– ‘ఇమేజ్’పై దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు
– సమాజం అప్రమత్తం కావాలి
– కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యం
– ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 5: ప్రస్తుత కాలంలో యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఇది సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటి. గంజాయి వంటి మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. కుటుంబ వ్యవస్థను, సమాజ నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. యువత డ్రగ్స్ వైపు మళ్లడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పున్నంచందర్. స్నేహితుల ప్రభావం, కుతూహలం, చదువు, ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబంలో భావోద్వేగ మద్దతు లోపం వంటి అంశాలు ప్రధానమైనవన్నారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రగ్స్ నుంచి యువతను కాపాడడంపై ప్రత్యేక కథనం.
సోషల్ మీడియా, సినిమా ప్రభావం
సోషల్ మీడియా, సినిమా యువతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిర్ణీస్, సోషల్ మీడియా కంటెంట్‌లో మత్తు పదార్థాల వినియోగాన్ని స్టైల్‌గా, ఫ్యాషన్‌గా చూపడంతో యువత వాటివైపు ఆకర్షితులవుతున్నారు. సెలబ్రిటీలు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు చూపినప్పుడు ఇది సాధారణం అనే భావన యువతలో కలుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ అవుతున్న వీడియోలు, ట్రెండ్స్ కూడా ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. యువత లైకులు, ఫాలోవర్స్ కోసం ప్రమాదకర ప్రవర్తనలను అనుసరించే పరిస్థితి నెలకొంది. దీని వల్ల వారు వాస్తవ జీవితం కంటే ‘ఇమేజ్’పై ఎక్కువ దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి.
గంజాయితో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు
గంజాయి వంటి డ్రగ్స్ వాడకం యువత మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్షీణించడం, ఆందోళన, భయం పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. దీర్ఘకాలంలో సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గుండె వేగం పెరగడం, నిద్రలో మార్పులు, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హార్మోన్లలో అసమతుల్యత వ్యక్తి మానసిక, శారీరక సమాతాస్థితిని చిన్నాభిన్నం చేస్తుంది. డ్రగ్స్ వాడకం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. డోపమైన్ స్థాయిలు అసహజంగా పెరిగి తర్వాత తగ్గిపోవడం వల్ల డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో ఇది వ్యక్తి వ్యక్తిత్వాన్ని మార్చే ప్రమాదం ఉంది. మొదట కుతూహలంతో ప్రారంభమైన వినియోగం క్రమంగా అలవాటుగా, చివరకు వ్యసనంగా మారుతుంది. తక్కువ ఆత్మవిశ్వాసం, ఒంటరితనం, భావోద్వేగ నొప్పి వంటి అంశాలు దీనికి దారితీస్తాయి.
కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యమేనా?
డ్రగ్స్ వ్యసనాన్ని తగ్గించడంలో కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా వ్యక్తిలో ఆలోచనా విధానాన్ని మార్చి ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి చూపించవచ్చు. మోటివేషనల్ కౌన్సెలింగ్ ద్వారా వ్యసనం నుంచి బయటపడాలనే సంకల్పాన్ని పెంచవచ్చు.
