“సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు, వేగంగా మారుతున్న ఉద్యోగ ప్రపంచం మధ్య పెరిగిన జెన్ జెడ్ తరం ఉద్యోగాన్ని కేవలం జీతంతో కొలవడం లేదు. పని–వ్యక్తిగత జీవితం సమతుల్యత, పనిలో స్వేచ్ఛ, నైపుణ్యానికి గుర్తింపు, ఆర్థిక స్వయంసమృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాబోయే జెన్ ఆల్ఫా తరం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతల మధ్య పెరగనుంది. ఈ మార్పును క్రమశిక్షణారాహిత్యంగా కాకుండా, మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు యువత ఇస్తున్న ప్రతిస్పందనగా పాలకులు అర్థం చేసుకోవాలి..”

jmrdunga@gmail.com
భారత్ వద్ద ఉన్న అతిపెద్ద వనరు యువశక్తి. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం 15–29 ఏళ్ల వయసు వారు దేశ జనాభాలో 27.2 శాతం. ఈ భారీ మానవ వనరును నైపుణ్యం, ఉపాధి, ఆవిష్కరణలుగా మలచగలిగితే జనాభా ప్రయోజనం ఆర్థిక శక్తిగా మారుతుంది. యువత ఆకాంక్షలకు తగిన అవకాశాలు కల్పించలేకపోతే అదే జనాభా ప్రయోజనం సామాజిక, ఆర్థిక ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంది.
సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు, వేగంగా మారుతున్న ఉద్యోగ ప్రపంచం మధ్య పెరిగిన జెన్ జెడ్ తరం ఉద్యోగాన్ని కేవలం జీతంతో కొలవడం లేదు. పని–వ్యక్తిగత జీవితం సమతుల్యత, పనిలో స్వేచ్ఛ, నైపుణ్యానికి గుర్తింపు, ఆర్థిక స్వయంసమృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాబోయే జెన్ ఆల్ఫా తరం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతల మధ్య పెరగనుంది. ఈ మార్పును క్రమశిక్షణారాహిత్యంగా కాకుండా, మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు యువత ఇస్తున్న ప్రతిస్పందనగా పాలకులు అర్థం చేసుకోవాలి.
అయితే ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు విస్తరించడం లేదు. విద్యా అర్హతలకు పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న నైపుణ్య అంతరం యువ ఉపాధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువతలోనూ నిరుద్యోగిత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థ–ఉపాధి మార్కెట్ మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తోంది. పట్టా ఉద్యోగానికి హామీ ఇవ్వని పరిస్థితిలో వృత్తి విద్య, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణకు ప్రాధాన్యం పెరగాలి. విద్యాసంస్థల విజయాన్ని కేవలం ఉత్తీర్ణతతో కాకుండా, విద్యార్థులు పొందిన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలతోనూ కొలవాల్సిన సమయం వచ్చింది.
గిగ్ ఆర్థిక వ్యవస్థ ఈ మారుతున్న ఉపాధి స్వరూపానికి మరో ఉదాహరణ. నీతి ఆయోగ్ ప్రకారం 2020–21లో దేశంలో సుమారు 77 లక్షల మంది గిగ్ కార్మికులు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు చేరవచ్చని అంచనా. డిజిటల్ వేదికలు యువతకు వేగంగా ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నా, ఆదాయ స్థిరత్వం, ఆరోగ్య బీమా, పింఛను, సామాజిక భద్రత వంటి అంశాల్లో లోటు ఉంది. గిగ్ ఉపాధి విస్తరిస్తున్న కొద్దీ దానికి అనుగుణమైన సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించడం ప్రభుత్వాల బాధ్యత.
ఉపాధి ఆందోళనలతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా యువ విధానంలో కీలక అంశంగా చూడాలి. యూనిసెఫ్ ప్రకారం భారత్‌లో 15–24 ఏళ్ల వారిలో సుమారు 14 శాతం మంది తరచుగా నిరాశకు గురవుతున్నట్లు లేదా తాము ఇష్టపడే పనులపై ఆసక్తి తగ్గినట్లు వెల్లడించారు. విద్యా పోటీ, ఉద్యోగ అనిశ్చితి, సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాల మధ్య యువతకు మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. పాఠశాలలు, కళాశాలల్లో సలహా సేవలను బలోపేతం చేయడంతో పాటు, మానసిక సమస్యలకు సహాయం కోరడంపై ఉన్న సంకోచాన్ని తొలగించాలి.
