సులభతర వ్యాపార విధానంతో పెట్టుబడులు

– నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగావకాశాలు
– సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రఘురామ్‌తో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానం మీద ఆధారపడి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని రఘురామ్ రాజన్ అన్నారు. అయితే స్టార్టప్‌లను ఎక్కువ ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని సూచించారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిలబస్‌లో ఏఐ ఉపయోగంపై కమిటీ ఏర్పాటు చేస్తామని, తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రఘురామ్ రాజన్‌ను కోరారు. దీంతోపాటు మిడిల్ లెవల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు  వివరించారు. సరైన పద్దతిలో ఏఐని వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చునని సూచించారు. డేటా సెంటర్ల కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి ఉపయోగం ఉంటుందని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మూడునాలుగు నెలల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తానని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, భూమితోపాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు అనేక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు రేడియల్ రోడ్లు, పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌లో అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన రఘరామరాజన్‌ను కోరారు. సులభతర వ్యాపారానికి అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావరణం, వసతులు కల్పిస్తున్నట్లు ఆయన రఘురామ్ రాజన్‌కు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వాణీప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎంను కలిసిన రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు 

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంగళవారం కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పంట మార్పిడిపై ముఖ్యమంత్రికి కమిషన్ నివేదిక అందజేసింది. పంట మార్పిడిపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వారితో చెప్పారు. అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసామన్నారు. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని రైతు కమిషన్‌ను సీఎం కోరారు. సమావేశంలో పశు సంవర్ధక, క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *