గంలో రూ.2 కోట్లతో పైలట్ ప్రాజెక్టు కింద మహిళలకు సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ. తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లు 16,243కు గాను 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు రూ.454.97 కోట్లు అందజేత. రెండో విడతలో మరో 10,400 గృహాలు మంజూరు.
6. విద్యుత్, పునరుత్పాదక ఇంధనం
200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే 2,49,454 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద రూ.257.22 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్. మోడల్ సోలార్ గ్రామాలు: బోనకల్ మండలం సహా పలు గ్రామాలలో రూ.16.04 కోట్లతో సోలార్ విద్యుత్ అభివృద్ధి పనులు. 379 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.
7. పర్యాటక రంగం అండ్ భూ రీ-సర్వే : ఖమ్మం ఖిల్లాపై రూ.15 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టు, పాలేరు సరస్సుకు రూ. 5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి రూ.2.50 కోట్లు మంజూరు. భూ రికార్డుల రీ-సర్వే: 96 సంవత్సరాల తర్వాత తెలంగాణ సర్వే అండ్ సరిహద్దుల చట్టం-1923 ప్రకారం కాకరవాయి, బేతుపల్లి, భాగవత్‌వీడు గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ ప్రారంభం.
ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు 
– స్మార్టు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి
ప్రజా ప్రభుత్వం పాలకుల కోసం కాక ప్రజల కోసం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల ఉజ్వల భవిష్యత్తు, ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం పెద్ద పండుగ రోజని, ఇది కుýమతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ జరుపుకునేట జాతీయ పండుగ అని అన్నారు. దేశ స్వాతంత్య్రాన్ని, భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని మనకు అందించిన మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం అని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 1.15 కోటి కుటుంబాలు ఉంటే అందులో 1.06 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని, వాటి ద్వారా 3 కోట్ల 42 లక్షల 57 వేల మందికి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తోందని భట్టి వివరించారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు చెల్లిస్తున్నదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అన్నీ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని అందరూ అనుకున్నారు కానీ అలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆ పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే మనకు మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరంతా ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ ఖర్చులు చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండేవని చెప్పారు. ఆ పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మొత్తాన్ని రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ రేషన్ కార్డు ద్వారా పొందవచ్చన్నారు. ఖమ్మం జిల్లాలోనే గతంలో 4 లక్షల 73 వేల 275 కార్డులు ఉంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా 62,158 రేషన్ కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని ప్రజా ప్రభుత్వం కల్పించిందని, మహిళలు తీసుకునే టికెట్‌కు ప్రభుత్వం లెక్కగట్టి ఆర్టీసీకి చెల్లిస్తోందని చెప్పారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





