ఎన్నికల సందర్భంగా వోట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల హామీలు .. వాటి అమలు పై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఉచిత పథకాల హామీ అమలు ప్రభుత్వ ఖజానా పై భారీ భారం పడుతుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. బ్యాంక్ ల నుండి దేశ జనాభాలో అతి స్వల్ప సముదాయంగా ఉన్న పరిశ్రమలు .. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న అప్పుల ఎగవేత .. బ్యాంక్ వాటిని మాఫ్ చేయడం.. పరిశ్రమల కోసం ప్రభుత్వాలు చేస్తున్న భూ సంతర్పణ .. సబ్సిడీ లతో పోలిస్తే అర్హులైన వారికి ఉచిత పథకాలకు బడ్జెట్ లో కేటాయిస్తున్న మొత్తం తో మరి కొందరు ఆర్థిక నిపుణులు , ప్రజాసంఘాలు పోలుస్తున్నారు… అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత పథకాలు అందాలని వారి అభిప్రాయం.
విచక్షణారహితంగా ఉచిత పథకాలను విస్తరించడం అది అభివృద్ధిని ఎలా కుంటుపరుస్తున్నదానిపై ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ వాదన మళ్ళీ చర్చనీయాంశం అయింది . రాష్ట్రంలో గత కొంతకాలంగా నలుగుతున్న ఒక క్లిష్టమైన ఆర్థిక సవాలును ఈ వ్యాఖ్యలు తెరపైకి తెచ్చాయి. ఈ నెల 7న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ నాగేష్ భీమపాక “ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి” అని హెచ్చరిస్తూ, ప్రస్తుత ధోరణి దీర్ఘకాలంలో గణితశాస్త్ర పరంగా అసాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 1.15 కోట్ల కుటుంబాలలో, ఏకంగా 1.03 కోట్ల నుండి 1.05 కోట్ల కుటుంబాలు విభిన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నాయనే దిగ్భ్రాంతికరమైన గణాంకాలను హైకోర్టు ఎత్తిచూపింది. ఒక రాష్ట్రం తన మొత్తం జనాభాలో దాదాపు 90% మందికి సబ్సిడీలను విస్తరించినప్పుడు, అర్హులైన పేదలకు అందించే సామాజిక భద్రతకు, ఎన్నికల లబ్ధి కోసం చేసే ఉచిత ప్రకటనలకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నది. ఒక రాష్ట్ర ఆదాయం ప్రధానంగా స్థిర ఖర్చులు (ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, గత అప్పులపై వడ్డీలు), సంక్షేమ పంపిణీలు, మరియు మూలధన ఆస్తుల సృష్టి అనే భాగాలుగా విభజించబడుతుంది.
ఇటీవల కాగ్ నివేదికలు మరియు బడ్జెట్ సమీక్షల ప్రకారం, తెలంగాణ మొత్తం రెవెన్యూ ఆదాయంలో దాదాపు 45% నుండి 51% వరకు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు పేరుకుపోయిన అప్పుల వడ్డీల చెల్లింపులకే సరిపోతున్నది. మిగిలిన ఆదాయాన్ని ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, నాణ్యమైన విద్యా సంస్థలను నిర్మించడం, సాగునీటి నెట్‌వర్క్‌లను విస్తరించడం, మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి దీర్ఘకాలిక మూలధన పెట్టుబడుల వైపు మళ్లించడానికి బదులుగా, అత్యధిక భాగం సార్వత్రిక ఉచిత పథకాలకే ధారపోస్తున్నారు.
ఫలితంగా ఏ కొత్త అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టడానికి వీల్లేకుండా పోతున్నది .పథకాల పంపిణీలో సరైన అర్హతలను ప్రామాణికంగా తీసుకోకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాటాలు చేయాల్సి వొస్తుంటే, మరోపక్క ‘రైతు బంధు’ వంటి వ్యవసాయ మద్దతు పథకాల కింద సంపన్నులకు, కోటీశ్వరులకు సైతం నేరుగా నగదు బదిలీలు ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. అర్హత లేదా అవసరాలను సరిచూసుకోకుండా ప్రజల సొమ్మును సార్వత్రిక సబ్సిడీల రూపంలో నిరంతరం ఖర్చు చేస్తూ పోతే, సంపదకు అధిపతి అయిన ఆ కుబేరుడైనా సరే దివాలా తీయక తప్పదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
.అభివృద్ధి చెందుతున్న సమాజంలో సంక్షేమం అనేది నిస్సందేహంగా అవసరమే. సమాజంలోని అత్యంత వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావడానికి ఒక ప్రభుత్వం బలమైన సామాజిక భద్రతను కల్పించాల్సిన నైతిక బాధ్యత ఉంది. అయితే, సార్వత్రిక ఉచితాల స్థానంలో ఖచ్చితమైన అర్హతలను ప్రామాణికంగా తీసుకోవాలి. విలాసవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉండి, సొంత వాహనాల్లో తిరిగే సంపన్నులు కూడా నిరుపేదల కోసం ఉద్దేశించిన వనరులను వాడుకుంటుంటే, అది నిజమైన పేదలకు మరియు నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు చేసే ద్రోహమే అవుతుంది.
హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పాలకులకు ఒక సమయోచితమైన హెచ్చరిక. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించుకోవాలి. తక్షణ ఎన్నికల లబ్ధి కంటే దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, మరియు మౌలిక సదుపాయాల సృష్టికి ప్రాధాన్యతనిచ్చేలా పారదర్శక బడ్జెట్ ప్రతిపాదనలతో సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేయాలి. ప్రభుత్వ ఖజానాను రాజకీయ ప్రయోజనాల కోసం అపరిమిత క్రెడిట్ కార్డులా వాడుకుంటూ పోతే, తక్షణ రాజకీయ తృప్తి కోసం తెలంగాణ తన భవిష్యత్తు అభివృద్ధిని బలిపెట్టక తప్పదు.