సైకాలజిస్ట్‌లది కీలక పాత్ర
వ్యసన నిర్మూలనలో కీలక వ్యక్తి సైకాలజిస్ట్ (మనోవికాస నిపుణుడు). డ్రగ్స్ వ్యసనం శారీరక సమస్యే కాదు. ఇది లోతైన మానసిక, భావోద్వేగ, సామాజిక కారణాలతో కూడిన సంక్లిష్ట సమస్య. దీనిని సమర్థంగా ఎదుర్కోవడంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం. మొదటగా సైకాలజిస్ట్ ఒక వ్యక్తి వ్యసనం స్థాయిని శాస్త్రీయంగా అంచనా వేస్తారు. వ్యక్తి మానసిక స్థితి, ఆలోచనా విధానం, భావోద్వేగ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను విశ్లేషించి సమస్య మూలాలను గుర్తిస్తారు. ప్రతి వ్యక్తి పరిస్థితి వేర్వేరు కావడంతో వారికి తగిన విధంగా ప్రత్యేకమైన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తారు. డ్రగ్స్ వినియోగం వెనుక ఉన్న ట్రిగర్స్ (ప్రేరేపకాలు) ఒత్తిడి, ఒంటరితనం, నిరాశ, స్నేహితుల ప్రభావం వంటివి గుర్తించి వాటిని ఎలా ఎదుర్కోవాలో వ్యక్తికి నేర్పడం ద్వారా వ్యసనాన్ని తగ్గించవచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) ద్వారా వ్యక్తిలోని నెగటివ్ ఆలోచనలను మార్చి సానుకూల ఆలోచనల వైపు దారి చూపిస్తారు. డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ (డీబీటీ) ద్వారా భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడి నిర్వహణ, మైండ్‌ఫుల్‌నెస్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ ద్వారా వ్యక్తిలో మార్పు పట్ల ఆసక్తిని పెంచి నేను మారాను అనే అంతర్గత ప్రేరణను పెంపొందిస్తారు. సైకాలజిస్టులు ఆ వ్యక్తితో మాత్రమే కాక కుటుంబ సభ్యులతో కూడా పనిచేస్తారు. కుటుంబంలో సరైన అవగాహన, మద్దతు లేకపోతే వ్యసనానికి మళ్లీ గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఫ్యామిలీ థెరపీ ద్వారా కుటుంబ సభ్యులకు సమస్యను అర్థం చేయించి ఎలా మద్దతు ఇవ్వాలో మార్గదర్శనం చేస్తారు. వ్యసనం నుంచి బయటపడిన తర్వాత కూడా మళ్లీ అదే అలవాటు రావడం సాధారణం. దీనిని రిలాప్స్ అంటారు. దీన్ని నివారించేందుకు సైకాలజిస్టులు ప్రత్యేకమైన రిలోప్స్ ప్రివెన్షన్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించి వాటిని ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో వ్యసనం డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సైకాలజిస్టులు క్రైసిస్ ఇంటర్వెన్షన్ ద్వారా వ్యక్తిని రక్షించి అవసరమైన చికిత్సకు మార్గం చూపుతారు. సమాజ స్థాయిలో కూడా వీరి పాత్ర విశేషం. పాఠశాలలు, కాలేజీలు, పరిశ్రమలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతకు జీవన నైపుణ్యాలు, ఒత్తిడి నిర్వహణ పద్ధతులు నేర్పించడం ద్వారా వ్యసనాన్ని ముందుగానే నివారించగలుగుతున్నారు. సైకాలజిస్టు కేవలం చికిత్స అందించే వ్యక్తే కాదు.. మార్గదర్శకుడు, ఉపాధ్యాయుడు, మద్దతుదారు, సమాజ మార్పునకు దారి చూపించే నాయకుడు కూడా.
నివారణే ఉత్తమ మార్గం
డ్రగ్స్ సమస్య తొలగాలంటే నివారణ చర్యలు అత్యవసరం. కుటుంబంలో పిల్లలతో సమయం గడపడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, సమాజ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలి. కుటుంబం, విద్యా వ్యవస్థలో మార్పు అవసరం. మార్కులపైనే దృష్టి పెట్టే విద్యా విధానం, పిల్లల భావోద్వేగాలపై తక్కువ శ్రద్ధ, తల్లిదండ్రుల బిజీ జీవితం వంటి అంశాలు కూడా సమస్యను పెంచుతున్నాయి. విలువల ఆధారిత విద్య, భావోద్వేగ నైపుణ్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
సమాజం అప్రమత్తం కావాలి 
వేగవంతమైన జీవనశైలి, డిజిటల్ ప్రభావం, ఒంటరితనం పెరగడం వంటివి యువతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం, విద్యా సంస్థలు, కుటుంబాలు, నిపుణులు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనగలం. డ్రగ్స్ వ్యసనపరుల్లో ముగింపు ఎలా అనేది మార్పు అనే కోణంలోనే ఉంటుంది. యువతను మత్తు బారినుంచి కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సరైన అవగాహన, బాధ్యతాయుత మీడియా వినియోగం, ప్రేమ, మద్దతు ఉంటే ఈ సమస్యను తగ్గించడం సాధ్యమేనని సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పున్నంచందర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