మహిళా యువత ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం మరో కీలక సవాలు. 2026 మేలో 15 ఏళ్లు పైబడిన మహిళల శ్రామిక భాగస్వామ్య రేటు 32.8 శాతంగా నమోదైంది. రవాణా, భద్రత, కుటుంబ సంరక్షణ బాధ్యతలు, స్థానికంగా తగిన ఉద్యోగాల లభ్యత వంటి అనేక అంశాలు మహిళల ఉపాధిని ప్రభావితం చేస్తున్నాయి. సురక్షిత రవాణా, పని ప్రదేశాల్లో అనుకూల వాతావరణం, సంరక్షణ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ కలిసినప్పుడే మహిళల ఆర్థిక భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుంది.
భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి యువతను సిద్ధం చేయడంలో విద్యా సంస్కరణలు కీలకం. ప్రపంచ ఆర్థిక వేదిక 2025 నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడవచ్చు. 9.2 కోట్ల ఉద్యోగాలు స్థానభ్రంశం చెందవచ్చు. అంటే సాంకేతిక మార్పు ఉద్యోగాలను పూర్తిగా మాయం చేయడం కంటే వాటి స్వరూపాన్ని మార్చే ప్రక్రియగా మారుతోంది. విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, డిజిటల్ అక్షరాస్యత, కృత్రిమ మేధస్సు వినియోగం, ఆర్థిక నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణమైన నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే అభివృద్ధి చేయాలి. బట్టీ విద్య నుంచి సామర్థ్యాధారిత విద్య వైపు మలుపు తిప్పాలి.
ఈ అవకాశాలు మహానగరాలకే పరిమితం కాకూడదు. రెండో, మూడో శ్రేణి పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఆవిష్కరణ కేంద్రాలు, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం, డిజిటల్ ఉపాధి అవకాశాలను విస్తరించాలి. స్థానిక వనరులు, స్థానిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది. యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థితికి తీసుకెళ్లడమే దీర్ఘకాలిక లక్ష్యం కావాలి.
యువతను ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ క్రియాశీల భాగస్వాములుగా చూడాలి. స్థానిక సంస్థల నుంచి జాతీయ స్థాయి వరకు విధాన రూపకల్పనలో యువత అభిప్రాయాలకు స్థానం కల్పించాలి. క్రీడలు, కళలు, ప్రజాసేవ వంటి రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా నాయకత్వం, సామాజిక బాధ్యత, బృందపని వంటి లక్షణాలను పెంపొందించవచ్చు.
యువ జనాభా ప్రయోజనం శాశ్వతం కాదు. ఆ దశలో మానవ మూలధనంపై పెట్టుబడి పెట్టినప్పుడే అది ఉత్పాదకత, ఆదాయం, ఆవిష్కరణగా మారుతుంది. విద్య–నైపుణ్యం–ఉపాధి మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం, గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, యువత మానసిక ఆరోగ్యాన్ని విధాన అంశంగా చూడడం, మహిళలకు ఉపాధికి అనుకూల వాతావరణం కల్పించడం, చిన్న పట్టణాలు–గ్రామీణ ప్రాంతాలకు అవకాశాలను విస్తరించడం ఇప్పుడు అత్యవసరం. యువత సంఖ్య భారత్‌కు ఒక అవకాశం మాత్రమే. ఆ సంఖ్యను నైపుణ్యంగా, నైపుణ్యాన్ని ఉపాధిగా, ఉపాధిని ఉత్పాదకతగా మలచినప్పుడే అది నిజమైన జనాభా ప్రయోజనం అవుతుంది. యువత భవిష్యత్తును నిర్మించడం అంటే భారత ఆర్థిక భవిష్యత్తుకు పునాది వేయడమే.





