15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళల పెంపు

  • భూముల ధరల సవరణ నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల డిమాండ్ 
  • స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంపునకు ఆదేశం
  • మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 9 : రాష్ట్రంలో భూముల ధరల సవరణ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల రద్దీ ఎక్కువగా ఉన్న 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళలను పొడిగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో  రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్  పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  మంత్రి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధిక రద్దీ ఉన్న చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్.ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పని వేళలను  ఈ నెల 12వ తేదీ నుంచి పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ పదిహేను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవసరమైతే మరింత సమయాన్ని పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
అదేవిధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.   రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని పెంచాలని సూచించారు.  అలాగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహసీల్దార్ కార్యాలయాలను కూడా సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.  రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం, ప్రజలకు సౌకర్యం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పనిచేస్తోందని దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు ను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *